Stray Dogs: బాబోయ్ కుక్కలు.. తెలుగు రాష్ట్రాల్లో దడపుట్టిస్తున్న శునకాలు.. ఆ జిల్లాల్లో భయం భయం..
ఓ వైపు ఎండాకాలంలో అకాల వర్షాలు ఆగమాగం చేస్తుంటే.. మరోవైపు వీధుల్లో రెచ్చిపోతున్న కుక్కలు జనాల్ని బెంబేలెత్తిస్తున్నాయ్. తెలుగు రాష్ట్రాల్లో చిన్నారులే లక్ష్యంగా జరుగుతున్న శునకపు దాడులు.. భయాందోళనలను పెంచుతున్నాయ్.
ఓ వైపు ఎండాకాలంలో అకాల వర్షాలు ఆగమాగం చేస్తుంటే.. మరోవైపు వీధుల్లో రెచ్చిపోతున్న కుక్కలు జనాల్ని బెంబేలెత్తిస్తున్నాయ్. తెలుగు రాష్ట్రాల్లో చిన్నారులే లక్ష్యంగా జరుగుతున్న శునకపు దాడులు.. భయాందోళనలను పెంచుతున్నాయ్. తాజాగా, పలుచోట్ల జరిగిన సంఘటనలు.. పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నిన్న తెలుగు రాష్ట్రాల్లో కుక్కల దాడి ఘటనల్లో పలువురు గాయపడ్డారు. ఉమ్మడి కడప జిల్లాలో కుక్కలు కస్సుబుస్సుమంటూ జనాలమీదకు ఎగబడి వచ్చేస్తున్నాయ్.
అన్నమయ్య జిల్లాలో
అన్నమయ్య జిల్లా రాజంపేటలో.. మరోసారి కుక్కల స్వైరవిహారం వణుకుపుట్టిస్తోంది. మూడేళ్ల పసివాడు కుక్కదాడిలో తీవ్రంగా గాయపడటం కలకలం రేపుతోంది. బాలుడికి కుడికన్ను, నుదురు భాగాల్లో.. బాగా రక్తస్రావమైంది. దీంతో, రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు… కుక్కల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు స్థానికులు.
పల్నాడు జిల్లాలో..
పల్నాడు జిల్లాలో జనాలకు పట్టపగలే చుక్కులు చూపిస్తున్నాయ్ వీధికుక్కలు. నలుగురు చిన్నారులపై దాడికి పాల్పడింది ఓ వీధికుక్క. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బెల్లంకొండ మండలం వన్నాయపాలెంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. కుక్కల దాడులతో భయాందోళన చెందుతున్నారు స్థానికులు.
ఖమ్మం జిల్లాలో..
తెలంగాణలోనూ పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. కుక్కల్ని చూస్తే చాలు.. జనాలకు ఒంట్లో వణుకు వచ్చేస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో వీధి కుక్కల దాడిలో.. ఓ చిన్నారి గాయపడిన ఘటన సంచలనంగా మారింది. స్కూల్ దగ్గర ఆడుకుంటున్న చిన్నారి మోక్షిత్‌పై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాయి కుక్కలు. దీంతో మోక్షిత్ చెంపకు తీవ్రగాయమైంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం