Tribes Protest: ఆదివాసీ దినోత్సవం రోజే గిరిజనుల అర్థనగ్న ప్రదర్శన.. ఎందుకంటే..?
ప్రపంచమంతా ఆదివాసీ దినోత్సవాలు జరుపుకుంటుంటే.. ఇక్కడ మాత్రం తమకు కనీస సౌకర్యాల కోసం పోరాడుతున్నారు గిరిజనులు.
ప్రపంచమంతా ఆదివాసీ దినోత్సవాలు జరుపుకుంటుంటే.. ఇక్కడ మాత్రం తమకు కనీస సౌకర్యాల కోసం పోరాడుతున్నారు గిరిజనులు. ఉత్సవాలు కాదు కదా.. మా కష్టాలు తీర్చడంటూ మొరపెట్టుకుంటున్నారు గిరిజనం. భారతదేశానికి స్వాతంత్యం వచ్చి 75 ఏళ్లు ఐనా.. తమకు కనీస సౌకర్యాలు కూడా లేవని ఆవేదనతో.. నెత్తిపై అడ్డాకులు పెట్టుకుని విశాఖ జిల్లా రావికమతం మండలం గిరిజనం అర్థనగ్న ప్రదర్శనలు చేశారు. రోడ్లు లేక, వాహనాలు రాక.. తాగునీటి కోసం కిలోమీటర్ల నడుస్తున్నామంటున్నారు. డోలీలోనే అత్యవసర వైద్యం కోసం ప్రయాణించాల్సివస్తుందని ఆవేదన చెందుతున్నారు. చాలా గ్రామాల్లో కరెంటు సౌకర్యం కూడా లేదంటున్నారు. గిరిజన చట్టాలు అమలుకు నోచుకోక, కనీస సదుపాయాలు కల్పించక గిరిపుత్రులపై ఎందుకీ వివక్ష అంటూ దేవున్ని వేడుకుంటున్నారు.
దీనికి తోడు నాన్ షెడ్యూల్ గ్రామాల్లోనూ ఇప్పటికీ జీవనం సాగిస్తున్నారు గిరిజనులు. ఏజెన్సీ 11 మండలాలతో పాటు రావికమతం మండలంలోని జీలుగులోవ, నేరేడుబంద, ఎద్దగరువు, రోలుగుంట మండలం సింగి, పెద్దగరువు, పితృగడ్డ, కొరుప్రోలులోనూ ఎంతోమంది గిరిజనులు బతుకుతున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికీ.. కనీస సౌకర్యాలు లేవు. వీళ్ల భూములకు రక్షణ ఇవ్వలేదు ప్రభుత్వాలు. సేకరించిన అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ఉండటం లేదన్నారు. దీంతో ఆర్థికంగా ఎంతో వెనుకబడిపోతున్నామన్నారు. అందుకే ఆదివాసీ దినోత్సవం రోజే.. హక్కులకోసం పోరాడుతున్నారు. రావికమతం మండలంలో గిరిజనులైతే వినూత్నమైన నిరసన చేపట్టారు. గిరిజన భూములకు రక్షణ కల్పించి..గిరిజనం కష్టాలు తీర్చాలని వేడుకుంటున్నారు. తమకు కనీస సౌకర్యాలు కల్పించినప్పుడే.. ఆదివాసీ దినోత్సవాన్నీ జరుపుకుంటామన్నారు గిరిజనం.
Also Read: ఏపీ టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పిన విద్యాశాఖ మంత్రి.. స్కూల్స్ పున: ప్రారంభంపై కూడా క్లారిటీ