అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం వేళ.. తెలుగు కళాకారుడి అరుదైన కానుక!
మన సంస్కృతి సాంప్రదాయాలను, ఆహార ధాన్యాల ప్రచారంలో భాగంగా చిరుధాన్యాలతో ఎంతో చక్కటి కళారూపాలను తయారు చేశారు సూక్ష్మ కళాకారుడు మోకా విజయ్ కుమార్. ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్, జెడి వాన్స్ సంబంధించి కళారూపాలను ప్రదర్శనకు ఉంచారు. దీక్షతో ఈ చిత్రాలను జీవకళను ఉట్టిపడేలా రూపొందించాడు రైల్వే ఉద్యోగి విజయ కుమార్. ఈ ఫోటో ఫ్రేమ్‌లను రోజుకు పదకొండు గంటలు శ్రమించి 15రోజుల సమయం పట్టిందని అంటున్నాడు విజయ్ కుమార్.
అగ్రరాజ్యం ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి ప్రమాణ స్వీకారానికి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్న వేళ విశాఖకు చెందిన కళాకారుడు తనదైన శైలిలో అభిమానాన్ని చాటుకున్నాడు. ట్రంప్ జీవిత, రాజకీయ జీవితంలోని కీలక సన్నివేశాలను అద్భుతమైన చిత్రాలతో ఆవిష్కరించారు. అది కూడా కలర్స్‌తో కాదు.. కేవలం మిల్లెట్స్తోనే చిత్ర కళా రూపాలకు జీవం పోసి ఔరా అనిపించాడు..! అవకాశం ఇస్తే కానుకగా పంపిస్తానని ఆశతో ఉన్నారు.
విశాఖపట్నానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ రైల్వేలో ఉద్యోగిగా పని చేస్తున్నారు. ప్రవృత్తిగా కళలపై మక్కువతో చిరు ధాన్యాలతో కళారూపాలు చేయడం హాబీగా మార్చుకున్నాడు. ఇందులో భాగంగానే హెల్త్ ఆర్ట్ పేరుతో ప్రముఖుల చిత్రాలు, సామాజిక స్పృహను కలిగించే కళారూపాలు చేశారు. చిరు ధాన్యాల ప్రాముఖ్యత చిత్రకళ రూపంలో ప్రపంచ దేశాలకు వివరిస్తున్నాడు. అది కూడా భారతీయ సంస్కృతి సాంప్రదాయ ఆహారంలో భాగమైన చిరు ధాన్యాలతోనే. భారతీయ ఆహారమైన చిరు ధాన్యాలు విశ్వ వ్యాప్తి చేయాలని, వాటిని ఆరగించి ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలని ఈ చిత్రకారుడి ఆలోచన. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా తెలుగు ఇంటి అల్లుడు జెడి వాన్స్ అద్భుతమైన చిత్రాలను ఆవిష్కరించి, ఇటీవల అమెరికా ఎంబసీ అధికారుల ప్రశంసలు అందుకున్నారు మోకా విజయ్ కుమార్.
అయితే తాజాగా.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌తో ఇరు దేశాల సంబంధాలు మరింత బలపడలని అన్న ఆకాంక్షించారు ఈ చిత్రకారుడు. డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకార చేయబోతున్న తరుణంలో అతనికి కానుకగా మరిన్ని మిల్లెట్ ఆర్ట్ చిత్రాలను రూపొందించారు. డొనాల్డ్ ట్రంప్ బాల్యం నుంచి అధ్యక్ష పదవి వరకు జీవిత చరిత్రలోని, రాజకీయ జీవితంలోని కీలక ఘట్టాలు, సన్నివేశాలు అద్భుతంగా ఆవిష్కరించారు విజయ కుమార్. డొనాల్డ్ ట్రంప్ బాల్యం, రాజకీయ ఘట్టాలు, ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పై హత్యాయత్నం, విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ట్రంప్ హావభావాలు చక్కగా అభివర్ణిస్తూ చిత్రాలు రూపొందించారు.
చిరుధాన్యాలతో ఎంతో చక్కగా.. డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన 13 ఫ్రేమ్‌లను, ఉపాధ్యక్షుడు దంపతులు జెడీ వాన్స్ చిలుకూరి ఉష తో కూడిన మరో ఫ్రేమ్ ను ప్రదర్శనకు ఉంచారు. పర్సనల్ లోన్ తీసుకొని మరి దీక్షతో ఈ చిత్రాలను జీవకళను ఉట్టిపడేలా రూపొందించాడు రైల్వే ఉద్యోగి విజయ కుమార్. 3 అడుగుల పొడవు నాలుగు అడుగుల వెడల్పుతో ఉన్న ఈ ఫోటో ఫ్రేమ్‌లను రోజుకు పదకొండు గంటలు శ్రమించి 15రోజుల సమయం పట్టిందని అంటున్నాడు విజయ్ కుమార్.
జీవ కళ ఉట్టిపడేలా..!
చిరు ధాన్యాలు అంటే మిల్లెట్స్‌తో రూపొందించిన ఈ చిత్రాలను తదేకంగా చూస్తే గానీ నమ్మలేరు. ఈ చిత్రల కోసం ఆరు రకాల మిల్లెట్స్‌ను వినియోగించారు మోకా విజయ్ కుమార్. స్కిన్ టోన్, ఆర్ట్ షేడ్‌కు అనుగుణంగా అరికెలు, కొర్రలు, సామలు నల్ల సామలు, అంటు కొర్రలతో నేచురల్ కలరింగ్ చేశారు. దగ్గర నుంచి చూస్తే గాని.. ఆ చిత్రం చిరుధాన్యాలతో చేసినట్టు అనిపించదు. ఎందుకంటే, అంతలా తన ప్రతిభ అంతటిని జోడించి కళారూపానికి జీవం పోశారు విజయ్ కుమార్. మిల్లెట్స్ తో రూపొందించిన ఈ కళారూపాలను చూసి ఔరా అంటున్నారు సందర్శకులు..!
ఆ అవకాశం కల్పిస్తే..
మన సంస్కృతి సాంప్రదాయాలను, ఆహార ధాన్యాలను ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా చిరు ధాన్యాలతో తయారుచేసిన ఈ చిత్ర పటాలను అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్ష కుటుంబాలకు ఇవ్వాలనే ఆశతో ఉన్నానని అంటున్నాడు విజయ్ కుమార్. ఈ చిత్రాన్ని బహుకరించేందుకు అవకాశం కల్పించాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..