స్కూటీపై మైక్ చేత పట్టి ప్రభుత్వ ఉపాధ్యాయుడి వినూత్న ప్రచారం..! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఒక ఉపాధ్యాయుడు తన స్కూటర్‌లో మైక్‌తో ప్రచారం చేస్తున్నాడు. గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల ప్రయోజనాలు, ప్రభుత్వ పథకాల గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాడు. ఈ వినూత్న ప్రయత్నం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడానికి దోహదపడుతోంది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేస్తున్నాడు.

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి గత, ప్రస్తుత ప్రభుత్వాలు అనేక సంస్కరణలు అమలు చేస్తున్నాయి. దీంతో గత కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. అయితే ఇంకా కొన్ని చోట్లా ప్రైవేటు పాఠశాలల ధాటికి ప్రభుత్వ బడులు తట్టుకోలేకపోతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల వైపు విద్యార్ధులను ఆకర్షించేందుకు ఒక ఉపాధ్యాయుడు వినూత్న ప్రచారం చేపట్టాడు. తెనాలి రూరల్ మండలం సంగంజాగర్లమూడికి బట్టు వెంకయ్య బాటప్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెం స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాడు. సోషల్ స్టడీస్ బోధించే ఈ ఉపాధ్యాయుడు ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి తన వంతు సాయం చేయాలనుకున్నాడు.
అప్పటి నుండి తన స్కూటర్ కు మైక్ ఏర్పాటు చేసుకొని గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల గురించి ప్రచారం చేస్తున్నాడు. గుంటూరు, బాపట్ల జిల్లాలోని పల్లెటూర్లలో ప్రతి రోజు తన చేతనైంత మేర ఈ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడు. తన ప్రచారంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలైన తల్లికి వందనం, విద్యార్ధులకు అందిస్తున్న పుస్తకాలు, కిట్స్, యూనిఫామ్స్ గురించి వివరిస్తున్నాడు. అనుభవజ్నులైన ఉపాధ్యాయులు, వివిధ రకాల సౌకర్యాలు, గ్రామాల్లో సైతం ఉన్న భవనాలను గురించి కూడా తన ప్రచారంలో చెబుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల్లో ఉన్న అపోహను తొలగించి వాటి పట్ల ఆదరణ పెంచేలా ఆయన ప్రచారం కొనసాగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ వాటి పట్ల తనకున్న బాధ్యతను మరింతగా ప్రజలకు వివరిస్తున్న ఉపాధ్యాయుడు పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలోని టీచర్లు కూడా విద్యార్ధులు, వారి తల్లిడండ్రుల్లో అవగాహన కల్పిస్తే గవర్నమెంట్ బడులు మరింతగా సత్ఫలితాలు సాధిస్తాయంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.