Andhra Pradesh: తిరుపతి జిల్లాలో మరో అమానవీయ ఘటన.. బైక్‌పైనే కుమారుడి మృతదేహం తరలింపు
ఏడేళ్ల కొడుకు చేతిలోనే ప్రాణాలు విడవడంతో ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. కాని ఎవరూ శవాన్ని తీసుకెళ్లేందుకు ముందుకు రాలేదు.
కొడుకు చనిపోయాడని ఏడవాలో, మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు మార్గం లేక తల్లడిల్లాలో తెలియక ఒక తండ్రి కుమిలిపోయిన పరిస్థితి. తిరుపతి జిల్లాలో చోటుచేసుకున్న అమానవీయ ఘటన సభ్య సమాజాన్ని మళ్లి తలదించుకునేలా చేసింది. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం దిగువ పుత్తూరు గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలుడు బసవయ్యను ఈ ఉదయం ఒక పాము కరిచింది. గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే కేవీబీపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. అయితే దురదృష్టవశాత్తూ ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే ఆ బాలుడు కన్నుమూశాడు. ఏడేళ్ల కొడుకు చేతిలోనే ప్రాణాలు విడవడంతో ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. కాని ఎవరూ శవాన్ని తీసుకెళ్లేందుకు ముందుకు రాలేదు. ఆటోలు, ఇతర వాహనాలను బతిమాలినా అదే పరిస్థితి. ఇక చేసేది లేక తెలిసిన వారి టూ వీలర్‌పైనే కొడుకు శవాన్ని భుజాన వేసుకొని వెళ్లాడు.
గతంలోనూ..
కాగా పిల్లాడి మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై తీసుకువెళ్లడాన్ని చూసి స్థానికులు చలించిపోయారు. ప్రభుత్వాసుపత్రుల దగ్గర ప్రైవేటు అంబులెన్సుల దందా రోజురోజుకు మితిమీరిపోతుందని.. వారిని కట్టడి చేయడంలో అధికార యంత్రాంగం తీవ్రంగా విఫలమవుతోందని పలువురు మండిపడుతున్నారు. గతంలో తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ప్రైవేట్ అంబులెన్స్ డాక్టర్ల నిర్వాకంపై సుమారు 90 కిలోమీటర్ల పాటు కుమారుడి శవాన్ని భుజాలపై మోసుకెళ్లాడు తండ్రి. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..