Andhra Pradesh: అధికార, ప్రతిపక్షాల మధ్య అగ్గి రాజేసిన ‘పేరు’ మార్పు.. మిన్నంటిన ఆందోళనలు
ఒకే ఒక పేరు మార్పు ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. తమ నిర్ణయాన్ని అధికారపార్టీ వైసీపీ సమర్థించుకుంటుండగా.. ప్రతిపక్ష టీడీపీతో పాటు ఇతర రాజకీయ పక్షాలు, మేధావులు సైతం ప్రభుత్వ తీరును..
Andhra Pradesh: ఒకే ఒక పేరు మార్పు ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. తమ నిర్ణయాన్ని అధికారపార్టీ వైసీపీ సమర్థించుకుంటుండగా.. ప్రతిపక్ష టీడీపీతో పాటు ఇతర రాజకీయ పక్షాలు, మేధావులు సైతం ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు. కొత్త పథకాలు, లేదా సంస్థలకు ఏ పేరు పెట్టుకున్నా ఎవరికి ఎటువంటి అభ్యంతరం ఉండబోదని, ఇప్పటికే ఉన్న ఓ సంస్థకు ఓ మహానాయకుడి పేరు తొలగించి.. వేరే నేత పేరు పెట్టడం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు ఇదే అంశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది తెలుగుదేశం పార్టీ. విజయవాడలోని ఎన్డీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై అసెంబ్లీలోనే కాకుండా.. సభ బయట కూడా రచ్చ కంటిన్యూ అయింది. బిల్లు విత్ డ్రా చేసుకోవాలని టీడీపీ నిరసనలతో హోరెత్తించింది. అటు వైసీపీ మాత్రం ఎన్టీఆర్ పేరెత్తే అర్హత టీడీపీకి లేదంటూ ఎదురుదాడికి దిగింది. పోటాపోటీ డైలాగ్ వార్‌తో ఏపీ రాజకీయం వేడెక్కింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఎదుట తెలుగు యువత ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మహనీయుడి పేరు మార్చడం సిగ్గు సిగ్గంటూ నినాదాలు చేశారు. యూనివర్శిటీలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రధాన రహదారిపై బైఠాయించి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గుంటూరులోనూ టీడీపీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అత్యంత హేయమైన చర్య అంటూ నాయకులు మండిపడ్డారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడం తుగ్లక్ చర్యగా అభివర్ణించారు టీడీపీ అధినేత చంద్రబాబు. పేరు మార్పుపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఆందోళనలు కొనసాగాయి. వైసీపీ ప్రభుత్వం తక్షణమే పేర్పు మార్పు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు లేదంటూ వైసీపీ కౌంటర్ ఎటాక్ కు దిగింది. ఎన్టీఆర్ ను అవమానించిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడింది. ఎన్టీఆర్ అంటే తమకు, తమ పార్టీకి ఎంతో గౌరవం ఉందన్నారు మంత్రి జోగి రమేష్. అందుకే విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టామన్నారు. మొత్తం మీద ప్రతిపక్షాల ఆందోళనలు జరుగుతున్నప్పటికి ప్రభుత్వం మాత్రం తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడుతూ.. ఉభయసభల్లో హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు బిల్లు ఆమోదం పొందింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..