AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ బోర్డు డౌటేనా..? చైర్మన్ పదవిపై ఇంకా వీడని సస్పెన్షన్..

ఏపీలోని నామినేటెడ్ పదవులన్నింటిలో కంటే ఆ పదవికే హై ప్రియారిటీ. రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనూ లాబీయింగ్ చేసే శక్తి ఉన్నది కూడా ఆ పోస్టుకే. అందుకే ఆ పదవి కోసం ఉంటుంది అంతే పోటీ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు గడిచినా ఆ పదవి ఎవరికన్న దానిపై నో క్లారిటీ. సీనియర్ పొలిటిషియన్స్, బడా పారిశ్రామిక వేత్తలు అన్ని రంగాల ప్రముఖులు ప్రయత్నిస్తున్న ఆ పదవి ఎవరికన్నదే ఇప్పటి దాకా సస్పెన్స్.

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ బోర్డు డౌటేనా..? చైర్మన్ పదవిపై ఇంకా వీడని సస్పెన్షన్..
Ttd Additional Eo
Raju M P R
| Edited By: Jyothi Gadda|

Updated on: Sep 11, 2024 | 3:09 PM

Share

ఏపీలో నామినేటెడ్ ల పదవుల కోసం వెయిటింగ్ కోనసాగుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు గడిచినా పదవుల పందేరం ముందుకు సాగని పరిస్థితి ఉంది. ఇప్పుడు వరదల వ్యవహారం మరో అడ్డంకిగా మారింది. ఇలా ఏదో ఒక అంశం పదవుల కోసం ప్రయత్నిస్తున్న ఆశా వాహుల ఆశలపై నీళ్లు చల్లుతున్న పరిస్థితి నెలకొంది. ఇలా నామినేటెడ్ పదవులకు బ్రేకులు పడుతుండగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు రానే వచ్చాయి. అయితే టీటీడీ ధర్మకర్తల మండలి నియామకంపై మాత్రం ప్రభుత్వం స్పష్టత ఇవ్వని పరిస్థితి ఉంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు పాతిక రోజులు సమయం కూడా లేని కీలక సమయంలో బ్రహ్మోత్సవాల నిర్వహణ బాధ్యతంతా అధికారుల పైనే పడింది. దీంతో ప్రభుత్వం టిటిడి పాలక మండలిని నియమిస్తుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. 25 మంది సభ్యులుండే ధర్మకర్తల మండలికి ఎవరు చైర్మన్ అన్నదానిపై క్లారిటీ రాని పరిస్థితి ఉంది.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడీ చైర్మన్ పదవికి పలువురు పేర్లు ప్రముఖంగా వినిపించినా నియామకం మాత్రం జరగలేదు. టిటిడి బోర్డు సభ్యుల కంటే చైర్మన్ పదవి ఎవరికన్నా దానిపైనే కసరత్తు కు ఫుల్ స్టాప్ పడకపోతోంది. దీంతో టీటీడీ బోర్డు చైర్మన్ కే పోటీ కొనసాగుతోంది. చైర్మన్ పదవికి అందరికన్నా ముందుగా మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ఆ పదవిని చేపట్టేందుకు అశోక్ ఆసక్తి చూపడం లేదన్న ప్రచారంతో మరికొన్ని పేర్లు తెరమీదికి వచ్చాయి. ఒక మీడియా హౌస్ చైర్మన్, మరో పారిశ్రామికవేత్త, ఇంకో సినీ నిర్మాత, మరొక సినీ దర్శకుడు ఇలా నలుగురైదుగురు పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఇలా చైర్మన్ కుర్చీ కోసం కుస్తీ కొనసాగుతుండగా ఎవరికి ఆ ఛాన్స్ దక్కుతుందో అన్న ఉత్కంఠ మాత్రం ఆసక్తి రేపుతుంది.

మరోవైపు టీటీడీ బోర్డులో సభ్యులుగా ఉండే టిటిడి ఈఓ, దేవాదాయ శాఖ కమిషనర్, రెవెన్యూ ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ లాంటి ఐఏఎస్ అధికారులను మినహాయించగా సభ్యులుగా ఛాన్స్ ఎవరికన్న దానికి పోటీ పెద్దగానే ఉంది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల నుంచి సభ్యత్వం ఆశిస్తున్న వారితోపాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నుంచి సభ్యులుగా బోర్డులో ఛాన్స్ కొట్టేందుకు ఎవరి ప్రయత్నం వారే చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రి పదవి దక్కని వారు, ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన వారు, పార్టీ గెలుపులో కీలకంగా వ్యవహరించిన వారు టీటీడీ బోర్డులో సభ్యుడిగా కొనసాగాలని ఆశపడుతున్నారు. ఇలాంటి వారి లిస్టు చాంతాడంత ఉండగా మరోవైపు కూటమిలోని మూడు పార్టీల నుంచి ఆశావాహుల లాబింగ్ టిటిడి బోర్డు పై ప్రభావం చూపుతోంది. కేంద్రం నుంచి కొందరు, ఇతర రాష్ట్రాల నుంచి మరికొందరు, రాజకీయ పార్టీల అధినేతల నుంచి ఇంకొందరు ఎవరి పలుకుబడిని వారు ప్రదర్శిస్తుండటం టిటిడి బోర్డు నియామకంపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ నేపథ్యం లోనే బోర్డు నియామకం కూటమి ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారింది.

ఇవి కూడా చదవండి

టీటీడీ చైర్మన్ బాధ్యతలు పొలిటికల్ గా ఉన్న వారికి ఇవ్వాలా, లేక పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సహకరించిన వారికి కట్ట బెట్టాలా, లేదంటే రాజకీయాలకు సంబంధం లేని వివాదరహితుడ్ని ఎంపిక చేయాలా అన్నదానిపై క్లారిటీ రాకపోతోంది. తిరుమలలో పారదర్శక పాలన కొనసాగేలా ప్రక్షాళన చేపట్టామంటున్న ప్రభుత్వం రాజకీయ వాసన లేని వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వబోతుందా అన్న చర్చ కూడా నడుస్తోంది. మరోవైపు టీటీడీ బోర్డులో సభ్యత్వం కోసం ఆశపడే వారు కూడా అలాంటి వారే ఉండాలన్న నిర్ణయం ప్రభుత్వానిదైతే బోర్డు నియామకంపై పెద్ద కసరత్తే చేయాల్సి వస్తుందన్న వాదన వినిపిస్తోంది. ఇదే జరిగితే తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల లోపు బోర్డు నియామకం సాధ్యమయ్యే పనేనా అన్న సందేహం కూడా ఉంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అక్టోబర్ 3 న అంకురార్పణ జరగనుండగా 4 నుంచి 12 వరకు బ్రహ్మోత్సవాలు జరగాల్సి ఉంది.

అయితే టీటీడీ ధర్మకర్తల మండలి నియామకం పై స్పష్టత రాని పరిస్థితి ఉంది. వార్షిక బ్రహ్మోత్సవాలకు పట్టుమని పాతిక రోజుల సమయం లేకపోగా కీలక సమయంలో బ్రహ్మోత్సవాల నిర్వహణ బాధ్యత అంతా అధికారుల పైనే పడింది. టిటిడి బోర్డు లోని సభ్యుల పేర్లు ఇప్పటికే ఖరారు చేసిన కూటమి ప్రభుత్వం చైర్మన్ విషయంలోనే ఇంకా కసరత్తు చేస్తుండటం వల్లనే బోర్డుపై సస్పెన్స్ కొనసాగుతుందన్న ప్రచారం ఉంది. మరి చైర్మన్ విషయంపై కూటమి సర్కార్ క్లారిటీ ఇస్తే తప్ప బోర్డు నియామకం జరిగే అవకాశం లేకపోవడంతో మరి బ్రహ్మోత్సవాల కీలక సమయంలో పాలకమండలి ఉంటుందా ఉండదా అన్నది మాత్రం సస్పెన్స్ గానే మిగిలింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..