Tirumala Rains: ఒక్కసారిగా మారిన ఏపీ వాతావరణం.. తిరుమల ఆలయం చుట్టూ రోడ్లన్నీ జలమయం.. మరోవైపు భక్తుల రద్దీ..

Tirumala Rains: భగభగ మండే ఎండలు.. కాలు బయటపెట్టాలంటే హడల్‌. ఇదీ వారం, పది రోజులుగా ఏపీలో సిట్యువేషన్. అయితే అనూహ్యంగా వాతావరణం మారిపోయింది. చిత్తూరు చల్లబడింది. తిరుమల కొండపై భారీ వర్షం పడింది. కాసేపు సేదతీరిన భక్తులు.. తర్వాత ఇబ్బంది పడ్డారు...

Tirumala Rains: ఒక్కసారిగా మారిన ఏపీ వాతావరణం.. తిరుమల ఆలయం చుట్టూ రోడ్లన్నీ జలమయం.. మరోవైపు భక్తుల రద్దీ..
Tirupati Rains
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 19, 2023 | 5:45 AM

Tirumala Rains: భగభగ మండే ఎండలు.. కాలు బయటపెట్టాలంటే హడల్‌. ఇదీ వారం, పది రోజులుగా ఏపీలో సిట్యువేషన్. అయితే అనూహ్యంగా వాతావరణం మారిపోయింది. చిత్తూరు చల్లబడింది. తిరుమల కొండపై భారీ వర్షం పడింది. కాసేపు సేదతీరిన భక్తులు.. తర్వాత ఇబ్బంది పడ్డారు. తిరుమలలో ఒక వైపు భారీ వర్షం కురుస్తుంటే.. మరో వైపు తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగింది. తిరుమలలోని కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో మాఢ వీధులు భక్తులతో కిటకిటలాడాయి. వేసవి సెలవుల కారణంగా కూడా భక్తుల రద్దీ పెరిగింది.  వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. శిలాతోరణం వరకు దాదాపు మూడు కిలో మీటర్ల మేర భక్తులతో క్యూ లైన్లు కొనసాగాయి. పెగిరిన రద్దీతో టీటీడీ అధికారులు అప్రమత్తం అయ్యారు. దర్శనం కోసం దాదాపు 36 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. పరిస్థితికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని టీటీడీ చెబుతున్నారు.

మరోవైపు ఎండలు ఠారెత్తుతున్న సమయంలో తిరుమలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అప్పటి వరకు ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అయిన భక్తులు సేదతీరారు. ఉన్నట్లు ఉండి పడిన భారీ వర్షంతో తిరుమల వీధుల్లో నీళ్లు పారాయి. భారీ వర్షంతో ఆలయం చుట్టు పక్కల రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఒక్కసారిగా వర్షం కురవటంతో క్యూలైన్ లో ఉన్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో తిరుమలలోని శ్రీ వారి సన్నిధికి సమీపంలోని రోడ్లపై భారీ నీళ్లు వచ్చి చేరాయి. మూడు కిలోమీటర్ల మేర భక్తుల క్యూ ఉండగా పెద్ద యెత్తున వాన పడింది. పరుగులు తీసేందుకు కూడా అవకాశం లేకపోవడంతో భక్తులు తడిచి ముద్దయ్యారు.

క్యూ లైన్‌లోకి నీరు చేరడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. చిన్నపిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు వర్షం కారణంగా అవస్థలు పడ్డారు. తిరుపతి, చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. చిత్తూరు జిల్లాలోని కుప్పంలోనూ భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్ష బీభత్సం సృష్టించింది. మిగతా జిల్లాలోనూ అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడ్డాయి. ఇదిలావుంటే.. రాబోయే రెండు రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, కురుస్తాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..