Tirumala: ఒక్కో టికెట్ రూ.10 వేలు.. శ్రీవారి బ్రేక్ దర్శన టికెట్ల వివాదంలో ఎమ్మెల్సీ జకియా.. ముగ్గురిపై కేసు
తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ల దుర్వినియోగం తీవ్ర వివాదాస్పదమైంది. బ్లాక్‌లో వీఐపీ దర్శన టికెట్లు అమ్ముకున్నారని వైసిపి ఎమ్మెల్సీ జకియా ఖానంపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎమ్మెల్సీ సిఫార్సు లేఖపై 6 టికెట్లు భక్తులు పొందినట్లు తెలిపారు. ఒక్కో టికెట్‌కు 10వేల రూపాయలు భక్తుల నుంచి తీసుకున్నట్లు వెల్లడించారు.
తిరుమలలో మరోసారి వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ల విక్రయం కలకలం సృష్టించింది. వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్ సిఫారసు లేఖపై ఆరు వీఐపీ టికెట్లను పొందారు భక్తులు. ఒక్కో టికెట్‌కు 10వేలు వసూలు చేశారంటూ బెంగళూరుకు చెందిన భక్తుడు సాయికుమార్ టీటీడీకి ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేపట్టిన టీటీడీ విజిలెన్స్ టికెట్లను అమ్మినట్టు నిర్ధారించింది. దీంతో వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ల విక్రయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు టీటీడీ విజిలెన్స్ అధికారులు. దీంతో ఎమ్మెల్సీ జకియాపై కేసు నమోదు చేశారు పోలీసులు. A-1గా చంద్రశేఖర్, A-2గా ఎమ్మెల్సీ జకియా ఖానం, A -3గా ఎమ్మెల్సీ పీఆర్వో కృష్ణతేజ పేర్లను చేర్చారు.
స్పందించిన ఎమ్మెల్సీ జకియా ఖానం
తనపై వచ్చిన ఆరోపణలపై ఎమ్మెల్సీ జకియా ఖానం స్పందించారు. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను టీడీపీలో చేరుతున్నానని తెలిసి వైసీపీ నేతలు తనపై కుట్రలు పన్నారని ఆరోపించారు. చంద్రశేఖర్ ఎవరో తనకు తెలియదన్నారు.
బొత్స సత్యనారాయణ ఏమన్నారంటే..
జకియా ఆరోపణలను మాజీమంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. టికెట్ల విక్రయంతో కానీ.. జకియాతో కానీ వైసీపీకి సంబంధంలేదన్నారు. ఆమె తమపార్టీకాదని క్లారిటీ ఇచ్చారు. టికెట్ల విక్రయం వివాదాన్ని వైసీపీకి అంటగట్టొద్దన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జకియా ఖానమ్ టీడీపీలోకి వెళ్లిపోయారన్నారు. తిరుమల టికెట్ల వివాదాన్ని వైసీపీకి అంటగట్టేందుకు.. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వీడియో చూడండి..
వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ల విక్రయంపై బెంగళూరుకు చెందిన భక్తుడి దగ్గరి నుంచి ఆధారాలను సేకరించారు పోలీసులు. త్వరలో దర్యాప్తును ముమ్మరం చేయనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..