Andhra Pradesh: పల్నాడులో దారుణ హత్య.. ఆర్థిక సహాయం ప్రకటించిన టీడీపీ
పల్నాడు(Palnadu) జిల్లా జంగమహేశ్వరపాడులో దారుణ హత్యకు గురైన జల్లయ్య కుటుంబానికి టీడీపీ ఆర్థిక సహాయం ప్రకటించింది. మృతుడి కుటుంబానికి రూ.25 లక్షలు అందిస్తామని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు(Prathipati Pulla Rao) వెల్లడించారు....
పల్నాడు(Palnadu) జిల్లా జంగమహేశ్వరపాడులో దారుణ హత్యకు గురైన జల్లయ్య కుటుంబానికి టీడీపీ ఆర్థిక సహాయం ప్రకటించింది. మృతుడి కుటుంబానికి రూ.25 లక్షలు అందిస్తామని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు(Prathipati Pulla Rao) వెల్లడించారు. జల్లయ్యను హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. పోస్టుమార్టం అనంతరం జల్లయ్య మృతదేహాన్ని నరసరావుపేట(Narasaraopet) నుంచి బొల్లాపల్లి మండలం రావులాపురం తీసుకొచ్చారు. మృతదేహాన్ని అతడి బంధువులకు అప్పగించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే మృతదేహాన్ని తీసుకునేందుకు వారు నిరాకరిస్తున్నారు. ఈ ఘటనపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. పోలీస్ అధికారుల తీరుతో పల్నాడులో శాంతి భద్రతలు గాడి తప్పాయని లేఖలో ఫిర్యాదు చేశారు.
2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పల్నాడు ప్రాంతంలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. హత్యా రాజకీయాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పల్నాడు ప్రాంతంలో దళితులు, బీసీలు, మైనారిటీలపై దాడులు పెరిగాయి. 2019 ఎన్నికల తరువాత వైసీపీ కార్యకర్తల దాడుల భయంతో వేరే ప్రాంతంలో ఉంటున్న జల్లయ్య శుభకార్యంలో పాల్గొనేందుకు వస్తే దారుణంగా చంపేశారు.
– చంద్రబాబునాయుడు, టీడీపీ అధినేత
అసలేం జరిగిందంటే..
పల్నాడు జిల్లా దుర్గి మండలం జంగమహేశ్వరపాడులో 2019 ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నేతల ఆగడాలు తట్టుకోలేక టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న పలు కుటుంబాలు జంగమహేశ్వరపాడు విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయాయి. కంచర్ల జల్లయ్య కుటుంబం కూడా ఇలాగే గ్రామం వదిలి గురజాల మండలం మాడుగులలో నివాసముంటోంది. తమ కుటుంబంలో పెళ్లి నేపథ్యంలో బ్యాంకు పని, పెళ్లి కార్డులు పంచేందుకు జల్లయ్య శుక్రవారం దుర్గి వచ్చారు. అక్కడి నుంచి బొల్లాపల్లి మండలం రావులాపురానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో జంగమహేశ్వరపాడు మీదుగా వస్తారని తెలుసుకున్న ప్రత్యర్థులు గ్రామ సమీపంలోని అడ్డరోడ్డువద్ద కాపు కాశారు.
బైక్ లపై జల్లయ్యతో పాటు ఆయన బంధువులు ఎల్లయ్య, బక్కయ్య వస్తుండగా అడ్డగించి, దాడి చేశారు. ప్రత్యర్థులు జల్లయ్యపై గొడ్డళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడిచేశారు. ఈలోగా చుట్టుపక్కల వాళ్లు రావడంతో అక్కడి నుంచి పరారయ్యారు. 108లో జల్లయ్యను మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చి ప్రాథమిక వైద్యం అందించారు. మెరుగైన చికిత్స కోసం నరసరావుపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జల్లయ్య మృతి చెందారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి