Bank Recruitment 2026: బ్యాంక్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నారా..? సెంట్రల్ బ్యాంక్లో భారీ ఉద్యోగాలు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2026-27 ఆర్థిక సంవత్సరానికి 4,500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఏడాది పాటు శిక్షణతో పాటు నెలకు రూ.15,000 స్టైపెండ్ అందించనున్నారు..

ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారీ ఉద్యోగ నియామక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న శాఖలు, కార్యాలయాల్లో శిక్షణ ఇచ్చేందుకు మొత్తం 4,500 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు బ్యాంకు వెల్లడించింది. బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలని భావిస్తున్న డిగ్రీ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 4,500 అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్లో 128 పోస్టులు, తెలంగాణలో 100 పోస్టులు కేటాయించారు. ఎంపికైన అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖల్లో 12 నెలలపాటు శిక్షణ అందించనున్నారు.
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే 2022 జనవరి 1 లేదా ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేసిన వారు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. అభ్యర్ధుల వయోపరిమితి 2026 మే 31 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ విధానంలో జూన్ 22, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగా NATS (National Apprenticeship Training Scheme) పోర్టల్లో నమోదు చేసుకోవాలి. అనంతరం BFSI SSC పోర్టల్ ద్వారా లాగిన్ అయి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. దరఖాస్తులు పూర్తిగా ఆన్లైన్ విధానంలో మాత్రమే స్వీకరిస్తారు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ / ఈడబ్ల్యూఎస్ / ఓబీసీ (పురుషులు) అభ్యర్ధులు రూ.944, జనరల్ / ఈడబ్ల్యూఎస్ / ఓబీసీ (మహిళలు) అభ్యర్ధులు రూ.708, ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు / ట్రాన్స్జెండర్ అభ్యర్థులు రూ.236 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.
ఆన్లైన్ రాత పరీక్ష, స్థానిక భాషా ప్రావీణ్య పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్నెస్ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉండదు, ఇది అభ్యర్థులకు అదనపు ప్రయోజనంగా చెప్పవచ్చు. ఆన్లైన్ పరీక్ష (తాత్కాలికంగా) జూలై 2026 మొదటి వారంలో ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ వ్యవధిలోనే దరఖాస్తు గడువు ముగియనున్నందున ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడం మంచిది. ఎంపికైన వారికి నిబంధనల మేరకు ప్రతి నెలా స్టైపెండ్ చెల్లిస్తారు.
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
