Gudivada Casino: ఢిల్లీకి చేరిన గుడివాడ క్యాసినో వ్యవహారం.. ఈడీకి ఫిర్యాదు చేసిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ కాక పుట్టించిన క్యాసినో వ్యవహారం.. ఢిల్లీకి చేరింది. ఈ విషయంలో దర్యాప్తు చేయాలంటూ.. ఈడీకి ఫిర్యాదు చేసింది టీడీపీ.
TDP Panel Complaint on Casino: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) పాలిటిక్స్ కాక పుట్టించిన క్యాసినో వ్యవహారం.. ఢిల్లీకి చేరింది. ఈ విషయంలో దర్యాప్తు చేయాలంటూ.. ఈడీ(ED)కి ఫిర్యాదు చేసింది తెలుగు దేశం పార్టీ బృందం(TDP). మాజీ మంత్రి ఆలపాటి రాజా(Alapati Raja)తో కలిసి.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌కు టీడీపీ పార్లమెంటు సభ్యులు రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) ఫిర్యాదు చేశారు. సంక్రాంతి సందర్భంగా మూడ్రోజుల పాటు కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినో నిర్వహించారనీ.. దాదాపు 500కోట్ల రూపాయలు చేతులు మారాయనీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు వివరించారు. ఈడీ తగిన చర్యలు తీసుకుంటుందనే విశ్వాసం తమకుందనీ.. ఎంపీ రామ్మోహన్‌నాయుడు చెప్పారు. క్యాసినో జరిగిందని చెప్పేందుకు అవసరమైన అన్ని ఆధారాలనూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు అందించామని చెప్పారు.
గతనెల సంక్రాంతి సందర్భంగా గుడివాడలో మూడ్రోజుల క్యాసినో నిర్వహించారు. అయితే, ఇది మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలోనే జరిగిందంటూ… ఆరోపణలు చేస్తోంది టీడీపీ. దీనిపై నిజానిజాలు తేల్చేందుకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ గుడివాడకు వెళ్లడతో… ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం టీడీపీ,వైసీపీ నేతలపై కేసులు.. పరస్పర సవాళ్లు, ప్రతిసవాళ్లతో వ్యవహారం తీవ్ర రచ్చ రేపింది.
దాదాపు రెండువారాల పాటు ఈ అంశం ఏపీ పాలిటిక్స్‌లో దుమారం రేపింది. నేతలు నోటికి పనిచెప్పడంతో… మాటల తూటాలు పేలాయి. దూషణల పర్వం మొదలైంది. అయితే, టీవీ9 జోక్యంతో ఈ వివాదానికి పుల్‌స్టాప్ పడింది. రెండు పార్టీల నేతల మధ్య ధూషణలు జరగకుండా.. టీవీ9 డిబేట్‌లో జెంటిల్‌మెన్ అగ్రిమెంట్ జరగడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఆ తర్వాత క్యాసినో వ్యవహారం కూడా చల్లబడింది. ఇప్పుడు, దీనిపై టీడీపీ నేతలు ఈడీకి ఫిర్యాదు చేయడంతో మరోసారి క్యాసినో అంశం తెరమీదకొచ్చింది. ఇది ఇక్కడితో ఆగుతుందా? మళ్లీ సెగరేపుతుందా? అనేది చూడాలి.