Huge Robbery: వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి.. కానీ, డోర్ ఓపెన్ చేస్తే మైండ్ బ్లాంక్..
Andhra Pradesh: తెనాలి నాజరుపేటలోని ఒక ఇంటికి వేసిన తాళాలు వేసినట్టే వున్నా, ఆ ఇంట్లో భారీ చోరీ చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన..

తెనాలి నాజరుపేటలోని ఒక ఇంటికి వేసిన తాళాలు వేసినట్టే వున్నా, ఆ ఇంట్లో భారీ చోరీ చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు రెండు బీరువాలు పగలకొట్టి రూ. 10 లక్షల విలువచేసే బంగారు నగలు, పదివేల రూపాయలు నగదు దొంగలించారు. వివరాల్లోకి వెళితే తెనాలి నాజర్ పేట లోని చెరువు వారి వీధిలో నివాసముంటున్న రత్నకుమారి ఈ నెల 2వ తేదీన నరసరావు పేటలోని వారి బంధువుల ఇంటికి ఒక ఫంక్షన్ విషయమై వెళ్లి మంగళవారం తిరిగి వచ్చింది. అయితే ఇంటికి వెసిన తాళాలను తెరిచి చూడగా ఇంట్లో సామాను అన్నీ చిందర వందరగా పడేసి ఉన్నాయి. రెండు బెడ్ రూమ్ ల తలుపులు తెరిచి ఉండడమే కాక రెండు బీరువాలు కూడా పగల కొట్టి వున్నాయి.
దొంగలు ముందుగా తెచ్చుకున్న ఒక ఇనుప రాడ్డుని ఉపయోగించి ఇంటికి వెనుక భాగంలో ఉన్న కిటికీ స్క్రూలు ఓపెన్ చేసి, ఇనుప గ్రిల్ ని కింద పెట్టి, లోనికి ప్రవేశించి ఈ భారీ చోరీకి పాల్పడినట్టు కనిపిస్తుంది. వారితో తెచ్చుకున్న ఇనుపురాడ్డు కూడా అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఈ చోరీలో రెండు బంగారపు గొలుసులు, మూడు బంగారపు గాజులు, రెండు ఉంగరాలు, పదివేల రూపాయల నగదు చోరీకి గురయ్యాయి. ఇంట్లో ఎవరూ లేరన్న విషయం తెలుసుకుని రెక్కీ నిర్వహించి మరి ఈ చోరీకి పాల్పడినట్టు తెలుస్తుంది. ఈ ఇంటికి వెనకవైపు ఖాళీ స్థలం, ఇంటికి పక్కన ఎవరూ ఉండటం లేదు. ఈ విషయాన్ని ముందుగా తెలుసుకున్న దొంగలు పక్కా ప్లాన్ తో ఈ దొంగతనం చేసినట్టు కనిపిస్తుంది. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
