AP: పోలీస్ స్టేషనే పుట్టినిల్లు.. తోటి ఉద్యోగులే తోబుట్టువులు! ఈ శ్రీమంతం వేడుక ఎక్కడ జరిగిందటే..?
వినుకొండ పోలీస్ స్టేషన్ లోని కానిస్టేబుల్ సావిత్రి గర్భవతి అయినందున మెటర్నిటీ లీవ్ లోకి వెళ్ళే ముందు, ఆమె తోటి సిబ్బంది, అధికారులు ఘనంగా శ్రీమంతం చేశారు. మహిళా ఎస్సై, సీఐలు తమ కుటుంబ సభ్యురాలి లాగే ఆమెను సత్కరించి, బట్టలు, పసుపు, కుంకుమతో ఆశీర్వదించారు.

ఆమె పేరు సావిత్రి. గత రెండేళ్ళుగా వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తుంది. విధి నిర్వహణలో చురుగ్గా వ్యవహరించే సావిత్రి అంటే ఆ స్టేషన్ సీఐ, ఎస్సైల ప్రత్యేక గౌరవం, అభిమానం. నాలుగేళ్ళ క్రితం సావిత్రికి వివాహమైంది. మొదట బాబుకు జన్మనిచ్చిన సావిత్రి రెండోసారి గర్భం దాల్చింది. గత ఐదు నెలలుగా సావిత్రి విధి నిర్వహణలో భాగంగా పీఎస్ కు వస్తూనే ఉంది.
అయితే ఆమెకు ఆరో నెల రావడంతో మెటర్నరీ లీవ్ పై వెళ్ళేందుకు సిద్దమైంది. ఈ క్రమంలో ఆమె కొంతకాలంపాటు విధులకు హాజరు కాదని తెలుసుకున్న సిబ్బంది, అధికారులు ఆమెకు స్టేషన్ లో ఘనంగా శ్రీమంతం చేశారు. మహిళా ఎస్సై స్వర్ణలత, సీఐ శోభన్ బాబులు తమ స్వంత ఆడబిడ్డకు శ్రీమంతం చేసిన విధంగానే సావిత్రికి బట్టలు పెట్టి సాంప్రదాయబద్దంగా కార్యక్రమం నిర్వహించారు. స్టేషన్ లోని ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ఆడబిడ్డ లాగే పసుపు, కుంకుమ పెట్టి అక్షింతలు జల్లి పండంటి బిడ్డకు జన్మనివ్వాలని ఆశీర్వదించారు. తోటి సిబ్బంది అంతా కలిసి శ్రీమంతం చేయడంతో ఆ మహిళా కానిస్టేబుల్ కళ్ళలో ఆనందం భాష్పాలు కనిపించాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.