AP Govt Jobs: వైద్య ఆరోగ్య శాఖలో 26,263 కొత్త ఉద్యోగాలు.. త్వరలో భర్తీ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు వెల్లడించింది. రాష్ట్రంలోని వివిధ బోధనాస్పత్రులతో సహా ప్రభుత్వ వైద్యశాలలు, ఆయుర్వేద, హోమియో, యునాని ఆసుపత్రుల్లో భారీగా ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. విభాగాల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు ఈ కింద తెలుసుకోవచ్చు..
అమరావతి, జనవరి 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలోని అన్ని విభాగాల పరిధిలో భారీగా ఖాళీలు ఉన్నట్లు వెల్లడించింది. వైద్యులు, పారామెడికల్ ఉద్యోగాల ఖాళీలే సుమారు 25.97 శాతం వరకు ఉన్నట్లు తెల్పింది. నిర్ణీత 1,01,125 ఉద్యోగాలలో 3,114 వైద్యులు, 23,149 పారామెడికల్ ఉద్యోగుల కొరత ఉంది. అంటే మొత్తం 26,263 పోస్టులు ప్రస్తుతం వైద్యా ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీఎస్‌హెచ్), డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్‌హెల్త్ (డీహెచ్), ఆయుష్, జాతీయ ఆరోగ్యమిషన్‌లలో ఖాళీ పోస్టుల వివరాలను తాజాగా వైద్య ఆరోగ్య శాఖ సేకరించింది.
అయితే వీటిలోని ఖాళీలను అవసరాల మేరకు మాత్రమే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రాధాన్య క్రమంలో తొలుత ఏడెనిమిది వేల పోస్టుల భర్తీ చేసేందుక వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోనుంది. గత ప్రభుత్వ హయాంలో వైద్యా ఆరోగ్య శాఖలో పోస్టులు భర్తీ చేయకపోవడమే ఇంత పెద్ద మొత్తంలో ఖాళీలు ఏర్పడటానికి కారణమని స్పష్టమవుతోంది. వైద్య ఆరోగ్య శాఖలో అంతర్భాగంగా ఉన్న ఆయుష్ కింద ఆయుర్వేద, హోమియో, యునాని ఆసుపత్రులు సేవలందిస్తున్నాయి. ఆయుష్ విభాగంలో మొత్తం 825 వైద్యుల పోస్టులకుగాను 407 ఖాళీలు ఉన్నాయి. కాంపౌండర్లు, అటెండర్లు, ఇతర అవసరాలకు కలిపి 1601 ఉద్యోగాలు మంజూరుకాగా వాటిల్లో 1131 పోస్టులు ఖాళీగానే ఉండటం విశేషం.
ఇక అటు బోధనాసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బోధనాసుపత్రుల్లో స్పెషాలిటీ, సూపర్‌స్పెషాలిటీ వైద్యుల సేవలు అందిస్తున్నారు. వీటిల్లో మొత్తం 5,749 వైద్యుల పోస్టుల మంజూరుకాగా 1,484 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విజయవాడ జీజీహెచ్‌లో 314 వైద్యుల పోస్టులకుగాను 46 ఖాళీగా ఉన్నాయి. మెడికల్, సర్జికల్ ఆంకాలజీ విభాగాల్లో 4 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం సర్జికల్ ఆంకాలజీలో ఒకరే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. రేడియాలజీలో 2 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, ఎమర్జెన్సీ మెడిసిన్‌లో ఒక పోస్టు, గ్యాస్ట్రోఎంటరాలజీలో 2 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, నెఫ్రాలజీలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, గైనకాలజీలో 14కుగాను 10 మంది వైద్యులే ఉన్నారు. గుంటూరు జీజీహెచ్‌లో 65 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇతర ఆసుపత్రుల్లో 708 వరకు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిల్లో 9,978 పారామెడికల్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. బోధనాసుపత్రుల్లో 10,065 పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.