Gandikota: ప్రకృతి సోయగాల గండికోట..శత్రుదుర్భేధ్య కోటలో కనిపించని రహస్య సంపద!

ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నదికి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చినట్లు స్పష్టం అవుతున్నది. ఈ ఇరుకు లోయలో..

Gandikota: ప్రకృతి సోయగాల గండికోట..శత్రుదుర్భేధ్య కోటలో కనిపించని రహస్య సంపద!
Gandikota Fort
Ashok Vemulapalli

| Edited By: Jyothi Gadda

Jul 05, 2022 | 12:56 PM

Gandikota Fort History: రాజులు పోయినా, రాజ్యాలు పోయినా…వారికి గుర్తుగా ఉన్న గండికోట మాత్రం మిగిలే ఉంది. శ్రీకృష్ణదేవరాయుల కాలంలో ఓ వెలుగు వెలిగిన ఈకోట దాదాపు ఐదు దశాబ్దాలపాటు నాలుగు సామ్రాజ్యాలకు వెన్నుదన్నుగా… హిందూ, ముస్లిం సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా విరాజిల్లింది. శతాబ్దాల కాలంనాటి శిల్పకళా సంపదకు నిలువెత్తు రూపంగా నిలిచిన ఈ గండికోట కాకతీయుల పాలనలోనూ, సకల కళా వైభవంతోనూ అలరారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా,జమ్మలమడుగు తాలూకాలో పెన్నానది ఒడ్డున గల ఒక చిన్న గ్రామమే గండికోట.. ఇక్కడి ఎర్రమల పర్వత శ్రేణినే గండికోట కొండలని కూడా అంటారు.

ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నదికి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చినట్లు స్పష్టం అవుతున్నది. ఈ ఇరుకు లోయలో నది వెడల్పు 300 అడుగులకు మించదు. ఇక్కడి లోయ సుందర దృశ్యం వర్ణనాతీతం. దట్టమైన అడవులు, మనోహరంగా కనిపించే భూతలం మధ్య ఎంతటి బలమైన శతృవుదాడినైనా ఎదుర్కొనడానికి ఈ కోట అనువుగా ఉంది. చుట్టూ లోతైన లోయలతో, ఎర్రటి గ్రానైట్ శిలలతో ఏర్పడిన దుర్బేధ్యమైన కొండలతో, 300 అడుగుల దిగువన పడమర, ఉత్తర దిశలలో ప్రవహించే పెన్నా నదితో, కోట లోపలి వారికి బలమైన, సహజసిద్ధమైన రక్షణ కవచంలా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. గండికోట ప్రాకారంలోని కొంత భాగం వృత్తాకారంలో ఉంటుంది. కోట చుట్టుకొలత దాదాపు ఐదు మైళ్ళుంటుంది. కోట ముఖద్వారానికి ఎత్తైన కొయ్య తలుపులు ఇనుప రేకుతో తాపడం చేయబడి, ఆ తలుపులపై ఇనుప సూది మేకులను ఏర్పాటు చేశారు. కోట ప్రాకారం ఎర్రటి నున్నని శాణపు రాళ్ళతో నిర్మించారు. కొండ రాతి పై పునాదులు లేకుండా గోడలు నిర్మించారు. ఈ గోడలు 10 నుండి 13 మీటర్ల ఎత్తున్నాయి. చతురస్రాకారంలోనుదీర్ఘ చతురస్రాకారంలోను 40 బురుజులున్నాయి. గోడ పైభాగాన సైనికుల సంచారం కోసం 5 మీటర్ల వెడల్పుతో బాట ఉంది. కోట అంతర్భాగంలో మాధవరాయ, రంగనాథ ఆలయాలున్నాయి. ముస్లిం నవాబుల కాలంలో ఈ ఆలయాలను ధ్వంసం చేశారని నానుడి. ఆనాటి శిధిల శిల్పాలు ఇప్పటికీ మనకు దర్శనమిస్తాయి. మీర్ జుమ్లా జామా మసీదును సుందరంగా నిర్మించారు. కోటలో పెద్ద ధాన్యాగారము, మందుగుండు సామాగ్రి గిడ్డంగి, పావురాల గోపురం, మీనార్లు ముఖ్యమైన కట్టడాలు. అంతే కాక జైలు, రంగ్ మహల్ ఉన్నాయి. నీటి వసతి కోసం రాజుల చెరువు, కత్తుల కోనేరు, ఇంకా చాలా చెరువులు, బావులున్నాయి. భూమి అడుగున గొట్టం ద్వారా ఏర్పరచిన నీటి సదుపాయం ఇక్కడి ప్రత్యేకత.

ఇవి కూడా చదవండి

Gandikota Fort2

గతంలో ఈ కోటలో సుందరమైన, ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు, తోటలు ఉండేవి. పెమ్మసాని నాయకులు గండికోటను జనరంజకంగా పాలించినట్లు ప్రతీతి. ఇప్పుడు గండికోటలోని శిథిలాలు, మిగిలి ఉన్న కట్టడాలు ఈ కోట గత వైభవానికి ప్రతీకలుగా నిలిచి ఉన్నాయి. గండికోట జమ్మలమడుగు నుంచి పడమరగా దాదాపు ఆరు మైళ్ళ దూరంలో ఒక పర్వత శ్రేణిపై ఉంది. పెన్నా నదీ ప్రవాహం ఇక్కడి కొండల మధ్య లోతైన గండిని ఏర్పరచడం వల్ల ఈ కోటకు గండికోట అని పేరు వచ్చింది. రెండు మూడు వందల అడుగుల ఎత్తున నిటారుగా ఉండే ఇసుకరాతి కొండల గుండా పెన్నా నదీ ప్రవాహం సాగే నాలుగు మైళ్ళ పొడవునా ఈ గండి ఏర్పడి ఉంటుంది. నదికి దక్షిణతీరాన ఉవ్వెత్తున ఎగసిన కొండల మీద బ్రహ్మాండమైన రక్షణ గోడలున్నాయి. ఇక్కడ చూడదగిన ప్రదేశాల విషయానికి వస్తే… గండికోటలోపల ఉండే మాధవరాయ ఆలయం, రంగనాథ ఆలయాలు చెప్పుకోదగ్గవి. మాధవరాయ ఆలయం గురించి మొట్టమొదటి ప్రస్తావన క్రీ.శ. పదహారవ శతాబ్దానికి చెందిన శాసనాలలో కనిపిస్తుంది. ఆలయంలో మనకు కనిపించే శిల్ప కళా లక్షణాలు, ఆలయనిర్మాణశైలిని బట్టి చూసినా ఆలయ నిర్మాణం అదే కాలంలో జరిగినట్లు తెలుస్తోంది. ఆలయ నిర్మాణాన్నీ, అందలి శిల్పకళారీతుల్నీ, వాటి లక్షణాలనూ విశదంగా అధ్యయనం చేసిన మీదట ఈ ఆలయాన్ని క్రీ.శ.పదహారవ శతాబ్దం తొలినాళ్ళలో (దాదాపుగా 1501-1525 మధ్యకాలంలో) నిర్మించినట్లు చెప్పవచ్చు.

Gandikota Fort 3

ఇక రంగనాథ ఆలయం గురించిన మొట్టమొదటి ప్రస్తావన 1479 (క్రీ.శ.1557) నాటి ఒక శాసనంలో కనిపిస్తుంది. ఆ శాసనం గండికోటలోని రంగనాయకుని గుడికి భూమిని మాన్యంగా ఇచ్చినట్లు తెలుపుతుంది. ఈ ఆలయ నిర్మాణశైలిని బట్టి చూస్తే రంగనాథ ఆలయం నూటికి నూరు పాళ్ళూ విజయనగర రాజుల నిర్మాణమేనని స్పష్టమౌతుంది. ఈ ఆధారాలను బట్టి ఈ ఆలయాన్ని క్రీ.శ. 15 శతాబ్దంలో నిర్మించినట్లుగా చెప్పవచ్చు. ఇంతటి చారిత్రక ప్రాముఖ్యం కలిగిన గండికోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దేందుకు అప్పట్లో ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సంకల్పించారు. ఇందుకుగానూ 10 వేల కోట్ల రూపాయలను అప్పట్లో కేటాయించిన ప్రభుత్వం, రాబోయే నాలుగేళ్ల కాలంలో ఎకో టూరిజం ప్రాంతంగా తీర్చిదిద్దాలని ప్రకటించింది. ఈ ప్రాంతంలో 2వేల ఎకరాలలో సైన్స్‌సెంటర్, ఎంటర్‌టైన్‌మెంట్‌పార్కు, లైట్‌షో, ఫిల్మ్‌సిటీ, నాలెడ్జ్ సిటీ తదితర సౌకర్యాలు కలిగిన సముదాయాలను నిర్మించాలని నిర్ణయించారు. అయితే,  ఆయన అకాల మరణం తర్వాత…. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు గండికోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మాటలు చెప్పారు కానీ చేతల్లో చూపలేదు.. కొద్దో గొప్పో యాత్రికులు బస చేసేందుకు వసతి సౌకర్యాలను నిర్మించారు.

Gandikota Fort1

గండికోట రాయలసీమ జిల్లాలోనే పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుంది. పాడుబడ్డ గుర్రపుశాలలు, రాణి ఆవాసాలులాంటివి నేటికీ ఇక్కడ దర్శనమిస్తున్నాయి. గండికోటను పర్యాటకంగా మాత్రం అభివృద్ది చెందలేదు. ప్రభుత్వాలు మారుతున్నాయే కాని గండికోటను పట్టించుకునే నాధుడే కరువయ్యాడు .. ప్రతి వారం శుక్ర , శని , ఆదివారాలలో ఇక్కడ సందర్శకుల తాకిడి అధికంగానే ఉంటుంది .. కాని అభివృద్ది లేకపోవడంతో యాత్రికులు అర కొర సౌకర్యాలతో ఇక్కడ ఉండలేక పోతున్నారు. ఇప్పటికైనా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వం దీనిపై దృష్టిపెడితే పర్యాటకంగా మంచి ఆదరణ తీసుకురావచ్చన్నది పర్యాటకుల అభిప్రాయం. టూరిజం మంత్రిగా ఉన్న రోజా నైనా గండికోటను పట్టించుకోవాలని, కోట్ల రూపాయలు ఆర్జించే సత్తా ఉన్న గండి కోటను అభివృద్ది పరచాలని స్దానికులు , యాత్రికులు కోరుకుంటున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu