200 కాదు.. ఇక 180 ప్రశ్నలతోనే NEET PG 2026 పరీక్ష.. NBEMS కొత్త రూల్స్ చూశారా?
దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ పీజీ 2026 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. ఈ నెల 21వ తేదీ ఆర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో NBEMS కొత్త రూల్స్ జారీ చేసింది..

హైదరాబాద్, జులై 2: ఈ ఏడాది నీట్ పీజీ 2026 పరీక్షను ఆగస్టు 30న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు దేశ వ్యాప్తంగా ఒకే షిఫ్టులో నిర్వహించనున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎంఎస్) ప్రకటించింది. ఈ మేరకు తాజాగా పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది. ఇక ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 21వ తేదీ రాత్రి 11.55 గంటల వరకు కొనసాగనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా త్వరిత గతిన దరఖాస్తు చేసుకోవాలని ఏన్టీయే పేర్కొంది. అంతేకాకుండా ఈసారి దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ విధానంలో నీట్ పీజ పరీక్ష నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. పరీక్ష కేంద్రాల కేటాయింపు సమాచారం ఆగస్టు 11న వెల్లడిస్తామని తెలిపింది. ఇక నీట్ పీజీ 2026 పరీక్ష ఫలితాలు సెప్టెంబరు 30న విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
నీట్ పీజీ పరీక్ష విధానంలో భారీ మార్పులు
NBEMS ఈ ఏడాది నీట్ పీజీ పరీక్షల విధానంలో పలు కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా పరీక్షలో ప్రశ్నల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. గతంలో నీట్ పీజీ పరీక్షలో 200 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇచ్చేవారు. ఈ ఏడాది మాత్రం వాటిని 180కి తగ్గించనున్నారు. అంటే ఇకపై నీట్ పీజీ ప్రవేశ పరీక్ష కేవలం 180 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు మాత్రమే జరగనుంది. అయితే మార్కింగ్ విధానంలో ఎలాంటి మార్పు లేదు. ప్రతి సరైన సమాధానానికి అభ్యర్థులకు నాలుగు మార్కులు లభిస్తాయి. అయితే ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు చొప్పున కోత విధిస్తారు. సమాధానం ఇవ్వని ప్రశ్నలకు ఎలాంటి మార్కులు ఉండవు. అలాగే తగ్గించరు కూడా. వైద్య పాఠ్యప్రణాళికలోని అంశాలపై అభ్యర్థుల జ్ఞానాన్ని, అవగాహనను అంచనా వేయడానికి రూపొందించిన 180 బహుళైచ్ఛిక ప్రశ్నల ద్వారా అభ్యర్థులను మదింపు చేయనున్నారు.
నీట్ పీజీ దరఖాస్తు రుసుములో కూడా మార్పు చేశారు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్ధులు రూ.3,500 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. మిగిలిన అన్ని కేటగిరీల అభ్యర్థులు రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది. మరో ముఖ్యమైన మార్పు ఏమంటే.. పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకునే ప్రక్రియను NBEMS సవరించింది. అభ్యర్థులు ఇకపై తమకు నచ్చిన పరీక్షా నగరాలను ఎంచుకోవడానికి బదులుగా, దరఖాస్తు ఫారమ్‌ను నింపేటప్పుడు మూడు రాష్ట్రాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారమ్‌లో అభ్యర్థి అందించిన చిరునామాకు సంబంధించిన రాష్ట్రాన్ని మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవాలి. రెండవ, మూడవ ప్రాధాన్యతలు పొరుగు రాష్ట్రాలుగా ఉండాలి. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించిన తర్వాత దరఖాస్తు సవరణల విండోతో సహా ఏ దశలోనూ చిరునామాను గానీ, ఎంచుకున్న రాష్ట్ర ప్రాధాన్యతలను గానీ సవరించడానికి వీలులేదని బోర్డు స్పష్టం చేసింది.
నీట్ పీజీ 2026 పరీక్షా నగరాల కేటాయింపు విషయంలోనూ మొదట దరఖాస్తు చేసుకున్న వారికి మొదట ప్రాధాన్యత పద్ధతిలో జరగదని NBEMS మరింత స్పష్టం చేసింది. పరీక్షా కేంద్రాల కేటాయింపు ప్రక్రియను క్రమబద్ధీకరించి, అందుబాటులో ఉన్న పరీక్షా కేంద్రాలన్నింటిలో అభ్యర్థులను మరింత సమతుల్యంగా పంపిణీ చేయడమే ఈ మార్పు ఉద్దేశమని స్పష్టం చేసింది.




