Tirumala Tirupati: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై మీరు ఉన్న దగ్గరకే జల ప్రసాదం!
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం తరచూ అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది. ఇందులో భాగంగానే టీటీడీ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. మానవ సేవయే మాధవ సేవగా సాగుతున్న టీటీడీ సేవలను విస్తరిస్తూ, వైకుంఠ ద్వార దర్శనాలకు వచ్చే భక్తుల తాగునీటి కష్టాలను తీర్చేందుకు టీటీడీ మొబైల్ జల ప్రసాదం విధానాన్ని ప్రారంభించింది

టీటీడీ పాతికేళ్లుగా శ్రీవారి సేవకులతో వెంకన్న భక్తులకు సేవలు అందిస్తుంది. 25 ఏళ్లలో 17 లక్షల మందికి పైగా సేవకులతో శ్రీవారి సేవ కొనసాగిస్తోంది టీటీడీ. భక్తుల సేవే పరమావాదిగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు సేవలు అందించేలా ప్రణాళిక అమలు చేసస్తోంది. ఆసక్తి చూపే భక్తులకు శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం కల్పిస్తుంది. ఈ సేవల్లో సమాన్యుడి నుంచి సంపన్నుడి దాకి ప్రతి ఒక్కరూ పాల్గొంటున్నారు. మానవ సేవే మాధవ సేవలా భక్తులకు సేవ చేయడమే పరమావధిగా 2000 సంవత్సరం నవంబర్‌లో టీటీడీ ఈ శ్రీవారి సేవను ప్రారంభించింది.
అయితే తాజాగా ఈ సేవలను మరింత విస్తరించేందుకు టీటీడీ మరో నిర్ణయం తీసుకుంది. తిరుమలలో మొబైల్ జల ప్రసాదం విధానాన్ని ప్రయోగత్మకంగా అమలు చేస్తోంది. వైకుంఠ ద్వార దర్శనాల కోసం తిరుమలకు వస్తున్న భక్తుల వద్దకే తాగునీటిని తీసుకెళ్లేలా టీటీడీ మొబైల్ జల ప్రసాదం విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లలో అక్కడక్కడ కులాయిలు, డ్రమ్ముల ద్వారా తాగునీటిని అందిస్తున్న టీటీడీ.. వెలుపల క్యూ లైన్ లతోపాటు రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో భక్తులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఈ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఇందులో భాగంగానే.. శ్రీవారి సేవలో ఉన్న వారికి 10 లీటర్ల సామర్థ్యంతో ఉండే వాటర్ క్యాన్ ఇచ్చి.. రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో భక్తులకు తాగునీటిని అందించే విధంగా చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం తిరుమలలో 15 క్యాన్లతో శ్రీవారి సేవకుల ద్వారా తాగునీటిని అందిస్తున్న టీటీడీ.. భక్తుల నుంచి వచ్చే స్పందనను బట్టి దీన్ని మరింత విస్తరించాలని నిర్ణయించింది.

Ttd Srivari Seva (1)
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
