TTD: ‘ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో 5వేల ఆలయాల నిర్మాణం.. 10 రోజులపాటు వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం’
ఏం చేద్దాం...? ఎలా ముందుకెళ్దాం...? ఇంకెంత మెరుగ్గా భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యాన్ని కల్పిద్దామంటూ సమావేశమైన టీటీడీ పాలకమండలి... సుమారు 100కి పైగా అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. అసలెన్ని రోజులు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు...? టోకెన్ల జారీ ఎలా ఉంటుందన్న దానిపై గందరగోళం నెలకొంది. ఈక్రమంలో వైకుంఠ ద్వార దర్శనాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది టీటీడీ.

శ్రీవారి దర్శనాల నిర్వహణలో ఆర్టిఫీషీయిల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై చర్చించింది టీటీడీ పాలకమండలి. ఏఐని వినియోగించడం వల్ల సామాన్య భక్తులకు కూడా గంట నుండి రెండు గంటల్లో దర్శనాన్ని కల్పించవచ్చని టీటీడీ అభిప్రాయపడుతోంది. ఏఐ వాడకంపై త్వరలోనే ఓ కమిటీ వేయాలని నిర్ణయించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించాలన్న నిర్ణయానికి బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఒంటిమిట్టలో 100 గదులతో భారీ వసతి సముదాయాన్ని నిర్మించనుంది టీటీడీ. టీటీడీ గోశాల నిర్వహణ సరిగా లేదన్న విషయం బోర్డు దృష్టికి వచ్చిందన్నారు ఛైర్మన్ బీఆర్ నాయుడు. గోశాల నిర్వహణకు ఏం చేయాలి…? అనుభవం ఉన్న సంస్థకు కేటాయించాలా…? లేదా…? అన్న విషయంలో కమిటీ వేసి ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు.
కరీంనగర్‌లో నిర్మించదలచిన స్వామి ఆలయంపైనా కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. అలాగే తిరుచానూరు బ్రహ్మోత్సవాల పోస్టర్లు విడుదల చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల కానుకను శాశ్వత ఉద్యోగులకు రూ.15,400, కాంట్రాక్ట్ ఉద్యోగులకు 7,535 ప్రకటించారు.
టీటీడీ తీసుకున్న నిర్ణయాలు అన్ని దిగువన తెలుసుకోండి…
1.తిరుమలలో గదుల టారీఫ్ లను పరిశీలించి నివేదిక సమర్పించడానికి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం.
2. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో టిటిడి ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం. పర్మినెంట్ ఉద్యోగులకు రూ.15,400, కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.7,535 ఇవ్వాలని నిర్ణయం. అయితే బ్రహ్మోత్సవాలలో పనిచేసిన తిరుమల, తిరుపతికి చెందిన సిబ్బందికి అదనంగా 10 శాతం ఇవ్వాలని నిర్ణయం.
3. టీటీడీ గోశాల నిర్వహణకు సబంధించి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా గోశాల నిర్వహణ, అభివృద్ధిపై తదుపరి చర్యలు తీసుకుంటాం.
4. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం రూ.37 కోట్ల వ్యయంతో 100 గదులను ఆధునిక వసతులతో నూతన అతిధి భవనాన్ని నిర్మించేందుకు ఆమోదం.
5. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం వద్ద భక్తులకు మరింత ఆహ్లాదకర, ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించేందుకు రూ.2.96 కోట్లతో 1.35 ఎకరాల్లో పవిత్ర వనం ఏర్పాటుకు ఆమోదం.
6. కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద యాత్రికుల వసతి సముదాయం, సామూహిక వివాహాలకు ప్రత్యేక హాల్స్ నిర్మాణానికి రూ.25 కోట్లు మంజూరుకు ఆమోదం. ఇందుకు సంబంధించి ప్రభుత్వ అనుమతి కొరకు పంపాపలని నిర్ణయం.
7. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చెన్నై టి.నగర్ లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం పరిధిలో ఉన్న 6,227 చ.అ. స్థలాన్ని దాతల సహకారంతో రూ.14 కోట్లతో కొనుగోలు చేసేందుకు నిర్ణయం .
8. తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ లో శ్రీ పద్మావతి మరియు శ్రీ ఆండాళ్ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, ఆలయ ప్రాకారం, రాజగోపురం, నాలుగు మాడ వీధులు, తదితర మౌళిక సదుపాయాల కల్పనకు ఇప్పటికే ఆమోదించిన రూ.20 కోట్ల నిధులతో పాటు అదనంగా మరో రూ. 10 కోట్లు దాతల ద్వారా సేకరించాలని నిర్ణయం.
9. వేద విశ్వవిద్యాలయం విసి ఆచార్య రాణి సదా శివమూర్తిని తొలగించాలని నిర్ణయం.
10. టీటీడీ కొనుగోలు విభాగంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సమగ్ర విచారణకు ఎసిబితో విచారణ జరపాలని నిర్ణయం.
వైకుంఠ ఏకాదశిపై వివాదానికి ఫుల్ స్టాప్
అనుమానమే లేదు…! గందరగోళం అవసరమే లేదు…! తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం పదిరోజులపాటు కల్పిస్తామని స్పష్టం చేసింది టీటీడీ. అసత్య ప్రచారాలను అసలే నమ్మొద్దంటోంది. ఈసారి వైకుంఠ ద్వార దర్శనానికి సుమారు 7 లక్షల మంది వస్తారని అంచనా వేస్తోంది టీటీడీ. గత సంవత్సరంలో జరిగిన తప్పిదాలు జరగకుండా టోకెన్ల జారీ విధివిధానాల కోసం సబ్ కమిటీని ఏర్పాటు చేసింది టీటీడీ.
ఇదే వైకుంఠ ఏకాదశి దర్శనాలపై నిన్నటిదాకా రాజకీయ రచ్చ నడిచింది. ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమలలో ఏకాదశి, ద్వాదశికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం చేయాలని ఏపీ సాధుపరిషత్ డిమాండ్ చేయడంపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. రెండ్రోజులు ఎలా కుదురుతుందంటూ టీటీడీతో పాటు ప్రభుత్వతీరుపైనా మండిపడ్డారు టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి.
టీటీడీ చరిత్రలో గతంలో ఎప్పుడూ కూడా 10 రోజులు వైకుంఠ ఏకాదశి దర్శనాలు లేవని…గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని ఇప్పటికైనా సరిదిద్దాలంటూ ఇప్పటికే టీటీడీ ఈవోను కలిసి వినతి పత్రం అందించింది ఏపీ సాధుపరిషత్. ఈ క్రమంలో పదిరోజులు పక్కాగా వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని క్లారిటీ ఇస్తూ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది టీటీడీ. మరి గతంలో జరిగిన తప్పులు జరగకుండా ఏం చేయాలి…? ఎలా ముందుకెళ్లాలన్న దానిపై కమిటీని ఏర్పాటు చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
