Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ ప్రారంభం.. కీలక వివరాల సేకరణ..

తిరుపతిలో తొక్కిసలాట ప్రాంతాలను విచారణ కమిషన్ సభ్యులు పరిశీలించారు. బైరాగిపట్టెడ, పద్మావతి పార్క్ రామానాయుడు పబ్లిక్‌ స్కూల్‌ ప్రాంతాలను సందర్శించారు. విచారణ సందర్భంగా కమిషన్ సభ్యులు టీటీడీ అధికారులు, పోలీసులను ప్రశ్నించారు.. దీంతోపాటు.. పలు వివరాలను సేకరించారు కమిషన్ సభ్యులు.. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ ప్రారంభం.. కీలక వివరాల సేకరణ..
Tirupati Darshan Stampede
Follow us
Raju M P R

| Edited By: Shaik Madar Saheb

Updated on: Feb 02, 2025 | 2:36 PM

తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన ఘటనపై ఇవాళ్టి నుంచి జ్యుడీషియ‌ల్ ఎంక్వైరీ ప్రారంభమైంది.. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తి నేతృత్వంలోని కమిషన్ తొక్కిసలాట ఘటనపై పూర్తిస్థాయి విచార‌ణ జరుపుతున్నారు. ఈ ఘటన అనంతరం ప్రభుత్వం కమిషన్ ను ఏర్పాటు చేసి.. ఆరునెలల్లోగా నివేదిక సమర్పించాలని సూచించిన విషయం తెలిసిందే.. టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టోకెన్ల జారీ క్యూలైన్‌లో ఆరుగురు మరణించారు. జనవరి నెల 8వ తేదీన జరిగిన ఈ తొక్కిసలాట ఘటనను తీవ్రంగా పరిగణించిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హుటాహుటిన తిరుపతి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఇద్దరు అధికారుల సస్పెన్షన్‌, ముగ్గురు అధికారుల బదిలీలు చేశారు. బాధిత కుటుంబాలకు టీటీడీ తరఫున నష్టపరిహారం సైతం చెల్లించారు. ఈ ఘటనపై మాజీ న్యాయమూర్తితో విచారణకు ఆదేశించారు. తిరుపతిలోని పద్మావతి పార్క్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో వైకుంఠ ఏకాదశి దర్శనానికి టోకెన్ల కోసం ఎదురుచూస్తున్న ఆరుగురు భక్తులు మరణించడానికి దారి తీసిన పరిస్థితులేమిటో కమిషన్‌ విచారణ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మరోవైపు విచారణ కోసం కలెక్టరేట్‌లో ప్రత్యేక ఛాంబర్ కేటాయించారు. తొక్కిసలాట ప్రాంతాలను కమిషన్ సభ్యులు పరిశీలించారు. బైరాగిపట్టెడ, పద్మావతి పార్క్ రామానాయుడు పబ్లిక్‌ స్కూల్‌ ప్రాంతాలను సందర్శించారు. విచారణ సందర్భంగా కమిషన్ సభ్యులు టీటీడీ అధికారులు, పోలీసులను ప్రశ్నించారు..

కమిషన్ విచారణకు టీటీడీ ఈఓతోపాటు వైద్యులు, పోలీసు అధికారులు కమిషన్ ముందు హాజరయ్యారు. తిరుపతి కలెక్టరేట్‌ లో ప్రత్యేక ఛాంబర్ కు చేరుకున్న ఈఓ శ్యామల రావు కమిషన్ పలు వివరాలు అందించారు. ఘటనపై విచారణ జరుపుతున్న హైకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్ సత్యనారాయణమూర్తి ముందు రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు, ఫోరెన్సిక్ హెడ్ డాక్టర్ శశికాంత్, ఘటన జరిగిన రోజు ఎమర్జెన్సీ విభాగంలో ఉన్న క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ ను కూడా కమిషన్ విచారించింది.

టోకెన్ల పంపిణీకి సరైన ఏర్పాట్లు చేశారో లేదో గుర్తించడంతో పాటు ఏకాదశి ఏర్పాట్లలో ఏవైనా లోటుపాట్లు ఉన్నాయా..? ఎలాంటి లోపాలున్నాయి..? అందుకు కారణమైన వ్యక్తులను గుర్తించాలని.. భవిష్యత్‌లో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి… తిరుమల సందర్శించే భక్తులకు ఎలాంటి భద్రత కల్పించాలన్న దానిపై న్యాయ విచారణ కమిషన్ విచారించి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. అలాగే సంస్థాగతంగా ఎలాంటి మార్పులు చేయాలన్న అంశంతో పాటు టీటీడీ ఉద్యోగులను ఏ విధంగా ఇలాంటి కార్యక్రమాలకు సన్నద్ధం చేయాలన్న దానిపైనా కమిషన్‌ సిఫారసులు చేయనుంది. న్యాయ విచారణ కమిషన్‌కు సివిల్‌ కోర్టుకు ఉండే అధికారాలను ప్రభుత్వం కట్టబెట్టింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..