Andhra Pradesh: ఎన్ని ప్రభుత్వాలు మారినా మారని గిరిజనుల తలరాత.. మహిళకు పురిటి నొప్పులు.. డోలీలో తీసుకెళ్తుండగా మధ్యలోనే ప్రసవం
కాంకుటంలో డోలీ ఘటన వెలుగులోకి వచ్చింది. పాతమ్మ అనే గిరిజన మహిళకు పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు.. కాంకుటం నుండి బురదలో కిలోమీటర్ల కొద్దీ డోలిలో మోయాల్సి వచ్చింది. అయితే.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మధ్యలోనే ప్రసవం కావడం గిరిపుత్రుల దీనస్థితికి అద్దం పడుతోంది.
స్వాతంత్య్రం వచ్చిన ఎన్ని ఏళ్ళు అయినా.. ఎన్ని ప్రభుత్వాలు మారినా కష్టాలు మాత్రం తీరడం లేదు.. అంబరాన్ని తాకినా అనేక గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక అవస్థలు తప్పడం లేదు. కనీస అవసరాలైన విద్య, వైద్య సదుపాయాలు ఇప్పటికీ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయి. మారు మూల పల్లెల్లోని ప్రజలు.. ముఖ్యంగా అడవుల్లోని నివసించే గిరిజనలకు రవాణా సదుపాయాలు కూడా కరవు. ఎప్పుడైనా ఆరోగ్యం బాగోలేకపోతే డోలీ మోతలే శరణ్యం అంటున్నారు అడవి బిడ్డలు. తాజాగా.. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం కాంకుటంలో డోలీ ఘటన వెలుగులోకి వచ్చింది. పాతమ్మ అనే గిరిజన మహిళకు పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు.. కాంకుటం నుండి బురదలో కిలోమీటర్ల కొద్దీ డోలిలో మోయాల్సి వచ్చింది. అయితే.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మధ్యలోనే ప్రసవం కావడం గిరిపుత్రుల దీనస్థితికి అద్దం పడుతోంది.
డోలీ మోతలోనే పండంటి పాపకు జన్మనిచ్చింది పాతమ్మ. అనంతరం.. సమీపంలోని కింతలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాంకుటం గ్రామానికి రహదారి సదుపాయం లేకపోవడంతో ఎవరికి ఏ కష్టం వచ్చినా.. ఏ జబ్బు చేసినా డోలి మోతలే శరణ్యం అంటున్నారు గ్రామస్తులు. ఎన్నికల సమయంలో మాత్రమే తమకు కనిపించే నేతలు.. ఏరుదాటాక తెప్పదాటాక తగలేసే విధంగా ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని గిరిజన ప్రజలు వేడుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..