పెళ్లి కార్డే పెళ్లి పుస్తకమైంది.. శుభలేఖపై క్యూఆర్ కోడ్.. అంతే కాదండోయ్ ఇంకా చాలా ఉన్నాయ్..
పెళ్లి (Marriage) అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన వేడుక. సాంప్రదాయ వివాహ పద్ధతులను పాటిస్తూనే నేటి తరం పెళ్లిళ్లు ఆధునికతను సంతరించుకుంటున్నాయి. కల్యాణంలో ప్రతి ఒక్కటీ వెరైటీగా ఉండాలని కోరుకుంటారు. రెండు జీవితాలు....

ఒక్కటయ్యే మధుర సమయాన్ని కలకాలం నిలిచిపోవాలని కలలుకంటారు. అందుకు తగ్గట్టే నేటి కాలం పెళ్లిళ్లలో గణనీయమైన మార్పులు వస్తున్నాయి. మండపం నుంచి భోజనాల వరకు ప్రతి ఒక్కటీ విభిన్నంగా ఉండాలని ఆరాటపడుతున్నారు. ఈ సమయంలోనే పెళ్లికి ఆహ్వానించే కార్డులు కూడా వివిధ రూపాల్లో లభ్యమవుతున్నాయి. ఇంతకీ విషయం ఏమింటంటే.. ఓ వ్యక్తి తన కుమారుడి పెళ్లి పత్రికను చదివి పక్కన పడేయకుండా ఉండేందుకు దానిని కొద్దిగా మార్చారు. పుస్తకం రూపంలో తయారు చేయించి విద్యార్థులు వాడుకునేలా రూపొందించారు. ప్రస్తుతం ఈ పెళ్లి పుస్తకం స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా మునగపాక మండలం మునగపాక గ్రామం చంద్రబాబునాయుడు కాలనీకి చెందిన విల్లూరి నూక నర్సింగరావు.. తన కుమారుడి పెళ్లి పత్రిక అందరిలా వృథా కాకూడదని ఆలోచించారు. శుభలేఖ ఇచ్చిన క్షణాల్లోనే పక్కన పడేసే విధంగా ఉండకూడదని వినూత్న ఐడియాకు తెరలేపారు. కొందరికైనా ఉపయోగపడేలా డిజైన్ చేయించారు. బంధుమిత్రుల కుటుంబాలలోని పిల్లలకు ఉపయోగపడే విధంగా పుస్తకంలా తయారు చేయించారు.
అంతేకాదు.. కాస్త సాంకేతికతను జోడించి ఔరా అనిపించారు. ఈ నెల 24వ తేదీ ఆదివారం తన కుమారుడు విల్లూరి హరీష్ పెళ్లి జరగనుంది. ఇందుకోసం పెళ్లి కార్డులు కూడా ముద్రించాడు. బంధు మిత్రులకు శ్రేయోభిలాషులకు పెళ్ళి ఆహ్వాన పత్రికను అందించాడు. అయితే ఆ పత్రికను చూసిన వారంతా నరసింగరావు ఐడియాను అభినందించారు. ఎందుకంటే.. ఎంత ఖర్చు పెట్టి పెళ్లిపత్రికను రూపొందించినా.. చాలామంది వాటిని క్షణాల్లోనే పక్కన పడేయడం, ఆ పత్రిక వృధా అవడం నరసింగరావు గమనించాడు. దీంతో పెళ్లి పత్రికను ఏకంగా పుస్తకం రూపంలో తయారు చేయించాడు. 80 పేజీల తెల్ల కాగితాల నోట్ బుక్ ను రెండువైపులా అట్టలపై పెళ్లి కార్డు ను ముద్రించేలా డిజైన్ చేయించాడు.
పుస్తకానికి ముందుభాగం, వెనక భాగంలో ఆహ్వాన పత్రిక ముద్రించి మధ్య భాగమంతా తెల్లని కాగితాలు ఏర్పాటు చేశారు. ఈ పెళ్లిపత్రిక అందుకున్న వారంతా దాన్ని పక్కన పడేయకుండా వారికి ముఖ్యమైన విషయాలు రాసుకునే పుస్తకంలాగా ఉపయోగించుకోవాలని కోరారు. అంతేకాకుండా అతని అల్లుడు సురేష్ సాయంతో పెళ్లి జరుగుతున్న ప్రదేశాన్ని సులువుగా గుర్తించడం కోసం సాంకేతికతను ఉపయోగించారు. పెళ్లి పుస్తకం పై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. మొబైల్ సాయంతో ఆ క్యూఆర్ కోడ్ పై స్కాన్ చేస్తే పెళ్లి జరుగుతున్న ప్రదేశానికి మ్యాప్ కనిపించేలా డిజైన్ చేయించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు పెళ్లి మండపానికి సులువుగా చేరుకోవచచ్చని పెళ్ళికొడుకు హరీష్ అన్నారు. నరసింగరావు వినూత్న ఆలోచనకు మునగపాక ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– ఖాజా, టీవీ9 తెలుగు, విశాఖపట్నం
Also Read
Rahul Gandhi: మోదీ సర్కారుపై విరుచుకపడ్డ రాహుల్ గాంధీ.. మరో కీలక అంశాన్ని ప్రస్తావిస్తూ..