Andhra: ఆ ఊరు పెరుగు తింటే.. మళ్లీ మళ్లీ కావాలంటారు..
రాయదుర్గం పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరిగేదొడ్డి గ్రామం మహిళలు 40 సంవత్సరాలుగా పెరుగును విక్రయిస్తూ వందల కుటుంబాలను పోషిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం పెరుగు కుండలు తీసుకొని రాయదుర్గం పట్టణంలో అమ్మకానికి వెళ్తారు. ప్రభుత్వ ఆర్థిక సహాయం, రుణ సబ్సిడీలు అందితే వారి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది అని గ్రామ మహిళలు అభిప్రాయపడుతున్నారు.

రాయదుర్గం పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో గుమ్మగట్ట మండలం సిరిగేదొడ్డి గ్రామం ఉంది. ఇక్కడ దాదాపు వందల కుటుంబాలకు పాడి పోషణే ఆధారం. ఉదయం పితికిన పాలను పల్లెల్లో విక్రయిస్తారు. సాయంత్రం పాలను తోడు వేసి రాయదుర్గం పట్టణంలో మహిళలు పెరుగును విక్రయిస్తారు. పలు రకాల కంపెనీల పాలు, పెరుగు వచ్చినా సిరిగే దొడ్డి పెరుగుకు మాత్రం రాయదుర్గం చుట్టుపక్కల ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నాణ్యత, రుచిలో దేనికదే సాటి.. గత 40 ఏళ్లుగా రాయదుర్గం పట్టణంలో పెరుగును విక్రయిస్తూ భర్తలకు తోడుగా నిలుస్తున్నారు ఆ ఊరి మహిళలు. సుమారు 100 మంది మహిళలు ఉదయాన్నే పెరుగు కుండలను నెత్తిన పెట్టుకొని నడుచుకుంటూ వచ్చి రాయదుర్గం పట్టణంలో విక్రయించేవారట. ప్రస్తుతం కూడా 40 మంది మహిళలు ప్రతిరోజూ ఆటోలో వెళ్లి.. పెరుగును విక్రయించి లాభాలు ఆర్జిస్తున్నారు. వీరికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయాన్ని అందిస్తే… మహిళల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందంటున్నారు సిరిగేదొడ్డి గ్రామం మహిళలు. బయట బజార్లో మూడు రూపాయలకు వడ్డీ తీసుకుని గేదెలను కొనుక్కొని పెరుగు వ్యాపారం చేసుకుంటున్న తమకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని.. సబ్సిడీపై రుణాలు ఇవ్వాలని కోరుతున్నారు.
