NEET UG 2026 Re-Exam: ఇక నీట్ రీ-ఎగ్జాం మరింత ఈజీ.. NTA ప్రకటించిన కొత్త సౌకర్యాలు ఏంటంటే?
NEET UG 2026 పరీక్ష రాసే విద్యార్థులకు NTA గుడ్‌న్యూస్ చెప్పింది. పరీక్ష సమయాన్ని 195 నిమిషాలకు పెంచడంతో పాటు రఫ్ వర్క్ పేజీల సంఖ్యను కూడా రెండింతలు చేసింది. విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకొచ్చిన ఈ మార్పులు జూన్ 21న జరిగే పరీక్షలో అమల్లోకి రానున్నాయి..

హైదరాబాద్, జూన్ 12: మరో వారంలో నిర్వహించనున్న NEET UG 2026 రీ ఎగ్జాంలో విద్యార్థులకు అనుకూలంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పలు కీలక మార్పులను ప్రకటించింది. జూన్ 21న జరగనున్న ఈ పరీక్షను మరింత సౌకర్యవంతంగా నిర్వహించడంతో పాటు పారదర్శకత, భద్రతను కొనసాగించేలా ఈ మార్పులు తీసుకొచ్చినట్లు NTA వెల్లడించింది. ముఖ్యంగా పరీక్ష సమయాన్ని మరికాస్త పొడిగించినట్లు ఎన్టీయే ప్రకటించింది. పరీక్ష సమయాన్ని 195 నిమిషాలకు పెంచినట్లు వెల్లడించింది. అంటే పరీక్ష సమయం గతంలో 3 గంటలు (180 నిమిషాలు) ఉండగా.. అది 3 గంటల 15 నిమిషాలకు (195 నిమిషాలు) పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జూన్ 21న జరిగే పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు నిర్వహిస్తారన్నమాట. పరీక్షా కేంద్రంలో సంతకాలు చేయడం, ఇతర తనిఖీల వల్ల విద్యార్థుల సమయం వృధా కాకూడదనే ఉద్దేశంతోనే ఈ అదనపు 15 నిమిషాలు కేటాయించినట్లు NTA తెలిపింది.
ఈ మార్పు వల్ల విద్యార్థులు పరీక్ష రాయడానికి కేటాయించిన పూర్తి సమయాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుందని, పరిపాలనా ప్రక్రియల వల్ల పరీక్ష సమయం తగ్గిన భావన కలగకుండా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఇక ప్రశ్నాపత్రంలో రఫ్ వర్క్ కోసం ఇచ్చే పేజీల సంఖ్యను కూడా ఎన్టీయే పెంచింది. ఇప్పటివరకు రెండు పేజీలు మాత్రమే ఉండగా, ఇప్పుడు నాలుగు రఫ్ వర్క్ పేజీలను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో లెక్కలు, డయాగ్రామ్లు, ఇతర రాతపనులకు విద్యార్థులకు మరింత స్థలం లభించనుంది.
The National Testing Agency (NTA) is committed to ensuring that NEET (UG)-2026 examination is conducted in a manner that is fair, secure and responsive to the needs of candidates. As part of this effort, a few candidate-friendly changes have been introduced for NEET (UG) 2026,… pic.twitter.com/eRw2KyleIU
— ANI (@ANI) June 12, 2026
విద్యార్థుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని రఫ్ వర్క్ పేజీల అమరికలో కూడా మార్పులు చేశారు. గతంలో అన్ని రఫ్ వర్క్ పేజీలు ప్రశ్నాపత్రం చివర భాగంలో మాత్రమే ఉండేవి. ముఖ్యంగా ఎడమచేతితో రాసే విద్యార్థులకు ఇది అసౌకర్యంగా ఉందని ఫిర్యాదులు రావడంతో కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇక నుంచి రెండు రఫ్ వర్క్ పేజీలను సూచనల పేజీ తర్వాత ప్రారంభంలోనే ఉంచనున్నారు. మరో రెండు పేజీలు ప్రశ్నాపత్రం చివరలో అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త విధానం ఇంగ్లీష్‌తో పాటు అన్ని ప్రాంతీయ భాషల ప్రశ్నాపత్రాల్లో కూడా అమలుకానుంది. పరీక్ష రూపకల్పనలో చిన్నచిన్న మార్పులు కూడా విద్యార్థుల అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా NEET వంటి కీలక పరీక్షల్లో ఇవి సానుకూల ప్రభావాన్ని చూపుతాయని NTA తన ప్రకటనలో పేర్కొంది. విద్యార్థులకు మరింత అనుకూలమైన పరీక్షా వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా ఈ మార్పులు తీసుకువచ్చినట్లు NTA స్పష్టం చేసింది. అదే విధంగా పరీక్ష పారదర్శకత కాపేడేలా కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలు కొనసాగుతాయని తెలిపింది.




