AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra-Pradesh: ఏజెన్సీ కష్టాలు తీరేదెన్నడు..! డోలీలో మృతదేహం తరలింపు..

2018-19లో సీకే పాడు నుండి చలి సింగం మీదుగా లోసింగి గ్రామానికి 7 కిలోమీటర్లు రోడ్డు వేసేందుకు మూడు కోట్ల రూపాయలు మంజూరు చేసినా అనుమతులు లేవని ఫారెస్ట్ అధికారులు నిలిపివేశారు.

Andhra-Pradesh: ఏజెన్సీ కష్టాలు తీరేదెన్నడు..! డోలీలో మృతదేహం తరలింపు..
Tribesmen Carry Dead Body
Jyothi Gadda
|

Updated on: Jan 25, 2023 | 8:01 AM

Share

అనకాపల్లి జిల్లాలో అంత్యక్రియలు చేసేందుకు గిరిజనులకు డోలి కట్టక తప్పలేదు. ఆదివాసి గిరిజనుడు కొప్పుల రవీంద్ర మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు డోలి కట్టి మూడు కిలోమీటర్లు మోసుకెళ్లారు చలి సింగం గిరిజనులు. అనారోగ్యంతో బాధపడుతున్న రవీంద్రను రెండు రోజుల క్రితం ఆస్పత్రిలో చేర్పించారు. కానీ, ఆరోగ్యం మరింత క్షీణించి ప్రాణాలు కోల్పోయాడు. కొత్తకోట నుంచి సీకే పాడు వరకు అంబులెన్స్‌లో తీసుకువచ్చారు. అప్పటికే చీకటి పడడంతో మృతదేహాన్ని మోసుకెళ్లడం కష్టంగా భావించి రాత్రంతా అక్కడే ‘శవ జాగారం’ చేశారు. మంగళవారం ఉదయం మృతదేహాన్ని వెదురు గడలకు కట్టి, యువకుల సహాయంతో సుమారు నాలుగు కిలోమీటర్ల మేర రాళ్లు రప్పల్లో అతి కష్టంమీద నడుచుకుంటూ స్వగ్రామంలోని వారి ఇంటికి చేర్చారు గ్రామస్తులు, బంధువులు.

రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ చలి సింగంలో 400 మంది ఆదివాసి గిరిజనులు కొండ శిఖరంలో నివాసం ఉంటున్నారు. సీకే పాడు నుంచి చలిసింగం 3 కిలోమీటర్ల ఎత్తున కొండ శిఖరంలో ఉంది. ఈ గ్రామంలో గర్భిణీ స్త్రీని అయినా, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని తరలించాలంటే డోలీయే మార్గం. 2019లో చోడవరం నియోజకవర్గంలో గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా చలిసింగం గ్రామానికి వచ్చిన ప్రభుత్వ విప్ ధర్మశ్రీ తనను గెలిపిస్తే వెంటనే రోడ్డు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. నాలుగేళ్లు పూర్తైనా గ్రామానికి రోడ్డు పడలేదు.

దేశం 73వ గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్నా.. తమకీ కష్టాలు ఏంటని గిరిజనులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. రాజ్యాంగంలో ఉన్న గిరిజన రక్షణ చట్టాలు, హక్కులు, నాన్ షెడ్యూల్ గిరిజనులకు అందకపోవడంతో స్థానిక పాలకులు వీరిని ఎన్నికలకు ఉపయోగించుకోవడం తప్ప రాజ్యాంగం రక్షణ చర్యలు కూడా అమలుకావడం లేదన్న విమర్శలున్నాయి. 2018-19లో సీకే పాడు నుండి చలి సింగం మీదుగా లోసింగి గ్రామానికి 7 కిలోమీటర్లు రోడ్డు వేసేందుకు మూడు కోట్ల రూపాయలు మంజూరు చేసినా అనుమతులు లేవని ఫారెస్ట్ అధికారులు నిలిపివేశారు. దీంతో ఇప్పటికీ రోడ్డు నిర్మాణ పనులు మొదలవ్వలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..