AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అన్నదాతపై ప్రకృతి కన్నెర్ర.. అతివృష్టి, అనావృష్టితో అవస్థలు.. ప్రభుత్వం ఆదుకోమంటూ వేడుకోలు..

ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చే సరికి తుఫాన్ కారణంగా నీట మునగడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు రైతన్నలు. వర్షం బారిన పడకుండా కొంతమేర అయినా కాపాడుకుందాం అని రైతులు నానా అవస్థలు పడ్డారు. పంటను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడ్డారు. రైతులంతా ఒకేసారి పొలంబాట పట్టడంతో కూలీలు కూడా దొరక్క తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఆడ, మగ అని తేడా లేకుండా కుటుంబం అంతా పొలాలకు వెళ్లి తమ పంటను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించారు.

Andhra Pradesh: అన్నదాతపై ప్రకృతి కన్నెర్ర.. అతివృష్టి, అనావృష్టితో అవస్థలు.. ప్రభుత్వం ఆదుకోమంటూ వేడుకోలు..
Cyclone Michaung Effect
Gamidi Koteswara Rao
| Edited By: Surya Kala|

Updated on: Dec 08, 2023 | 11:31 AM

Share

మూలిగే నక్క పై తాటికాయ పడినట్లుగా మారింది విజయనగరం జిల్లా రైతుల పరిస్థితి. నిన్న మొన్నటి వరకు చుక్క నీరు లేక కరువుతో అల్లాడి పచ్చని పొలాలు ఎండిపోయి గేదెలకు ఆహారంగా మారితే ఇప్పుడు మిచౌంగ్ తుఫాన్ మరోసారి రైతుల నడ్డి విరిచింది. మిచౌంగ్ తుఫాన్ ప్రభావం జిల్లా పై తీవ్రంగా పడింది. సుమారు మూడు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం వల్ల వరి తో పాటు పలు రకాల వాణిజ్య పంటలు పెద్ద ఎత్తున దెబ్బ తిన్నాయి. ప్రస్తుత వర్షాల వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. వేలాది ఎకరాల్లో వరి కోతలు కోసి పొలాల్లో ఉంచగా, మరి కొంత వరి కోతకు సిద్ధంగా ఉంది. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చే సరికి తుఫాన్ కారణంగా నీట మునగడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు రైతన్నలు. వర్షం బారిన పడకుండా కొంతమేర అయినా కాపాడుకుందాం అని రైతులు నానా అవస్థలు పడ్డారు.

పంటను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడ్డారు. రైతులంతా ఒకేసారి పొలంబాట పట్టడంతో కూలీలు కూడా దొరక్క తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఆడ, మగ అని తేడా లేకుండా కుటుంబం అంతా పొలాలకు వెళ్లి తమ పంటను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. పంట చేతికొచ్చే సమయంలో ఇలా తుఫాన్ ప్రభావంతో నీటి పాలవ్వడంతో లబోదిబోమంటున్నారు రైతులు. ఈ ఏడాది రైతులు వరి నాట్లు వేసిన దగ్గర నుండి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నాట్లు వేసిన కొద్ది రోజుల్లో ఏపుగా పెరిగిన పైరుకు ఎప్పుడూ లేని విధంగా తెగుళ్లు వరి పై దాడి చేశాయి. ఎన్నో ఫెస్టిసైడ్స్ వినియోగించి ఏదో ఒకలా కాపాడుకోగా, తరువాత వర్షాలు లేకపోవడంతో చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఏదో ఒక విధంగా పైరును కాపాడుకునేందుకు చాలా ఖర్చు పెట్టి డీజిల్ ఇంజన్లు ద్వారా నీటిని అందించి సాగు చేశారు.

ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి కొంత మేర పంటను కాపాడుకుంటే ఇప్పుడు తుఫాన్ అల్లకల్లోలం రేపింది. భారీగా కురిసిన వర్షాలతో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. వరితో పాటు మొక్కజొన్న, పత్తి, అపరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జిల్లాలో సుమారు పదిహేను వేల ఎకరాల వరకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. అలాగే తడిసిన ధాన్యాన్ని తాము నష్టపోకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతున్నారు రైతులు.

ఇవి కూడా చదవండి

ముఖ్యంగా ఈ ప్రభావం ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎక్కువగానే కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా గజపతినగరం, మెంటాడ, సాలూరు, జియ్యమ్మవలస మండలాల్లోని రైతులు ఎక్కువగా నష్టపోయారు. తుఫాన్ పరిస్థితులను గమనించి అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి రైతులను అప్రమత్తం చేసినప్పటికీ నష్టం తప్పలేదు. ప్రకృతి కన్నెర్ర తో పెద్దఎత్తున నష్టపోయి అప్పుల పాలయ్యామని తమను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని విన్నవించుకున్నారు రైతన్నలు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..