విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా పాదయాత్ర.. ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఐదు కిలోమీటర్ల ర్యాలీ..
Vizag Steel Plant Protest : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతమవుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అన్ని పార్టీల నేతలు
Vizag Steel Plant Protest : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతమవుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అన్ని పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు విశాఖకే పరిమితమైన ఉద్యమం ఇప్పుడు రాష్ట్రం మొత్తం విస్తరించింది. అధికార పార్టీకి చెందిన వైసీపీ నేతలు కూడా బంద్‌లో పాల్గొంటున్నారు.
తాజాగా ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా పరిరక్షణ పోరాట కమిటీ ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. ఆదివారం పోరాట కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. కూర్మన్నపాలెం నుంచి పాత గాజువాక వరకు 5కె పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలతో పాటు ఉక్కు పరిశ్రమ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నాటి నుంచి విశాఖలో నిరసనలు జరగుతున్న విషయం తెలిసిందే. ఈ ఉద్యమానికి పలువురు ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఎవరు ఏం చెప్పినా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ 100 శాతం ఆగేది లేదంటూ కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం తాజా వివరణతో ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని తేలిపోయింది. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అన్నది రాజకీయ పార్టీల చేతుల్లో ఉంది. ఇప్పటికే పార్టీలకు అతీతంగా విశాఖ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. బీజీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఉక్కు ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్నాయి. అయితే అధికార వైసీపీ మాత్రం కేంద్రాన్ని ఒప్పించగలం అనే ధీమాతో కనిపించింది.