Andhra: మరోసారి సాక్షాత్కారమైన అద్భుతం.. సీతారాముల కల్యాణం వేళ గరుడ పక్షి ప్రదక్షిణలు
ప్రకాశం జిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన చదలవాడ శ్రీ రఘునాయక స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు... భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం జరిగిన 9వ రోజు చదలవాడలో రాముల వారి కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది... అగస్త్య మహాముని ప్రతిష్టించిన ఈ దేవాలయంలో రాములవారికి కుడివైపు కొలువు తీరి ఉన్న సీతమ్మవారి కళ్యాణ మహోత్సవం జరిగే సమయంలో గరుడ పక్షి ఆకాశంలో ప్రదక్షిణలు చేయడం విశేషం... ఈ ఏడాది కూడా ఆకాశంలో గరుడ పక్షి ప్రదక్షిణాలు చేసిన తరువాత సీతారామ దంపతులకు తలంబ్రాలు పోసి పెళ్ళి తంతును ముగించారు వేద పండితులు... ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు.

ఈ నెల 6వ తేదిన శ్రీరామ నవమి ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటే ఒక్క చదలవాడలో మాత్రం భద్రాచలంలో శ్రీరామునికి కళ్యాణం జరిగిన తొమ్మిదో రోజు ఇక్కడ కళ్యాణం చేశారు. ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో అగస్త్య మహాముని ప్రతిష్టించిన ఈ దేవాలయానికి ఎంతో చారిత్రాత్మక ప్రాధాన్యత ఉంది. సీతాదేవిని రావణాసురుడు అపహరించిన సమయంలో ఆమెను వెతుక్కుంటూ శ్రీరాముడు ఈ ప్రాంతానికి వచ్చాడని చెబుతారు. ఇక్కడ తనకు సహాయ సహకారాలు అందించిన వానర సైన్యాన్ని నాలుగు భాగాలుగా విభజించి నాలుగు దిక్కులకు పంపారని అందువల్లే ఈ గ్రామానికి చాతుర్వాటిక అనే పేరు కూడా వచ్చిందని స్థలపురాణం… ప్రతి ఏటా చైత్ర శుద్ధ దశమి నుంచి 16 రోజుల పాటు ఈ దేవాలయంలో కళ్యాణ మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.
శ్రీరామునికి కుడిపక్క సీతమ్మ… ఈ ఆలయంలో విశేషం…
హిందువుల సాంప్రదాయం ప్రకారం భర్తకి భార్య ఎప్పుడూ ఎడమవైపు మాత్రమే ఉండాలి… ముఖ్యంగా కళ్యాణం, ధాన ధర్మాలు, పూజలు, నోములు చేసేటప్పుడు భర్తకి భార్య తప్పనిసరిగా ఎడమవైపునే ఉండాలని చెబుతారు… అప్పుడే ఫలితం దక్కుతుందని అంటారు… శ్రీ మహా విష్ణువు కూడా తన భార్య అయి శ్రీ మహాలక్ష్మీని ఎడమ స్థానంలో ఉంచుతారట… ఇక అర్ధనారీశ్వరుడు అయిన శివుడు కూడా శరీరంలో ఏడమభాగాన్ని పార్వతికి ఇచ్చేశాడని చెబుతారు… ఏ ఆలయంలో చూసినా స్వామివార్లకు అమ్మవార్లు ఎడమవైపునే ఉంటారు… అందుకే నిజజీవితంలో కూడా భర్తకు భార్య ఎప్పుడూ ఎడమవైపే ఉండాలని చెబుతారు… అలాగే భద్రాచలం ఆలయంలో శ్రీరాముడి విషయంలో కూడా స్థల పురాణం ప్రకారం శంఖచక్రాలు స్దానభ్రంశం అయిఉన్నా, సీతమ్మ మాత్రం రామయ్య ఎడమ ప్రక్కనే ఆసీనురాలయి కనిపిస్తారు… అయితే చదలవాడ శ్రీరఘునాయక స్వామి ఆలయంలో మాత్రం శ్రీరామునికి కుడివైపున సీతమ్మవారు కొలువుతీరి ఉంటారు… ఇదే ఇక్కడ దేవాలయంలోని విశేషమని చెబుతారు…

Sitha Rama Kalyanam
గరుడ పక్షి ఆగమనం… తలంబ్రాల సంబరం…
చదలవాడ శ్రీరామ కళ్యాణ వేడకల్లో మరో విశేషం ఉంది… స్వామివారి కళ్యాణం రోజున తలంబ్రాలు పోసే సమయంలో ఒక గరుడపక్షి వచ్చి ఆలయంపై మూడు ప్రదిక్షణలు చేసి వెళుతుంది… ఏప్రిల్ 14, సోమవారం కూడా కళ్యాణం జరిగే సమయంలో మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు ఆకాశంలో గరుణపక్షి ప్రదక్షిణాలు చేయడాన్ని భక్తులు తిలకించారు… ఎప్పటిలాగానే ప్రతి ఏడాది స్వామివారికి తలంబ్రాలు పోసే సమయంలో గరుడపక్షి వచ్చి ఆలయంపై మూడు ప్రదక్షిణలు చేయడంతో భక్తులు జై శ్రీరామ్ అంటూ భక్తితో నినాదాలు చేశారు… అనంతరం కళ్యాణం జరిగిన సీతారాములకు తలంబ్రాలు పోశారు… కన్నులపండువగా నిర్వహించిన ఈ ఈ కళ్యాణవేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
చాతుర్వాటిక…
చదలవాడ శ్రీరఘునాయకస్వామి ఆలయంలో గరుత్మంతుడి ప్రదక్షిణల సాక్షిగా శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి… అంటూ ఇక్కడ భక్తులు భక్తి తన్మయత్వంతో గీతాలు ఆలపించారు… 1450 ఏళ్ళ క్రితం అగస్త్య మహాముని ప్రతిష్టించిన శ్రీరఘునాయక ఆలయం ఉన్న చదలవాడకు చాతుర్వాటిక అనే పేరు కూడా ఉంది… చాతుర్వాటిక అనే పేరు ఎలా వచ్చిందంటే… రావణాసురుడు అపహరించిన సీతాదేవిని వెతుకుతూ చదలవాడ ప్రాంతానికి వచ్చిన శ్రీరాముడు వానర సైన్యాన్ని ఇక్కడికి పిలిపించారట… ఇక్కడ నుండి వానర సైన్యాన్ని 4 విభాగాలుగా విభజించి, 4 దిక్కులకు సీతాదేవిని వెతికేందుకు పంపించారని స్థల పురాణాన్ని బట్టి అర్ధం అవుతోంది… వానరసైన్యాన్ని ఈ ప్రాంతం నుంచే నలుదిక్కులకు పంపించడం వల్ల చదలవాడ గ్రామానికి చాతుర్వాటిక అనే పేరు వచ్చిందని చెబుతారు… కాలక్రమేణా ఈ చాతుర్వాటికే చదలవాడగా పేరుగాంచిందని స్థానికులు చెబుతుంటారు… ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే గరుడ వాహన సేవలో పాల్గొని భక్తులు మొక్కుకుంటే పిల్లలు లేనివారికి సంతానభాగ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు… అలాగే స్వామివారి కళ్యాణానికి అన్ని చోట్లా ముహూర్తం పెట్టి కళ్యాణం చేస్తే, ఇక్కడ మాత్రం గరుత్మంతుడు వచ్చి కళ్యాణమండపంపై మూడుసార్లు ప్రదక్షిణలు చేసిన తరువాతే తలంబ్రాలు పోసి పెళ్ళి తంతు ముగిస్తారని అర్చకులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..