Palnadu district: ఆంజనేయ స్వామి జోలికి వెళ్తే.. పుట్టగతులు లేకుండా పోతార్రోయ్…
దేవుడు అన్న భయం లేదు. సొమ్ములు ఉంటాయని ఎవరైనా చెబితే.. ఆంజనేయుడ్ని కూడా లెక్కచేయరు. హనమంతుడికి కోపం వస్తే ఏమైనా ఉంటుందా..? 10 తలల రావణుడి లంకకే నిప్పు పెట్టాడు. ఆయన ముందు వీరెంత.. గాలి అణువంత..!

ఆంజనేయ స్వామి విగ్రహాన్ని టార్గెట్ చేశారు. విగ్రహం వద్దే గుప్త నిధులు ఉంటాయన్న మూఢ నమ్మకంతో తవ్వకాలు చేశారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో పులి చింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతం కావటంతో అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేశారు. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం ఎమ్మాజీ గూడెం వద్ద గుప్త నిధుల వేటగాళ్ళు చెలరేగిపోయారు. పల్నాడు జిల్లాలోని కృష్ణానది తీర ప్రాంతంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు సమయంలో అనేక దేవాలయాలు నిర్మించారు. ఈ దేవాలయాల్లో గుప్త నిధులు ఉంటాయని వేటగాళ్ళు భావిస్తారు. ఈ క్రమంలోనే శిధిలావస్థకు చేరిన అనేక ఆలయాల్లో తవ్వకాలు చేశారు.
తాజాగా ఎమ్మాజీ గూడెం సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని టార్గెట్ చేశారు. విగ్రహ కనుచూపు ఎక్కడ పడుతుందో అక్కడ గుప్త నిధులున్నాయన్న మూఢ నమ్మకం ఉంది. దీంతో స్వామి విగ్రహా కనుచూపు పడే ప్రాంతంలో యంత్రాల సాయంతో పెద్ద గుంత తవ్వారు. గుంత తవ్వడానికి ముందు అక్కడ క్షుద్ర పూజలు చేశారు. నిధిని బయటకు తీయడానికి ముందే కొన్ని క్షుద్ర పూజలు చేస్తారు. పసుపు కుంకుమ చల్లి ముగ్గులు వేస్తారు. అనంతరం కోడిని బలిచ్చి రక్తం జల్లుతారు. అనంతరం తవ్వకాలు చేస్తారు.
అదేవిధంగా ఎమ్మాజీ గూడెంలో చేశారు. మూఢనమ్మకాలతో ఇటువంటి పూజలు చేయడం గుడులు, గోపురాలు కూలదోయటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భయాందోళనకు గురవుతున్నారు. ఎమ్మాజీ గూడెం ఘటనపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మూఢనమ్మకాలతో ఇటువంటి క్షుద్ర పూజలు చేయడం, తవ్వకాలు చేయడం నేరమంటున్నారు పోలీసులు. ఇటువంట ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..
