Telangana: గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఏ సర్టిఫికేట్ కావాలన్నా మీ ఊర్లోనే..
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. ఇక ప్రభుత్వ సర్టిఫికేట్లు, గుర్తింపు పత్రాల కోసం పట్టణాలు, నగరాల్లోని మీసేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ గ్రామంలోనే అవన్నీ పొందవచ్చు. ఈ మేరకు రైతు సహకార కేంద్రాల్లో సీఎస్‌సీ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది.

తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అదిరిపోయే న్యూస్. ఇక నుంచి ప్రభుత్వ సర్టిఫికేట్లు, సంక్షేమ పథఖాల కోసం దరఖాస్తు, గుర్తింపు కార్డుల కోసం మండల కేంద్రాలు, పట్టణాలకు వెళ్లాల్సిన పనే లేదు. మీ గ్రామంలోనే ప్రభుత్వానికి సంబంధించిన డిజిటల్ సేవలన్నీ పొందవచ్చు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లోనే డిజిజల్ పౌర సేవలు అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం గ్రామాల పరిధిలో ఉండే ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా కామర్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. ఈ సెంటర్లలో సమగ్ర డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. డిజిటల్ భారత్ చొరవ, నాంబార్డ్ సహకారంతో వ్యవసాయ సహకార కేంద్రాలను సీఎస్‌సీ సెంటర్లుగా మార్చనుంది.
ఈ సేవలన్నీ ఒకేచోట
ప్రస్తుతం వ్యవసాయ సహకార కేంద్రాలు ద్వారా రైతులకు రుణాలు మంజూరు చేయడం, ఎరువులు, విత్తనాల పంపిణీ, సబ్సిడీ వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అయితే ఇక నుంచి డిజిటల్ సేవలు కూడా వాటి ద్వారా అందించనున్నారు. డిజిటల్ భారత్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కానుంది. గ్రామీణ ప్రజలకు డిజిటల్ సేవలను అందుబాటులో ఉంచేందుకు కేంద్ర సహకార శాఖ, నాబార్డుల మధ్య ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల్లో సీఎస్‌సీ సెంటర్లను నెలకొల్పనున్నారు. మొత్తం రెండు విడతలుగా రాష్ట్రవ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. తొలుత ఈ ఏడాది ఆగస్ట్ 15 నాటికి 562 సహకార సంఘాల్లో సీఎస్‌సీ సెంటర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే 15 కేంద్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా పనులు ప్రారంభించింది.
అందించే సేవలు ఇవే..
ఆధార్, పాన్, పాస్ పోర్ట్, ఓటర్ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, రేషన్ కార్డు దరఖాస్తుల వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. దీంతో పాటు కరెంట్, నీటి బిల్లుల చెల్లింపు, వాహనాల ఈ ఛలాన్లు, బస్, రైల్వే టికెట్ల బుకింగ్, స్కాలర్ షిప్ దరఖాస్తులు, ఐటీ రిటర్న్స్ దాఖలు, శ్రమయోగి మాన్ ధన్ పెన్షన్లు, జీవన్ ప్రమాణ్ పత్రాలు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, భూసార పరీక్ష కార్డులు, డెయిరీ, మత్స్య పరిశ్రమ సేవలు, గోదాముల నిర్వహణ వంటి సేవలు ఇక్కడ పొందవచ్చు. అలాగే రానున్న రోజుల్లో ఈ కేంద్రాలను జనఔషధీ కేంద్రాలుగా కూడా మార్చనున్నారు. దీని ద్వారా గ్రామీణ ప్రజలకు తక్కువ ధరకే మెడిసిన్స్ అందుబాటులో ఉంచనున్నారు. రానున్న రోజుల్లో గ్రామీణ ప్రజలు అన్ని రకాల సేవలను సహకార కేంద్రాల్లో కల్పించనున్నారు.
