తెలంగాణకు మళ్లీ మిడతల దండు.. సరిహద్దుల్లో అలర్ట్

మిడతల దండు ప్రమాదం మరోసారి పొంచిఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయిచింది. మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు ...

తెలంగాణకు మళ్లీ మిడతల దండు.. సరిహద్దుల్లో అలర్ట్
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 28, 2020 | 9:01 AM

మిడతల దండు ప్రమాదం మరోసారి పొంచిఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయిచింది. మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు అటవీ, వ్యవసాయశాఖ అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించింది. గత నెలలో మూడు విడతలుగా దేశంలో ప్రవేశించిన మిడతల దండు.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వరకే వచ్చాయి. తెలంగాణ వైపు రాలేదు. అయితే తాజాగా ఓ మిడతల దండు తెలంగాణకు వచ్చే అవకాశం ఉండటంతో వ్యవసాయ అధికారులు వాటిని అడ్డుకునేందుకు రెడీ అవుతున్నారు. వాటిని రాష్ట్ర సరిహద్దుల్లోనే అడ్డుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. మిడతల దండు గమనంపై సమాచారం తెప్పించుకుంటున్నారు.

ఇందులో భాగంగా వాటిని నియంత్రించేందుకు కావాల్సిన పీపీ కెమికల్స్ స్ప్రే‌తో పాటు పీపీఈ (PPE) కిట్లను రెడీ చేసుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దు జిల్లాపై వీటి దాడి జరిగే ప్రమాదం ఉందని అంచనా వేశారు. ఇందులో భాగంగా అదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, ములుగు, భద్రాద్రి కొత్తగుడెం, సంగారెడ్డి జిల్లాల్లో అధికారులను అప్రమత్తం చేశారు.

మిడతల దండు దక్షిణం వైపు వస్తే ఏ క్షణమైనా తెలంగాణకు ముప్పే అని తేలింది. ఈ సమయంలో తెలంగాణలో వర్షాకాలం పంట సీజన్ ప్రారంభమయి ఉంటుంది. పంటలు మొలకెత్తి ఉంటాయి. మిడతల దండు దాడిచేసిందంటే చాలా నష్టం జరుగుతుంది. లేత పంటను పీల్చి పారేస్తుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలోకి మిడతల దండు ప్రవేశించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.