Vangaveeti Radha: రెక్కీ చేసింది అతడే అని ప్రచారం.. రాధాకు చంద్రబాబు ఫోన్
బెజవాడ రాజకీయం వేడెక్కింది. వంగవీటి రాధాపై రెక్కీ అంశం కీలక మలుపు తిరిగింది. తనకు గన్‌మెన్‌లు అవసరం లేదని పంపించివేశారు రాధా.
బెజవాడ రాజకీయం వేడెక్కింది. వంగవీటి రాధాపై రెక్కీ అంశం కీలక మలుపు తిరిగింది. తనకు గన్‌మెన్‌లు అవసరం లేదని పంపించివేశారు రాధా. ప్రజలతో ఉండే మనిషిని కాబట్టి సెక్యూరిటీ అవసరం లేదని స్పష్టం చేశారు. ఐతే రాధాపై రెక్కీ చేసింది వైసీపీ కార్పొరేటర్ ఆరవ సత్యనారాయణ అంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చారు ఆయన కుమారుడు చరణ్ తేజ.
తన తండ్రి పోలీసుల అదుపులో ఉన్నారన్నది పూర్తి అవాస్తవమని వివరణ ఇచ్చారు. తన తండ్రికి రెండ్రోజులుగా ఆరోగ్యం బాలేకపోవడంతో ఐసీయూలో ఉన్నారని..తన తండ్రిపై కావాలనే బురద జల్లుతున్నారని ఆరోపించారు. రాధాపై రెక్కీ నిర్వహించారన్న అనుమానంతో ఆరవ సత్యం, దేవినేని అవినాష్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు వంగవీటి అనుచరులు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. వంగవీటి రాధా హత్యకు కుట్రపన్నిన వారిపై.. చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని..ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. రెక్కీ నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. రాధాకు కూడా ఫోన్ చేసిన చంద్రబాబు.. రెక్కీ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ పరంగా అండగా ఉంటామని తెలిపారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Also Read: ప్రజాక్షేత్రంలో ఉండేవారికి ఎలాంటి భద్రత అక్కర్లేదు.. గన్‌మెన్‌ను వెనక్కు పంపిన వంగవీటి రాధా..