చెట్టుకు కట్టేసి కొట్టారు.. ఆ వీడియోను షేర్ చేశారు..
కడప జిల్లా అమానుషం చోటు చేసుకుంది. ముద్దనూరులోని ఓ వ్యాపారి మానవత్వం మరిచి తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగిని చితకబాదాడు. సిమెంట్ బస్తాలు దొంగిలించాడనే అనుమానంతో...

కడప జిల్లా అమానుషం చోటు చేసుకుంది. ముద్దనూరులోని ఓ వ్యాపారి మానవత్వం మరిచి తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగిని చితకబాదాడు. సిమెంట్ బస్తాలు దొంగిలించాడనే అనుమానంతో లారీ డ్రైవర్‌ను చెట్టుకు కట్టేసి మరీ కొట్టించాడు. తనకేమి తెలియదని డ్రైవర్ ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదు. గుర్రప్ప ట్రాన్స్‌పోర్టు యజమానితో పాటు అతని అనుచరులు విచరక్షణారహితంగా డ్రైవర్‌పై దాడి చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
లారీ డ్రైవర్‌పై దాడి దృశ్యాలను ట్రాన్స్ పోర్టు యజమానే వీడియో తీసి.. పైశాచికానందం అనుభవించాడు. అంతటితో ఆగకుండా ఆ వీడియోను డ్రైవర్లందరికీ వాట్సప్‌లో షేర్ చేశాడు. ఈ విషయం నెమ్మదిగా బయట పడింది. ఈ ఘటన జరిగిన తర్వాత బాధిత లారీ డ్రైవర్ కర్నాటకలోని తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు. కర్నాటకకు వెళ్లిన తర్వాత అక్కడ ఈ దారుణం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ట్రాన్స్ పోర్టు యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదిలావుంటే.. మానవత్వం మరిచి.. విచక్షణ కోల్పోయిన ట్రాన్స్‌పోర్టు యజమాని మాత్రం తాను చేసిన పనిని సమర్థించుకున్నాడు. మిగతా డ్రైవర్లు దొంగతనాలు చేయకుండా ఉండేందుకే వీడియో తీసినట్టుగా చెప్పుకొచ్చాడు.




