AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Alert: ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా.. మూడు రోజుల పాటు వాతావరణం ఎలా ఉంటుందంటే..?

తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజులు వాతావరణం భిన్నంగా ఉండనుంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాంలలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరోవైపు నైరుతి రుతుపవనాల తిరోగమనంతో తెలంగాణలో వర్షాలు తగ్గి, పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Weather Alert: ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా.. మూడు రోజుల పాటు వాతావరణం ఎలా ఉంటుందంటే..?
Ap And Telangana Weather Update
Krishna S
|

Updated on: Oct 09, 2026 | 3:05 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, తెలంగాణలో మాత్రం పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. దక్షిణ భారతదేశంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, దిగువ ట్రోపో ఆవరణంలో వీస్తున్న ఉత్తర, ఈశాన్య గాలుల ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొమరిన్ ప్రాంతం నుండి మరాఠ్వాడ వరకు విస్తరించి ఉన్న ద్రోణి.. ప్రస్తుతం తమిళనాడు, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది.

కోస్తాంధ్ర – యానాం

శుక్ర, మంగళవారాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. అక్కడక్కడా మెరుపులు రావచ్చని, గంటకు 30 నుండి 40 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే వీలుందని అధికారులు తెలిపారు. ఆదివారం ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు కొనసాగుతాయి.

రాయలసీమ

రాయలసీమ వ్యాప్తంగా రాగల రెండు రోజుల పాటు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. మూడో రోజు సైతం తేలికపాటి జల్లులు, గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణ: తిరోగమిస్తున్న రుతుపవనాలు.. పొడి వాతావరణం

తెలంగాణలో రాగల మూడు రోజులు వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాల తిరోగమన రేఖ ప్రస్తుతం హైదరాబాద్, బీజాపూర్, బెళగావి, రాంచీ మీదుగా సాగుతోంది. రాబోయే 3-4 రోజుల్లో తూర్పు భారతదేశంతో పాటు తెలంగాణ పరిసర ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాలు మరింతగా వెనక్కి తగ్గేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. పశ్చిమ అస్సాం, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణ వరకు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతున్నప్పటికీ, రాష్ట్రంలో వర్ష సూచన లేదని, పొడి వాతావరణమే ఉంటుందని స్పష్టం చేశారు.

రైతులు, ప్రజలకు సూచన

కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున రైతులు, వ్యవసాయదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఆశ్రయం పొందవద్దని సూచించారు.

Follow Us