Kalyandurg Politics: ఒకరు అవునంటే మరొకరు కాదని.. ఆధిపత్య పోరులో నలిగిపోతున్న కేడర్
ఒకే నియోజకవర్గం.. ఒకే పార్టీ.. కానీ ఆ ఇద్దరికి.. ఒకరంటే మరొకరికి పడదు. ఆధిపత్య పోరులో తగ్గేదే లే అంటూ మీసం మెలేసే టైపు. నువ్వా నేనా తేల్చుకుందాం రా అని అనుకునే వాళ్లిద్దరూ.. ఆల్ ఆఫ్ సడెన్‌గా ఒకే వేదికపై తళుక్కుమన్నారు. మేమూ మేమూ ఒకటే.. మధ్యలో ఎవరైనా వస్తే.. అంతే సంగతులని వార్నింగ్‌లు ఇస్తున్నారు.

ఒకే నియోజకవర్గం.. ఒకే పార్టీ.. కానీ ఆ ఇద్దరికి.. ఒకరంటే మరొకరికి పడదు. ఆధిపత్య పోరులో తగ్గేదే లే అంటూ మీసం మెలేసే టైపు. నువ్వా నేనా తేల్చుకుందాం రా అని అనుకునే వాళ్లిద్దరూ.. ఆల్ ఆఫ్ సడెన్‌గా ఒకే వేదికపై తళుక్కుమన్నారు. మేమూ మేమూ ఒకటే.. మధ్యలో ఎవరైనా వస్తే.. అంతే సంగతులని వార్నింగ్‌లు ఇస్తున్నారు.
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు.. మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి.. వీళ్లిద్దరూ ఇద్దరే. ఒకరు అవునంటే ఇంకొకరు వద్దని వారించే టైపు. ఒకే గొడుగు కింద ఉప్పు నిప్పులా ఉంటున్నారు. టీడీపీ అధిష్ఠానం ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా విడివిడిగానే చేస్తూ వస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీకి రెండు ఆఫీస్‌లు ఉన్నాయంటే నేతల మధ్య ఏ స్థాయిలో ఆధిపత్యపోరు నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితిని గమనించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చాలాసార్లు సర్ది చెప్పారు. పార్టీ కోసం కలిసి పనిచేయాలని సూచించారు. అప్పటికప్పుడు సరేనన్నా.. ఆ తర్వాత షరా మామూలుగానే వ్యవహరించారు.
ఉమామహేశ్వర నాయుడు – హనుమంతరాయ చౌదరి.. ఎవ్వరికి ఎవరూ తగ్గడం లేదు. ఇక లాభం లేదని గ్రహించిన చంద్రబాబు సీన్‌లోకి మరో వ్యక్తిని తీసుకొస్తున్నట్టు సంకేతాలిచ్చారు. అయినా వీరిలో మార్పు రాలేదు. ఈ క్రమంలోనే కల్యాణదుర్గంలో పనిచేసుకోవాలని సురేంద్రబాబుకు సూచించారట చంద్రబాబు. ఈ అనూహ్య పరిణామంతో ఉమామహేశ్వర – హనుమంతరాయ ఉలిక్కిపడ్డారు. తేగేదాకా లాగితే అసలుకే ఎసరని భావించి.. విభేదాలను పక్కనపెట్టి.. తామిద్దరం ఒక్కటేనని చాటుకున్నారు.
రెండు వర్గాలుగా ఇన్నాళ్లూ విడివిడిగా పనిచేసినా.. పార్టీ ఉన్నతి కోసమే కృషి చేశామన్నారు ఉమా మహేశ్వర నాయుడు. ఇద్దరం ఒక్కటై కళ్యాణదుర్గంలో టీడీపీ జెండా ఎగురవేయాలని నిర్ణయించామన్నారు. విభేదాలు పక్కనపెట్టి తమలో టిక్కెట్ ఎవరికి దక్కినా టీడీపీ గెలుపు కోసం పనిచేస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే హనుమంతచౌదరి.
గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఉమామహేశ్వరనాయుడు ఓడిపోయారు. ఆ తర్వాత ఉమా – ఉన్నం వర్గాల మధ్య పూడ్చలేనంత గ్యాప్ వచ్చింది. హనుమంతరాయ తనయుడు మారుతి చౌదరికి టికెట్ ఇవ్వడాన్ని ఉమామహేశ్వర వ్యతిరేకించారు. దీంతో రెండు వర్గాలుగా విడిపోయి ఎవ్వరి కార్యక్రమాలు వాళ్లు చేసుకుంటూ వెళ్తున్నారు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఇద్దరూ ఒకే వేదికను పంచుకోవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
వీళ్లిద్దరి టార్గెట్ ఒక్కటే. టికెట్ ఇస్తే ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఇవ్వాలి.. అంతేగానీ సురేంద్రబాబుకి ఇవ్వొద్దన్నది వీళ్ల డిమాండ్‌గా కనిపిస్తోంది. మరి సురేంద్రబాబు ఎలా స్పందిస్తారు..? అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
