Andhra Pradesh: ఏపీలో కాపు రాజకీయం.. రంగా హత్య అంశం ఇప్పుడు రాజకీయ పార్టీలకు ఫ్యూయల్

రంగా హత్యకు గురైన ముప్పై ఏళ్ల తర్వాత ఆయన హత్య చుట్టూ ఏపీ పాలిటిక్స్ నడుస్తున్నాయి.. అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు రంగా హత్యను తమ రాజకీయాలకు అనుగుణంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Andhra Pradesh: ఏపీలో కాపు రాజకీయం.. రంగా హత్య అంశం ఇప్పుడు రాజకీయ పార్టీలకు ఫ్యూయల్
Vangaveeti Mohana Ranga
Follow us

| Edited By: Basha Shek

Updated on: Dec 21, 2022 | 10:02 PM

వంగవీటి కత్తి-కాపుని కాసే శక్తి .. రంగా హత్యకు గురైన ముప్పై ఏళ్ల తర్వాత ఆయన హత్య చుట్టూ ఏపీ పాలిటిక్స్ నడుస్తున్నాయి.. అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు రంగా హత్యను తమ రాజకీయాలకు అనుగుణంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాపు కులానికి చెందిన వంగవీటి రంగా హత్య అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం.. బెజవాడ నడిబొడ్డున తన ఇంటి ముందు ప్రజాసమస్యల మీద దీక్ష చేస్తున్న వంగవీటి మోహనరంగాను.. ప్రత్యర్థులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. కత్తులతో నరికి, బాంబులతో దాడి చేసి హత్య చేశారు. రంగా హత్య సమయంలో ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడంతో టీడీపీ వర్గీయులు ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారి ఆస్తులపై దాడులు జరిగాయి.. 45రోజుల పాటు బెజవాడలో కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. అప్పట్లో అటు దేవినేని నెహ్రూ, వంగవీటి రంగా కుటుంబాల మధ్య ఆధిపత్య పోరులో ఈ హత్యలు జరిగాయని బెజవాడ వాసులు చెబుతుంటారు. ఈ రెండు వర్గాల మధ్య పోరులో అటు దేవినేని కుటుంబంలో దేవినేని గాంధీ, దేవినేని మురళిలు హత్యకు గురికాగా ఇటు వైపు వంగవీటి రంగాతో పాటు ఆయన సోదరుడు వంగవీటి రాధాకృష్ణ హత్యకు గురయ్యారు. అలాగే రెండువర్గాలకు చెందిన కార్యకర్తలు ఎంతోమంది హత్యకు గురయ్యారు.. రంగా మరణం అనంతరం జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలయింది. అప్పటి నుంచి ఏపీలో అటు రెండు ప్రధాన కులాలైన కమ్మ, కాపు మధ్య చిచ్చు రగిలింది. రంగా మరణానంతరం ఆయన్ని కాపు కులానికి నాయకుడిగా బావిస్తూ వస్తున్నారు. అందుకే ప్రతి ఎన్నికల్లోనూ కాపు ఫ్యాక్టర్ అనేది కీలకంగా మారింది.

ముప్పై ఏళ్ల తర్వాత కూడా..

ప్రతి ఎన్నికల్లోనూ రంగా హత్య అంశం తెరమీదికి వస్తూనే ఉంటుంది. ఏపీలో రంగాకు ఆరువందలకు పైగా విగ్రహాలు ఏర్పాటు చేశారంటే ఆయన హవా ఏంటో అర్థం చేసుకోవచ్చు..చనిపోయి ఇన్నేళ్లయినా ఇంకా ఏపీ పాలిటిక్స్ లో ఆయన పేరు వినిపిస్తూనే ఉంటుంది. రంగా హత్య తర్వాత ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేదు…ముద్రగడపద్మనాభంలాంటివారు కొంతవరకూ కాపు నాయకుడిగా కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేశారు.

పవన్ కల్యాణ్ ఎంట్రీతో ..

2014 ఎన్నికల తర్వాత నుంచి రంగా హత్య అంశం ప్రతి ఎన్నికల్లోనూ తెరమీదికి వస్తూనే ఉంది. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఎఁట్రీ తర్వాత కాపు అంశం మరింత ప్రాధాన్యతాంశంగా మారింది. కాపు కులం నుంచి గతంలో చిరంజీవి పార్టీ పెట్టినప్పటికీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేశారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్ కూడా కాపుల నాయకుడిగానే ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఎంట్రీ తర్వాత కాపు కులస్తులంతా ఎటువైపు ఉండాలనేదానిపై ఏపీ పాలిటిక్స్ లో విపరీతమైన చర్చ జరుగుతూనే ఉంది. 2014 ఎన్నికలకు ముందే పార్టీ పెట్టినప్పటికీ పవన్ కల్యాణ్ డైరెక్ట్ గా పోటీ చేయకపోయినప్పటికీ టీడీపీ కి మద్దతిచ్చారు. దీంతో ఆటోమేటిక్ కాపుల్లో మెజార్టీ టీడీపీకి ఓటేయడంతో ఆ పార్టీ విజయం సాధించింది. కానీ 2019ఎన్నికల్లో అదే కాపులు రెండు వర్గాలుగా చీలి అటు పవన్ కల్యాణ్ వైపు ఇటు వైసీపీ వైపు మళ్లారు.

ఇవి కూడా చదవండి

కాపు ఓట్ల కోసం రంగా హత్య ప్రస్తావన తెస్తున్నారా?

అన్ని రాజకీయపార్టీలకు కాపు ఓట్లు కావాలి.. అందుకు ప్రతిసారి రంగా హత్య ప్రస్తావన తేవాలి..తద్వారా కాపులను ఆకట్టుకోవాలి..ఇది రాజకీయ పార్టీల వ్యూహం. ఈ వ్యవహారంలో ప్రతిసారి కాపులు ఏదో పార్టీ వ్యూహంలో చిక్కుకుంటూనే ఉన్నారు. ఈసారి ఇలా ఓట్లు చీలకుండా ఉండేందుకు అన్ని పార్టీలు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర ముందే రంగా హత్యను తెరమీదికి తెస్తున్నారు. రంగాను టీడీపీ నాయకులే హత్య చేశారంటూ వైసీపీ నాయకులు ఆ అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ టీడీపీతో కలిసి పొత్తులోవెళ్లినా కూడా కాపు ఓట్లు అటువైపు వెళ్లకుండా రంగా హత్య లో టీడీపీని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తోంది వైసీపీ..ఇటు టీడీపీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందుకే రంగా వర్ధంతికి రోజు టీడీపీ నేతలు గంటాశ్రీనివాస్, బోండాఉమల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. రంగా హత్య అనేది రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘటనే కానీ… ఇది టీడీపీకి సంబంధం లేని విషయం అన్నట్టుగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

రంగావర్ధంతికి ముందు నానాహడావిడి..

తాజాగా రంగా హత్య అంశాన్ని మరోసారి తెరమీదికి తెచ్చారు వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను …రంగా హత్య జరిగిన సమయంలో టీడీపీ గూండాలు అధికారంలో ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఏపీలో..మరోసారి రంగా హత్య వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ అయింది.. రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణను పక్కన ఉండగానే టీడీపీపై తీవ్ర ఆరోపణలు చేయడం ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఇప్పుడు వంగవీటి రాధాకృష్ణ టీడీపీలోనే ఉన్నారు. తాను కొనసాగుతున్న పార్టీపై అధికార వైసీపీ కామెంట్ చేసినప్పటికీ వంగవీటి రాధాకృష్ణ ఎక్కడా రియాక్ట్ కాలేదు..ప్రతి ఏటా రంగా వర్ధంతి రోజు బెజవాడ బందరురోడ్డులోని ఆయన ఇంటికి ఎదుట ఉన్న రంగా విగ్రహానికి ఆయనకుమారుడు కొంతమంది అనుచరులు దండే సి నివాళి అర్పించడం మినహా పెద్దగా కార్యక్రమాలు ఏమీ ఉండేవి కావు..ఆయన అనుచరులు మిగిలిన ఏరియాల్లో చిన్నచిన్న కార్యక్రమాలు చేసేవారు. కానీ ఈ స్థాయిలో బహిరంగ సభలకు పిలుపునివ్వడం, కాపుకులస్థులందర్నీ ఒక చోటికి చేర్చడం లాంటివి జరగలేదు..కానీ ఇప్పుడు ఏపీలో రంగా హత్య ఘటనఅనేది వచ్చే ఎన్నికల్లో కీలకం కాబోతోంది..కాపు ఓట్లపై కన్నేసి అధికార, ప్రతిపక్ష పార్టీలు కాపులందర్నీ తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

రంగాని కేవలం కాపులకే పరిమితం చేస్తున్నారా..

బెజవాడలో వంగవీటి మోహనరంగాది ఒక చరిత్రే.. అప్పట్లో ఎన్నో లక్షల మందికి ఆరాధ్యుడు వంగవీటి రంగా..కానీ ఆయన్ని రాజకీయాల కోసం కేవలం ఒక కులానికి పరిమితం చేస్తున్నారు రాజకీయనాయకులు..నిజంగా ఆ రోజుల్లో వంగవీటి కేవలం కాపులకే అండగా నిలిచేవారా ..అంటే కాదనే సమాధానం బెజవాడలో వినిపిస్తుంది. నిజానికి అప్పట్లో అసలు బెజవాడలో కమ్మ,కాపు అనే ఈక్వేషన్లు లేనేలేవని రంగా సన్నిహితులు చెబుతారు. అసలు రంగా కులాలను పెద్దగా పట్టించుకునే వారు కాదు..కష్టమొచ్చిందని ఏ కులంవారైనా సరే తన దగ్గరకు వస్తే చాలు.. వెంటనే ఆ సమస్య పరిష్కారం కోసం తానే స్వయంగా వెళ్లిపోయారు.. రిక్షా కార్మికుల నుంచి మొదలుకుని ఏ స్థాయిలో ఉన్నవారైనా సరే ఆపదలో ఉంటే చాలు రంగా పరిగెత్తుకొచ్చేవారని వారి తరఫును కొట్లాడేవారని చెబుతుంటారు..అందుకే ఆయనకు అంతటి ప్రజాధరణ.. నిజానికి ఆయన సతీమణి రత్నకుమారి కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు..ఆ రోజుల్లో ఆయన సన్నిహితులు, అనుచరులు అందరూ వేర్వేరు సామాజికవర్గాలకు చెందినవారే ఉండేవారు. ఆయనకు నిజంగా కుల ఫీలింగ్ ఉండి ఉంటే అసలు దేవినేని నెహ్రూ కుటుంబం తో ఆయన స్నేహం ఎందుకు చేసేవారని కొంతమంది ప్రశ్నిస్తుంటారు. మొదట్లో దేవినేని గాంధీ, దేవినేని నెహ్రూ , వంగవీటి రాధాకృష్ణ, వంగవీటి రంగాలు అత్యంత సన్నిహితులు.. విద్యార్థి నాయకులుగా దేవినేని సోదరులు, అప్పటికే బెజవాడలో యూనియన్ నాయకులుకు ఒక స్థాయిలో ఉన్న వంగవీటి కుటుంబంతో అత్యంత సాన్నిహితంగా ఉండేవారు.. వంగవీటి రత్నకుమారిని…రంగా వివాహమాడిన సమయంలోనూ వీరంతా కలిసే ఉన్నారు. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల వల్ల దేవినేని, వంగవీటి కుటుంబాల మధ్య చిచ్చు రేగింది.. ఆ తర్వాత రెండు కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యులు హత్యకు గుర్యయ్యారు. దేవినేని కుటుంబం నుంచి దేవినేని గాంధీ, దేవినేని మురళి హత్యకు గురైతే రంగా కుటుంబం నుంచి వంగవీటి రాధాకృష్ణ, వంగవీటి రంగా హత్యకావించబడ్డారు. ఈ రెండు కుటుంబాల మధ్య నిజంగా ఆ సమయంలో విబేధాలు తలెత్తకుండా ఉండిఉంటే చరిత్ర మరోలా ఉండేది..బహుశా వంగవీటి రంగా దేశరాజకీయాలను శాసించేవారేమో.. అంతటి నాయకుడిని ఇప్పటికీ ఒక కులానికి పరిమితం చేసేస్తూ ఆ కుల ఓట్ల కోసం రంగా హత్యను పదేపదే గుర్తుకు తెస్తున్నారు నేటి రాజకీయనాయకులు.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..