Vijayawada: ఇంద్రకీలాద్రి సాక్షిగా మంత్రి, మాజీ మంత్రి మధ్య మరో వివాదం
ఇంద్రకీలాద్రి సాక్షిగా మంత్రి, మాజీ మంత్రి మధ్య మరో వివాదం మొదలైంది. దుర్గమ్మ తెప్పోత్సవం పాస్‌ల విషయంలో మనస్పర్ధలు కాస్త బయటపడ్డాయి. మాజీ మంత్రి మానియా ఇంకా కొనసాగిస్తున్నారంటూ ప్రస్తుత దేవాదాయశాఖ మంత్రి మాటల్లో వినిపిస్తోంది. ఇంతకీ ఉత్సవాల్లో ఏం జరిగింది? అసలు పాస్‌ల గొడవేంటి?.
బెజవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ శరన్నవరాత్రులు, దసరా మహోత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. అయితే మూడేళ్లుగా జరగని తెప్పోత్సవం ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించింది దేవాదాయశాఖ. సువర్ణ కాంతుల విద్యుత్ దీపాలంకరణలో… మిరమిట్లు గోలిపే బాణాసంచా వెలుగులు.. రంగురంగుల హంస వాహనంపై కృష్ణమ్మ వడిలో విహరించారు ఆదిదంపతులు దుర్గా మల్లేశ్వరస్వామి వారు. మంగళ వాయిద్యాలు వేదమంత్రాలు సాంస్కృతిక కళా ప్రదర్శనలు భక్తకోటి జయ జయ రాగాలు ప్రత్యేక పూజల మధ్య కృష్ణానదిలో హంస వాహనంపై ఊరేగించారు.
అయితే ఈ తెప్పోత్సవం ప్రజెంట్, మాజీ దేవాదాయశాఖమంత్రికి మధ్య వివాదానికి దారితీసింది. గతంలో హంసవాహన సేవలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఈవో, కలెక్టర్ సహా వీఐపీలకు అనుమతి ఉండేది. ఈసారి తెప్పోత్సవంలో మార్పులు చేశారు అధికారులు. హంస వాహనంపై ప్రజా ప్రతినిధులు, అధికారులకు ప్రవేశం లేదంటూ తెప్పోత్సవానికి ముందే అధికారుల సమీక్షలో నిర్ణయించారు. కృష్ణానదిలో విహరించేందుకు ప్రజాప్రతినిధులకు, అధికారులకు హంసవాహనంపై కాకుండా దాని వెనకాలే బోదిసిరి బోటును ఏర్పాటు చేశారు. అయితే మొదట హంస వాహనంలో విహరించేందుకు నిర్ణయించుకున్న.. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు బోదిసిరి బోటుకు సంబంధించిన పాస్‌లు అందడంతో అలకబూనారు. తన దగ్గరకు చేరిన బోదిసిరి బోటు పాస్‌లను వెనక్కి తిప్పిపంపారు. దీంతో వివాదం మొదలైంది.
ఇదే విషయంపై మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు. వెల్లంపల్లికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చామని తెలిపారు మంత్రి. మంత్రిని ..తానే హంసవాహనం ఎక్కడంలేదని చెప్పారు కొట్టు సత్యనారాయణ. మంత్రి కొట్టు సత్యానారాయణ మాట ఇలా ఉంటే .. దీనిపై వెల్లంపల్లి ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. ఈవిషయంలో మాజీ దేవాదాయ మంత్రి.. స్థానిక ఎమ్మెల్యే అయిన తనను అవమానించారని వెల్లంపల్లి భావించారా? లేక మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పినట్లు ఏదైనా పనిలో ఉండి హాజరు కాలేక పోయారా? లేక మంత్రి మాటలపై అలకా? ఆగ్రహమా? .. అనేది వెలంపల్లి చెబితే కాని తెలియదు. అయితే మొత్తానికి తెప్పోత్సవంలో తీసుకున్న నిర్ణయం మాత్రం మాజీ మంత్రి, ప్రజెంట్ మంత్రి మధ్య అగ్గిరాజేసిందనే చెప్పాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి