AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..

అందమైన సాగరతీర నగరం విశాఖ.. కొందరు అక్రమార్కుల బారినపడి కొన్ని విషయాల్లో మసకబారిపోతోంది. అడపా దడపా డ్రగ్స్ రాకెట్లు, సీజన్‌కోసారి కిడ్నీ అమ్మకం దందాలు.. పోలీసుల్ని సైతం హైరానా పట్టిస్తున్నాయి. లేటెస్ట్‌గా ఒడిషా కేంద్రంగా ఒక కిడ్నీ రాకెట్ విశాఖ మీద కన్నేసినట్టు ఖాకీలకు వాసనొచ్చింది. ప్రాణం పోయాల్సిన డాక్టర్లే కిడ్నీ బ్రోకర్లుగా మారడం ఇక్కడ బాధాకరమైన కొసమెరుపు.

Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
Visakhapatnam Kidney Racket
TV9 Telugu
| Edited By: Jyothi Gadda|

Updated on: Jul 17, 2025 | 9:25 PM

Share

వైజాగ్‌లోని ఒక హోటల్‌ను అడ్డాగా మార్చుకుని కిడ్నీ వ్యాపారానికి పాల్పడే ముఠా ఒకటి విశాఖ పోలీసుల రాడార్‌లోకొచ్చింది. జనవరి 27న తొలిసారి ఫోన్ చేసి.. ముగ్గురు వ్యక్తుల్ని రంగంలోకి దింపారు. వాళ్లు అక్కడ ఒక హోటల్‌లో రెండురోజులుండి.. రాత్రికి రాత్రి రూమ్ రెంట్ కూడా పే చెయ్యకుండా జంప్. రెండోసారి మే16న అతడే ఫోన్ చేసి రూమ్ తీసినా.. ఎవ్వరూ రాకపోవడంతో రూమ్ క్యాన్సిలైంది. కట్‌చేస్తే.. ఇది థర్డ్‌ టైమ్‌.. జూన్‌ 29న అదే డాక్టర్ ఫోన్‌ చేసి రూమ్ బుక్‌ చేశాడు. జూన్ 30న రంగబాబు, ఏసురాజు ఇద్దరు ఫ్రెండ్స్ హోటల్‌లో దిగారు. ఆర్థిక బాధలతో కిడ్నీ అమ్ముకుంటున్నా అని రంగబాబు చెప్పడంతో, వద్దని వారించి అతడి ఫ్యామిలీకి ఫోన్‌ చేశాడు ఏసుబాబు. వాళ్లతో వాగ్వాదం జరుగుతుండగా.. హోటల్ సిబ్బందికి సందేహమొచ్చి పోలీసులకు ఉప్పందించారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని వివరాలు ఆరా తీస్తే.. కిడ్నీ కొనడం కోసం ఒడిషాకు చెందిన ఒక డాక్టర్ తమనిక్కడికి రప్పించాడని తెలిసిందంతా కక్కేశారు. ఎవరా డాక్టర్ అని ఫోన్ చేస్తే స్విచ్చాఫ్. అతడు పంపిన మెసేజ్‌ల ఆధారంగా నిజంగానే డాక్టరా, లేక కిడ్నీ బ్రోకరా కూపీ లాగుతున్నారు పోలీసులు.

ఏలూరు జిల్లా రంగయ్యపాలెంకు చెందిన రంగబాబు, అతడి స్నేహితుడు ఏసుబాబు… ఆర్ధిక అవసరాల కోసం కిడ్ని అమ్మేందుకు సిద్దపడి… విశాఖ వచ్చి ఇలా కిడ్నీ దందాగాళ్ల ఉచ్చులో చిక్కారు. వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చి, కేసు నమోదు చేసి కూపీ లాగుతున్నారు ఫోర్త్ టౌన్ పోలీసులు. కిడ్నీ రాకెట్ పనిచేయాలంటే.. పాత్రలు, పాత్రధారులు, సూత్రధారులు ఇలా పెద్ద తతంగమే ఉంటుంది. దాని అంతు చూసే పనిలో ఉంది వైజాగ్ పోలీస్.

మన దేశంలో ఆర్థిక సమస్యల కారణంగా కిడ్నీలను అమ్మాలన్నా, ఆరోగ్య అవసరాల కోసం కిడ్నీల్ని కొనాలన్నా అంత ఆషామాషీ కాదు. కిడ్నీ మార్పిడి కోసం ప్రత్యేకంగా ఒక చట్టమే ఉంది. ట్రాన్‌‌ప్లాంటేషన్ ఆఫ్ ఆర్గాన్స్ యాక్ట్. దీని ప్రకారం.. మన ఇష్టపూర్వకంగా ఐనాసరే రక్తసంబంధం లేని వ్యక్తికి కిడ్నీ ఇవ్వడం నేరం. ఎమర్జెన్సీ కండిషన్‌లో అటువంటి కిడ్నీ మార్పిడి ఏదైనా చేయాలన్నా దాన్ని నిర్ధారించడానికి ఒక చట్టబద్ధమైన కమిటీ ఉంది. వారినుంచి అనుమతి తీసుకున్నాకే.. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరగాలి. ఒకవేళ బ్రెయిన్‌డెడ్ పేషెంట్ దగ్గర కిడ్నీ తీసుకున్నా.. దాని మార్పిడి కోసం కొన్ని నియంత్రణలు పాటించాల్సిందే. సో.. చట్టాన్ని మీరి ఉల్లంఘించి కిడ్నీ అమ్మడానికి ఎవరు ప్రయత్నించినా పట్టుబడ్డం ఖాయం.

ఇవి కూడా చదవండి

ఇంత పకడ్బందీ యంత్రాంగం ఉన్నా.. కిడ్నీ రాకెట్ గాళ్లు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. ఆర్థికబాధలతో కుమిలిపోయే పేదల్ని గుర్తించి, మాయమాటలు చెప్పి, నకిలీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి కిడ్నీ కొనుగోళ్లు అమ్మకాలు సాగిస్తూ కోట్లు గడిస్తున్నారు దళారీలు. ఇందులో ఆస్పత్రి సిబ్బంది, స్వయానా డాక్టర్లు కూడా కిడ్నీ రాకెట్‌కు చేదోడుగా ఉంటున్నారు. 2024 జూలైలో ఢిల్లీలో, తర్వాత ఈ ఏడాది మేలో పూణేలో హైప్రొఫైల్ కిడ్నీ రాకెట్లను ఛేదించారు పోలీసులు. కిడ్నీ కోసం ఎంతైనా ఖర్చు చెయ్యగల ఎన్నారైల జాబితా కూడా వీళ్ల దగ్గర దొరికింది. కిడ్నీ రాకెట్ అనే ముతక వ్యవహారం ఇండియన్ హెల్త్‌కేర్ ఇండస్ట్రీ మీదే మాయనిమచ్చలా తయారైంది. హైదరాబాద్‌లో కిడ్నీదాతకు కేవలం నాలుగు లక్షలిచ్చి.. ఒక రోగి నుంచి 50 లక్షలకు అమ్ముకున్న దందా ఒకటి బైటపడింది. ఈ లెక్కన మన దేశంలో కిడ్నీ మార్కెట్ సైజ్ ఏ రేంజ్‌లో నడుస్తోందో అర్థమౌతుంది.

విశాఖ కేంద్రంగానే గతంలో రెండుమూడు సార్లు కిడ్నీ అమ్మకాలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. పేరుమోసిన డాక్టర్లే అరెస్టయ్యారు. పెందుర్తిలో కిడ్నీ దందాకు పాల్పడుతూ ఒక ముఠా గుట్టు రట్టయింది. వీళ్లంతా ఒడిషా, జార్ఖండ్ రాష్ట్రాలమీదుగా నెట్‌వర్క్ నడుపుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవలే కొకైన్ కేసులో ఒక డాక్టర్ అరెస్ట్ కావడం.. కిడ్నీ వ్యవహారాల్లో కూడా డాక్టర్ల ప్రమేయం ఉండడంతో వైద్యరంగంపై కూడా స్థానికంగా సందేహాలు మొదలయ్యాయి. తాజా కేసులో ఒడిషాకు చెందిన డాక్టర్ ఆచూకీ కోసం కూపీ లాగుతున్న పోలీసులు.. కిడ్నీ కేడీల ఆట కట్టిస్తారా చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..