Krishnam Raju Death: కృష్ణం రాజుతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న బీజేపీ నేతలు.. ప్రజల హృదయాలను గెలుచుకున్న నేతగా అభివర్ణించిన సోము వీర్రాజు

కృష్ణం రాజు మృతి పట్ల సినీమా రంగంతో పాటు రాజకీయ రంగ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలతోనూ కృష్ణంరాజుకు అనుబంధం ఉండటంతో పార్టీకతీతంగా నాయకులంతా ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్థకాలం ఆయన బీజేపీలో..

Krishnam Raju Death: కృష్ణం రాజుతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న బీజేపీ నేతలు.. ప్రజల హృదయాలను గెలుచుకున్న నేతగా అభివర్ణించిన సోము వీర్రాజు
Krishnam Raju
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 11, 2022 | 10:25 AM

Krishnam Raju Death: కృష్ణం రాజు మృతి పట్ల సినీమా రంగంతో పాటు రాజకీయ రంగ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలతోనూ కృష్ణంరాజుకు అనుబంధం ఉండటంతో పార్టీకతీతంగా నాయకులంతా ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్థకాలం ఆయన బీజేపీలో పనిచేయడంతో ఆపార్టీ నాయకులు కృష్ణంరాజుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు సోము వీర్రాజు, తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్, మాజీ గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్ రావుతో పాటు పలువురు బీజేపీ నాయకులు కృష్ణం రాజు మృతిపట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని బీజేపీ నాయకులు వేర్వేరుగా విడుదల చేసిన సంతాప ప్రకటనలో పేర్కొన్నారు. ఉభయగోదావరి జిల్లాల నుండి బిజెపి తరఫున కేంద్ర మంత్రిగా సేవలందించిన మాజీ పార్లమెంట్ సభ్యులు కృష్ణంరాజు మరణం విచారకరమని, వారి పవిత్ర ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు పేర్కొన్నారు. బిజెపి అభివృద్ధి లో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారని అన్నారు. కృష్ణం రాజు కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు. కేంద్రమంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేసి ప్రజల హృదయాలను గెలుచుకున్నారని సంతాప ప్రకటనలో పేర్కొన్నారు.

బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి యూవీ కృష్ణం రాజు అకాల మరణం బాధాకరమని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ తన సంతాప ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర సహాయ మంత్రిగా కృష్ణం రాజు సేవలు మరవలేనివన్నారు. జర్నలిస్టుగా, ఫొటో గ్రాఫర్ గా, సినీ నటుడిగా, రాజకీయవేత్తగా సేవలందించిన కృష్ణంరాజు సినిమా రంగంలో ఐదు ఫిలింఫేర్, మూడు నంది అవార్డులు గెలుచుకున్న మహా నటుడని కొనియాడారు. సినీ ప్రేక్షకుల హృదయాల్లో ‘రెబల్ స్టార్’ గా అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం బీజేపీకి, తెలుగు ప్రజలతోపాటు వెండితెరకు తీరని లోటని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా కృష్ణంరాజు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తీవ్రంగా బాధించిందన్నారు. తనకు మంచి మిత్రులని, వారు ఏ పార్టీలో ఉన్న తనతో మితృత్వాన్ని వదులుకోలేదని విద్యాసాగర్ రావు తన సంతాప ప్రకటనలో గుర్తు చేసుకున్నారు. అటల్ బీహారీ వాజ్ పేయి ని ప్రధానమంత్రి చేయాలనే ఉద్దేశంతో బీజేపీలో చేరి లోక్ సభ సభ్యుడిగా పోటీచేసి గెలుపొందారన్నారు. అనేక చిత్రాలలో నటించి తెలుగు ప్రజలను సినిమా ద్వారా చైతన్య పరిచిన వ్యక్తని విద్యాసాగర్ రావు ప్రశంసించారు. వారి మరణం బిజెపి పార్టీ కి, తెలుగు ప్రజలకు, సినిమా కళాకారులకు తీరని లోటన్నారు. కృష్ణంరాజు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు సంతాప ప్రకటనలో తెలిపారు.

బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణ రాజె కూడా కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మృతిపట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు.రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం బాధాకరమని పేర్కొన్నారు. 187కుపైగాచిత్రాల్లో నటించారని, అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా పనిచేసినతీరు ఆదర్శనీయమన్నారు. వారి ఆత్మకు శాంతిని చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈసందర్భంగా కృష్ణంరాజుతో తన అనుబంధాన్ని సూర్యనారాయణ రాజు గుర్తుచేసుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..