AP Municipal Elections 2021 Results : గోదావరి జిల్లాల్లో జనసేన అనూహ్య విజయాలు, టీడీపీ మద్దతు కూడగట్టుకోవడంతో గ్లాస్ గలగలలు
Godavari Municipal Elections 2021 Results : ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ ఫలితాల్లో వైసీపీ తన హవా కొనసాగిస్తుండగా, కొన్ని జిల్లాల్లోనే విపక్షపార్టీల అభ్యర్థులకు..
Godavari Municipal Elections 2021 Results : ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ ఫలితాల్లో వైసీపీ తన హవా కొనసాగిస్తుండగా, కొన్ని జిల్లాల్లోనే విపక్షపార్టీల అభ్యర్థులకు కొన్ని వార్డులు దక్కుతున్నట్లు ఇప్పటిదాకా ఉన్న ట్రెండ్‌ను బట్టి తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నాలుగోవార్డులో జనసేన అభ్యర్థి అనూహ్యంగా గెలిచారు. అలాగే కొవ్వూరు 23వ వార్డులో టీడీపీ గెలిచింది. గోదావరి జిల్లాల్లో టీడీపీ మద్దతు కూడగట్టుకోవడం జనసేన అభ్యర్థులకు కలిసొచ్చింది. జంగారెడ్డిగూడెం, అమలాపురం, గొల్లప్రోలులో కొన్ని వార్డుల్లో సైకిల్ బెల్లు కొడితే గ్లాస్ గలగలలాడింది. ప్రకాశం జిల్లా అద్దంకిలో అధికారపార్టీకి గట్టిపోటీ ఇచ్చింది టీడీపీ. ఇప్పటిదాకా వచ్చిన ఫలితాల్లో 14 వార్డుల్లో వైసీపీ, టీడీపీ చెరి ఏడు సీట్లు దక్కించుకున్నాయి.
తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో నాలుగు వార్డుల్లో జనసేన అభ్యర్థులు గెలిచారు. ఇక, సత్తెనపల్లిలో మొత్తం 31 వార్డులకుగాను, వైసీపీ 12 వార్డుల్లో, టీడీపీ 3 వార్డుల్లో, జనసేన 1 వార్డులో విజయం సాధించింది. కాగా, పశ్చిమగోదావరి జిల్లాలో నాలుగు మున్సిపాలిటీ ల్లో కౌంటింగ్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. జంగారెడ్డిగూడెం , నిడదవోలు, నర్సాపురం, కొవ్వూరు మున్సిపాలిటీ ల్లో ఇప్పటికే 16 వార్డులు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. మిగిలిన 95 వార్డుల్లోనూ కౌంటింగ్ జరుగుతుండగా, మరికొన్ని గంటల్లోనే ఫలితాలు తేలిపోనున్నాయి.