అటెన్షన్ ప్లీజ్…బీఎస్‌-4 మోడల్‌ వాహనదారులకు అలర్ట్…

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ భయపెడుతుంటే...దేశవ్యాప్తంగా వెహికల్స్(ఆటో మొబైల్స్‌‌) డీలర్లకు బీఎస్‌‌ 4 భయం పట్టుకుంది. వీరు మార్చి 31 లోపు తమ దగ్గరున్న బీఎస్‌‌ 4 స్టాక్‌‌ను వదిలించుకోవాలి. లేదంటే...

  • Jyothi Gadda
  • Publish Date - 12:32 pm, Tue, 10 March 20
అటెన్షన్ ప్లీజ్...బీఎస్‌-4 మోడల్‌ వాహనదారులకు అలర్ట్...

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ భయపెడుతుంటే…దేశవ్యాప్తంగా వెహికల్స్(ఆటో మొబైల్స్‌‌) డీలర్లకు బీఎస్‌‌ 4 భయం పట్టుకుంది. వీరు మార్చి 31 లోపు తమ దగ్గరున్న బీఎస్‌‌ 4 స్టాక్‌‌ను వదిలించుకోవాలి. లేకుంటే దానిని తక్కు సామాన్లు వేసుకోవాల్సి వస్తుంది. ఏప్రిల్‌‌ 1 నుంచి బీఎస్‌‌ 4 వాహనాలకు రిజిస్ట్రేషన్‌‌ జరగదు. దీనికితోడు క్రయ విక్రయాలు ఉండవు. ఇక బీఎస్‌ -4 మోడల్‌ వాహన తయారీలే ఉండవు.

ద్విచక్ర వాహనాలు, కార్లలో నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించేందుకు, కాలుష్య నియంత్రణ నిబంధనల్లో భాగంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం భారత్‌ స్టేజ్‌ ఎమిషన్‌ స్టాండర్డ్స్ (బీఎస్‌ఈఎస్‌) పేరిట నియామావళిని రూపొందించింది. దీంతో ఏప్రిల్‌ 1నుంచి ప్రతి వాహన తయారీదారు బీఎస్‌ -4 మోడల్‌ వాహనాలను విక్రయాలు చేయటం నిషేధం. వీటి రిజిస్ట్రేషన్లు సైతం ఉండవు. టూవీలర్, ఫోర్ వీలర్ వాహనాలను బీఎస్‌ -6 ప్రమాణాల మేరకు ఉత్పత్తి చేసి విక్రయించాల్సి ఉంది. రాష్ట్రంలో 2014 నుంచి విక్రయమైన వాటిలో 2,59,678 బీఎస్‌-4 వాహనాలు రిజిస్ట్రేసన్‌ కాలేదు. వీటిలో మోటారు సైకిళ్లు 2,22,229 ఉండగా, ట్రాక్టర్లు 24,709, కార్లు, క్యాబ్‌లు 7,467, సరకు రవాణా వాహనాలు 2,796, ఆటోలు, ఈ రిక్షాలు 1,729, ఇతరాలు 748 వాహనాలు ఉన్నాయి. వీటికి మార్చి 31వరకు మాత్రమే రిజిస్ట్రేషన్‌కు గడువు విధించారు.

కాగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 22,658 ద్విచక్ర వాహనాలతో పాటు ఇతర వాహనాలు రిజిస్ట్రేషన్‌ కాలేదు. కరీంనగర్‌ జిల్లాలో 7811, జగిత్యాలలో 6390, పెద్దపల్లిలో 4666, సిరిసిల్లలో 3791 వాహనాలు ఇంకా నమోదు కాలేదు. ఈ వాహనాలన్నీ మార్చి 31లోపే రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌ చేయరు. దీంతో అవి తుక్కు కిందనే లెక్క కట్టాల్సి ఉంటుంది. అలాగే రిజిస్ట్రేషన్‌ కాని వాహనాలకు బీమా కూడా చేయరు. ప్రమాదానికి గురైన సమయంలో ఎలాంటి పరిహారమూ అందదు. నిబంధనల ప్రకారం వాహనం కొనుగోలు చేసిన వెంటనే నెల రోజుల లోపు వాహనదారుడు తన పేరుమీద ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. కానీ ఇన్నాళ్లూ చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అధికారులు సరిగ్గా పట్టించుకోకపోవడంతో రిజిస్ట్రేషన్‌ కాని వాహనాల సంఖ్య ఘనంగా పెరిగింది.

అటు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ భారీ సంఖ్యలోనే రిజిస్ట్రేషన్ చేయించని బీఎస్ -4 వాహనాలు ఉన్నట్లుగా గుర్తించారు అధికారులు. వాటి రిజిస్ట్రేషన్‌ కోసం ప్రభుత్వం ఈనెల 31 వరకు గడువు ఇచ్చింది. ఆదిలాబాద్‌ జిల్లాలో ద్విచక్రవాహనాలు 3,369 ఉండగా కార్లు, ఇతర వాహనాలు 315 ఉన్నాయి. మొత్తంగా 3,684 రిజిస్ట్రేషన్‌ చేసుకోని వాహనాలుఉన్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ద్విచక్ర వాహనాలు 2,348, ఇతర వాహనాలు 367, నిర్మల్‌ జిల్లాలో ద్విచక్ర వాహనాలు 5,144, ఇతర వాహనాలు 640 ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో ద్విచక్రవాహనాలు 4,395, ఇతర వాహనాలు 528 ఉన్నాయి. ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో రిజిస్ట్రేషన్‌ చేసుకోని బీఎస్‌–4 వాహనాలు 16,106 ఉన్నట్లు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.