AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాము కాటుకు రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమమం..!

రెండు వాన చుక్కలు పడ్డాయంటే చాలు.. పాములు సంచారం పెరుగుతాయి. అంతవరకు పుట్టలలో, చిన్న చిన్న రంధ్రాల్లో, ఇటుకులు, చెక్కల ఇరుకున దాగి ఉండే పాములు.. వాన నీటికి ఆవాసం చెదిరి బయట సంచరిస్తూ ఉంటాయి. తమకు అనువైన కొత్త ఆవాసాలు కోసం అక్కడ.. ఇక్కడ తిరుగుతూ అన్వేషిస్తూ ఉంటాయి.

పాము కాటుకు రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమమం..!
Snakes
S Srinivasa Rao
| Edited By: Balaraju Goud|

Updated on: Jun 04, 2025 | 9:06 PM

Share

రెండు వాన చుక్కలు పడ్డాయంటే చాలు.. పాములు సంచారం పెరుగుతాయి. అంతవరకు పుట్టలలో, చిన్న చిన్న రంధ్రాల్లో, ఇటుకులు, చెక్కల ఇరుకున దాగి ఉండే పాములు.. వాన నీటికి ఆవాసం చెదిరి బయట సంచరిస్తూ ఉంటాయి. తమకు అనువైన కొత్త ఆవాసాలు కోసం అక్కడ.. ఇక్కడ తిరుగుతూ అన్వేషిస్తూ ఉంటాయి. అందుకే వానా కాలం వచ్చిందంటే చాలు బయట పాముల సంచారం ఎక్కువుగా ఉంటుంది. ఆ సందర్భంలోనే మనుషులపైన, ఇతర జంతువులపైన దాడి చేసి కరుస్తాయి. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన మూడు రోజులు జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువుగా ఉన్నప్పటికీ అంతకు ముందు 4 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ముసురు వాతావరణం అలుముకుంది. జిల్లాలో భారీగా వర్షం కురిసింది.

శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో పాములు దడ పుట్టిస్తున్నాయి. బయట వాటి సంచారం పెరగటంతో జిల్లా వాసులు అందరిలోనూ ఆందోళన మొదలైంది. రెండు రోజుల వ్యవధిలో జిల్లాలో ఇద్దరు వ్యక్తులు పాముకాటుకు గురై మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. దీంతో జనాలు పాములంటే చాలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా కవిటి మండలం శవశాన పుట్టుగకు చెందిన తలగాన పూజ (27)తమ అమ్మమ్మగారి ఊరయిన A.S. పేటలో జరుగుతోన్న శ్రీచంద్రశేఖర స్వామి ఆలయ పునః ప్రారంభ వేడుకలు సందర్భంగా ఆ గ్రామానికి వచ్చింది.

ఆదివారం(జూన్ 02) ఆలయ పుణః ప్రతిష్ట పూర్తి కాగా ఆ రాత్రి మేనమామ కుమారుడు వంజరాన జయరాo(10) పెద్దమ్మ కుమార్తె అయిన ఏళ్ల గీతా కృష్ణ వేణి(16) మరో ఇద్దరు ఒకే చోట పడుకున్నారు. అదే సందర్భంలో ఒక పాము ఎక్కడ నుండో వచ్చి ఇంట్లోకి ప్రవేశించింది. ఇంట్లో నిద్రిస్తున్న పూజ, జయరాం, కృష్ణ వేణి లను కాటు వేసింది. పాము కాటు వేయటంతో బాధితులు ఉలిక్కిపడి లేచి పామును చూసి అరవడంతో అక్కడే నిద్రిస్తున్న మరో ఇద్దరు లేచి పాము కాటు నుండి తప్పించుకోగలిగారు.

పాము కాటుకు గురైన ముగ్గురిని వెంటనే బందువులు సమీపంలోని ఇచ్చాపురం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. అప్పటికే వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అక్కడ నుండి ఒరిస్సాలోని బరంపురం సమీపంలో ఉన్న బ్రహ్మపురం మెడికల్ కాలేజ్ కు తరలించారు. అయితే అప్పటికే తలగాన పూజ మరణించినట్లు వైద్యులు తెలిపారు. మిగిలిన ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారికి మెరుగైన చికిత్స అందించారు వైద్యులు. పూజ మృతితో తన స్వగ్రామం అయిన శవశాన పుట్టుగతోపాటు అటు అమ్మగారి గ్రామమైన A.S. పేటలోని విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇక మరో పాము కాటు ఘటనలో జిల్లాలోని లావేరు మండలం బుడుమూరు గ్రామానికి చెందిన కొలుసు గోపి(39) మృతి చెందారు. మంగళవారం(జూన్ 03) సాయంత్రం పక్క గ్రామమైన అరినాం అక్కివలస సమీపంలో తాటికల్లు తీసేందుకు చెట్టు ఎక్కి దిగుతుండగా పాము కాటేసింది. వెంటనే స్థానికులు అతన్ని జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కు చికిత్స కోసం తరలించారు. అయితే చికిత్స పొందుతూ గోపి మృతి చెందారు. మృతుడు గోపికి భార్య దేవి, ఒక కుమారుడు ఉన్నారు. గోపి మృతితో ఆయన స్వగ్రామమైన బుడుమూరు గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.

రెండు రోజుల వ్యవధిలోనే జిల్లాలో పాముకాటుతో ఇద్దరం మృత్యువాత పడటం ఇప్పుడు అంతట చర్చనీయాంశం అయింది. రానున్న వర్షాకాలం దృష్ట్యా పాములు బెడద మరింత ఎక్కువగా ఉంటుందని కావున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులు నిమిత్తం పొలాలకు వెళ్లేవారు పాములు బారిన పడకుండా మరింత జాగ్రత్త తీసుకోవాలని చెబుతున్నారు.

 మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..