AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag Mayor : వైజాగ్ మేయర్ గా మహిళ.. వైసీపీ అధిష్టానం యోచన.! ఎంపికలో విజయసాయిరెడ్డికే ఫుల్ పవర్స్

Vizag Mayor : వైజాగ్ మేయర్ గా మహిళకు అవకాశం ఇవ్వాలని వైసీపీ అధిష్టానం దాదాపు ఒక నిర్ణయానికి వచ్చింది. పరిపాలనా..

Vizag Mayor : వైజాగ్ మేయర్ గా మహిళ.. వైసీపీ అధిష్టానం యోచన.! ఎంపికలో విజయసాయిరెడ్డికే ఫుల్ పవర్స్
Vizag Mayor Candidate
Venkata Narayana
|

Updated on: Mar 16, 2021 | 4:27 PM

Share

Vizag Mayor : వైజాగ్ మేయర్ గా మహిళకు అవకాశం ఇవ్వాలని వైసీపీ అధిష్టానం దాదాపు ఒక నిర్ణయానికి వచ్చింది. పరిపాలనా రాజధానిగా త్వరలో రూపాంతరం చెందబోతోన్న విశాఖ కు ఒక విద్యావంతురాలైన, సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మహిళకు పట్టం కట్టడం ద్వారా ప్రజల మన్ననలు పొందొచ్చని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, ఈ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోన్న వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించగా విజయసాయిరెడ్డిని కలిసి మాట్లాడాలని సీఎం కార్యాలయం సూచించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ సాయంత్రం ఓ ప్రైవేట్ హోటల్ లో గెలుపొందిన కార్పొరేటర్లు తో విజయసాయిరెడ్డి సమావేశం కాబోతున్నారు. అక్కడే మేయర్ అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.

ఇలా ఉండగా, సాగరనగరం విశాఖలో మేయర్ అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్రంలోనే అతిపెద్ద మెట్రోపొలిటిన్ నగరం కావడంతో ఎలాగైనా దీనిని దక్కించుకోవాలని కార్పొరేటర్లు గా గెలుపొందిన సీనియర్ నాయకులు ప్రయత్నిస్తుంటే అధిష్టానం ఆలోచన మాత్రం వేరేలా ఉంది. సాధారణ కుటుంబానికి చెందిన వారికి, లాబీయింగ్ సైతం చేయలేని, నగరంలో మంచి పేరున్న ఓ విద్యావంతురాలైన మహిళ కు అవకాశం ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశం గా తెలుస్తోంది. వీటికి సామాజిక వర్గాలను జతపరచి అభ్యర్థి ఎంపిక బాధ్యతను, విజయసాయిరెడ్డి తో పాటు స్థానిక నాయకత్వానికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అప్పగించారు.

ఆమేరకు వైజాగ్ లో ప్రస్తుతం ఆ కసరత్తే జరుగుతోంది. మేయర్ బీసీ జనరల్ కావడంతో ముందుగా వంశీ కృష్ణ పేరు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. 2009, 2014 లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న వంశీ కి 2019 లో టికెట్ ఇవ్వలేని పరిస్థితిలో భవిష్యత్ లో మేయర్ కానీ, ఎమ్మెల్సీ కానీ ఇస్తామన్న హామీ ఉంది. అది ఇప్పుడు వర్కౌట్ అవ్వొచ్చని వంశీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించిన వంశీ కి సాయిరెడ్డి ని కలవమని అక్కడనుంచి సమాచారం రావడంతో వంశీ ఎలాగైనా ఆ పదవి తనకే దక్కేలా విపరీతమైన కృషే చేస్తున్నారు.

అయితే, వంశీ అభ్యర్థిత్వం తో పాటు ప్రత్యామ్నాయాలను కూడా పార్టీ ఆలోచిస్తోంది. మహిళ పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతోంది. వంశీ సామాజిక వర్గానికే చెందిన గోలగాని హరి వెంకట కుమారి అయితే ఎలా ఉంటుందని అభిప్రాయ సేకరణ చేస్తోంది. నగరంలో యాదవ సామాజిక వర్గ జనాభా గణనీయమైన సంఖ్యలో ఉండడం, గెలిచిన కార్పొరేటర్ల లో ఎక్కువమంది యాదవ సామాజిక వర్గం వాళ్ళు ఉండడంతో పాటు వంశీకి ఇవ్వలేని పక్షంలో అదే తూర్పు నియోజక వర్గానికి, అదే యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళకు ఇవ్వడం ద్వారా అందరినీ తృప్తి పరచొచ్చన్న అభిప్రాయంలో పార్టీ ఉన్నట్టు సమాచారం.

అలాగే యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్న అక్కరమాని రోహిణి తో పాటు ఇతర బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఉషశ్రీ, పూర్ణశ్రీ లు కూడా రేస్ లో ఉన్నారు. మేయర్ అభ్యర్థి ని దక్కించుకోలేని ఆశావహుల కు కనీసం 5, అవసరమైతే అంతకు మించి డిప్యూటీ మేయర్ పదవులు ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్టు సమాచారం.

Read also :

PK Sinha : పీఎం మోదీ ప్రధాన సలహాదారు పీకే సిన్హా రాజీనామా, వ్యక్తిగత కారణాలను చూపిస్తూ నిష్క్రమణ