Andhra Pradesh: విశాఖ కేజీహెచ్ లో శిశువుల మార్పిడి ఘటన.. సూపరింటెండెంట్ క్లారిటీ.. ఏం జరిగిందంటే..
విశాఖ కేజీహెచ్‌లో శిశువుల తారుమారు ఘటన కలకలం రేపింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో విచారణ జరిపించిన అధికారులు.. ఆస్పత్రి ఆయా అత్యుత్సాహం వల్లే జరిగిందని తేల్చారు. శిశువులను ఎవరి తల్లిదండ్రులకు వారిని అప్పగించారు. ఈ ఘటనపై కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద కీలక విషయాలు వెల్లడించారు. ఇంతకీ.. విశాఖ కేజీహెచ్‌లో అసలేం జరిగింది?...

విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్‌లో సంచలనం సృష్టించిన శిశువుల మార్పిడి ఘటనలో క్లారిటీ వచ్చింది. రెండు రోజుల క్రితం గైనకాలజీ వార్డులో ఒక కుటుంబానికి ఇవ్వాల్సిన శిశువును ఆస్పత్రి సిబ్బంది మరో కుటుంబానికి అప్పగించారు. ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ శిశువును అప్పగించాలని డిమాండ్ చేశారు. దాంతో.. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద సీరియస్ అయ్యారు. ఘటనపై ఏడుగురు అధికారులతో ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఎంక్వైరీ చేసిన కమిటీ.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా శిశువుల తారుమారును గుర్తించారు. శిశువులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
ఈ ఘటనపై కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద కీలక విషయాలు వెల్లడించారు. ఆయా అత్యుత్సాహం వల్లే శిశువుల మార్పిడి ఘటన జరిగిందన్నారు. విశాఖ కేజీహెచ్‌లో శిశువులు తారుమారు ఘటనలు గతంలో ఎప్పుడూ జరగలేదని చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేజీహెచ్‌లో ఇద్దరు మహిళలకు కాన్పులు జరగ్గా.. రిజిష్టర్ ఎంటర్ చేసే ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఓ ఆయా పొరపాటుతో ఘటన చోటుచేసుకుంది. ఆయా ఒక బిడ్డను తీసుకువచ్చి ఒకరికి బదులు మరొకరి కుటుంబ సభ్యులకు అప్పగించడంతో ప్రాబ్లమ్ వచ్చిందన్నారు.
డాక్టర్లు వచ్చి బేబీ వాళ్ళది కాదని చెప్పగా.. ఇద్దరు తల్లులకు పిల్లలను చూపించి గుర్తు చేశారు. ఇద్దరు బేబీల జెండర్లు డిఫరెంట్ కావడంతో క్లారిటీ వచ్చిందని తెలిపారు. ఫొటోల ఆధారంగా ఎవరి బిడ్డను వాళ్ళకు అప్పగించామన్నారు.రూల్ ప్రకారం స్టాఫ్ నర్స్ మాత్రమే బిడ్డను అప్పగించాల్సి ఉంటుందని.. కానీ.. ఓ ఆయా అత్యుత్సాహంతో కన్ఫ్యూజన్ ఎదురైందని సూపరింటెండెంట్ శివానంద తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..




