నిద్రలేచిన తర్వాత తొలి 90 నిమిషాలే మీ రోజును నిర్ణయిస్తాయి.. ఎలా గడపాలో తెలుసా?
నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది ఉదయపు సమయాన్ని పెద్దగా పట్టించుకోరు. అయితే వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, నిద్రలేచిన తర్వాత మొదటి 60 నుంచి 90 నిమిషాలు మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అత్యంత కీలక సమయం. ఈ సమయంలో పాటించే అలవాట్లు రోజంతా మన శక్తి స్థాయిలు, ఏకాగ్రత, మానసిక స్థితి, అలాగే రాత్రి నిద్ర నాణ్యతపై ప్రభావం చూపుతాయి..

హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్‌కు చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ ఏం చెబుతున్నారంటే.. ఉదయం వేళల్లో కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం ద్వారా శరీరంలోని సిర్కాడియన్ రిథమ్‌ను సమతుల్యం చేసుకోవచ్చు. దీంతో శరీరం సహజమైన శక్తిని పొందడమే కాకుండా, మెరుగైన నిద్ర కూడా లభిస్తుంది.
ఉదయాన్నే సూర్యరశ్మిని ఆస్వాదించండి
నిద్రలేచిన 30 నుంచి 60 నిమిషాలలోపు కనీసం 10 నుంచి 20 నిమిషాల పాటు సహజ సూర్యకాంతిలో గడపాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది శరీరంలో కార్టిసాల్ హార్మోన్ సమతుల్యంగా విడుదల కావడానికి సహాయపడుతుంది. ఫలితంగా రోజంతా ఉత్సాహంగా, చురుకుగా ఉండగలుగుతారు.
నిద్రలేవగానే కాఫీకి దూరంగా ఉండండి
చాలామంది నిద్రలేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు కలిగి ఉంటారు. అయితే శరీరం సహజంగా మేల్కొనే ప్రక్రియకు సమయం ఇవ్వడం అవసరం. అందుకే కనీసం 60 నుంచి 90 నిమిషాల తర్వాత కాఫీ లేదా టీ తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
ముందుగా నీళ్లు తాగండి
రాత్రంతా నిద్రపోవడం వల్ల శరీరంలో కొంత మేర నీటి లోపం ఏర్పడుతుంది. అందువల్ల ఉదయం లేవగానే సుమారు 500 మిల్లీలీటర్ల నీరు తాగడం ద్వారా శరీరానికి తేమను అందించవచ్చు. ఇది జీవక్రియలను చురుకుగా చేయడంలో కూడా సహాయపడుతుంది.
తేలికపాటి వ్యాయామం చేయండి
ఉదయం కొద్దిసేపు నడవడం, ఒళ్ళు విరుచుకోవడం లేదా తేలికపాటి స్ట్రెచింగ్ చేయడం ద్వారా శరీరం చురుకుదనాన్ని పొందుతుంది. ఇది మెదడుకు రోజు ప్రారంభమైందనే సంకేతాన్ని పంపి ఏకాగ్రత, శక్తిని పెంచుతుంది. నిద్రలేవగానే సోషల్ మీడియా, మెసేజ్‌లు లేదా ఈమెయిల్స్ చూడడం వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ఉదయం మొదటి గంటలో మొబైల్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించడం మంచిది.
స్నూజ్ బటన్ నొక్కకండి
అలారం మోగిన ప్రతిసారి స్నూజ్ బటన్ నొక్కడం వల్ల మెదడు మళ్లీ నిద్రలోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. దీంతో అలసట, నీరసం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలారం మోగగానే లేవడం ఉత్తమం.
పోషకాలు ఉన్న అల్పాహారం తీసుకోండి
ఉదయం అల్పాహారం రోజంతా శక్తిని అందించే ముఖ్యమైన భోజనం. అధిక చక్కెర కలిగిన ఆహారాలకు బదులుగా ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది.
ఆరోగ్యకరమైన ఉదయమే ఆరోగ్యకరమైన రోజుకు పునాది
ఉదయం వేళల్లో ఈ సాధారణ అలవాట్లను పాటించడం ద్వారా శరీర ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, మంచి నిద్ర కూడా పొందవచ్చు. చిన్న మార్పులతో పెద్ద ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే ప్రతి రోజును ఆరోగ్యకరమైన ఉదయంతో ప్రారంభించడం అవసరం.




