Amaravati: రాజధాని కోసం 1200 రోజులు.. బీజేపీ నేత సత్యకుమార్ కారుపై దాడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కోసం రైతులు చేపట్టిన ఉద్యమం నేటితో 1200 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అమరావతి రైతులు, మహిళలకు వివిధ రాజకీయ పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారు. ప్రస్తుతం రాజధాని రైతుల ఆందోళన కొనసాగుతోంది...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కోసం రైతులు చేపట్టిన ఉద్యమం నేటితో 1200 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అమరావతి రైతులు, మహిళలకు వివిధ రాజకీయ పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారు. ప్రస్తుతం రాజధాని రైతుల ఆందోళన కొనసాగుతోంది. అయితే అమరావతి రాజధాని ప్రాంతంలో బీజేపీ నేత సత్య కుమార్ కారుపై దాడి జరిగింది. అమరావతి ఉద్యమం 1200 రోజుల కార్యక్రమానికి హాజరై వెళ్తున్న సత్య కుమార్ కారుపై మూడు రాజధానుల అనుకూల శిబిరానికి చెందిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దాడిలో సత్యకుమార్ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఆందోళన కారులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి సత్యకుమార్‌ను అక్కడి నుంచి తరలించారు. ఒక్కసారిగా సత్యకుమార్ కారుపై దాడి చేయడంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని చెదరగొట్టారు.
అయితే ఉద్దండరాయునిపాలెం వద్దకు సత్యకుమార్ కారు వచ్చిన సమయంలో కొందరు మూడు రాజధానులకు అనుకూలంగా నినాదాలు చేశారు. మూడు రాజధానులకు మద్దతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సత్యకుమార్ కారుపై దాడి జరుగడంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దీక్ష శిబిరం నుంచి సత్యకుమార్ తుళ్లూరులో బీజేపీ కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో ఉద్దండరాయునిపాలెం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగుల దాడి నుంచి తప్పించుకునేందుకు సత్యకుమార్ అనుచరులు ప్రయత్నించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి