Andhra Pradesh: ప్లాన్ వేశారు.. నీళ్లను ఖాళీ చేశారు.. దంపతులను కొట్టి తాళ్లతో కట్టి.. చివరకు

ఇంటి బయట ఉన్న నీటి కుళాయి ద్వారా ట్యాంక్ లో ఉన్న నీటిని వదిలి ట్యాంక్ ఖాళీ చేశారు. ఆ క్రమంలోనే రామ్మూర్తి అర్ధరాత్రి నిద్రలేచి బాత్రూమ్ కు వెళ్లేందుకు ప్రయత్నించగా కుళాయిలో నీరు రాలేదు. దీంతో ట్యాంక్ లో నీరు అయిపోయిందని అనుకొని రామ్మూర్తి ఇంటి బయట ఉన్న మోటార్ స్విచ్ ఆన్ చేసేందుకు ఇంట్లో నుండి బయటకు వచ్చాడు.

Andhra Pradesh: ప్లాన్ వేశారు.. నీళ్లను ఖాళీ చేశారు.. దంపతులను కొట్టి తాళ్లతో కట్టి.. చివరకు
Ap Crime News
Follow us
G Koteswara Rao

| Edited By: Shaik Madar Saheb

Updated on: Feb 28, 2024 | 8:20 PM

ప్రశాంతంగా ఉండే పార్వతీపురం మన్యం జిల్లాలో.. వరుస దొంగతనాలు, దోపిడీలతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. నిత్యం ఏదో ఒకచోట దోపిడి దొంగలు చేస్తున్న బీభత్సానికి ఎవరి ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియక లబోదిబోమంటున్నారు. తాజాగా గరుగుబిల్లి మండలం ఖడ్గవలస జంక్షన్ లో జరిగిన దోపిడీ భయానక వాతావరణాన్ని సృష్టించింది. అర్ధరాత్రి సినీ ఫక్కీలో దుండగులు ఓ వ్యాపారి ఇంట్లోకి చొరబడి దొరికినకాడికి దోచుకెళ్లారు. ఖడ్గవలస జంక్షన్ లో కిమిడి శ్రీరామ్మూర్తి అనే వ్యాపారి రైస్ మిల్లు నడుపుతున్నాడు. రామ్మూర్తి, ఆయన భార్య రత్నంతో కలిసి ఖడ్గవలస జంక్షన్ లో మెయిన్ రోడ్డు ప్రక్కనే ఉన్న తన సొంత ఇంట్లో నివాసం ఉంటున్నాడు. గత కొన్నేళ్లు గా స్థానికంగా రైస్ మిల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు ఈ దంపతులు. ఇంట్లో ఇద్దరు దంపతులు మాత్రమే ఉంటున్న విషయాన్ని గమనించిన దుండగులు శ్రీరామ్మూర్తి ఇంటిని టార్గెట్ చేశారు. రాత్రి తొమ్మిది గంటలకు మెయిన్ డోర్ కి గడియ పెట్టి ఇంట్లోకి వెళ్తే తిరిగి తెల్లవారే వరకు శ్రీరామ్మూర్తి దంపతులు బయటకురారు. దీంతో ఎలాగైనా సరే వారిని ఇంట్లో నుండి బయటకు రప్పించాలని మాస్టర్ ప్లాన్ వేశారు దుండగులు.

దానికోసం ప్లాన్ రచించారు. ఇంటి బయట ఉన్న నీటి కుళాయి ద్వారా ట్యాంక్ లో ఉన్న నీటిని వదిలి ట్యాంక్ ఖాళీ చేశారు. ఆ క్రమంలోనే రామ్మూర్తి అర్ధరాత్రి నిద్రలేచి బాత్రూమ్ కు వెళ్లేందుకు ప్రయత్నించగా కుళాయిలో నీరు రాలేదు. దీంతో ట్యాంక్ లో నీరు అయిపోయిందని అనుకొని రామ్మూర్తి ఇంటి బయట ఉన్న మోటార్ స్విచ్ ఆన్ చేసేందుకు ఇంట్లో నుండి బయటకు వచ్చాడు. అలా రామ్మూర్తి బయటకు రాగానే ఇద్దరు ముసుగు ధరించిన దుండగులు రామ్మూర్తి పై దాడిచేశారు. ఏమి జరుగుతుందో తెలుసుకునేలోపే తాళ్లతో చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కారు. అదే సమయంలో మరో ముగ్గురు దుండగులు ఇంట్లోకి చొరబడి రామ్మూర్తి భార్య రత్నం పై దాడి చేసి చితకబాదారు. ఆమెకు కూడా కాళ్లు, చేతులు కట్టేసి ఇంటి బయటకు ఈడ్చుకొచ్చి విచక్షణారహితంగా కొట్టారు.

తమను వదలమని వేడుకున్నా కనికరించకుండా శరీరంపై గాయాలయ్యేలా కొట్టి.. తాళ్లతో స్తంభానికి కట్టేశారు. తమకు రెండు కోట్లు డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. తమ వద్ద లేవని బ్రతిమిలాడినా ఊరుకోలేదు. బీరువా తాళాలు ఇవ్వాలని చిత్రహింసలు పెట్టారు. వారి వేధింపులు తట్టుకోలేక తాళాలు ఎక్కడ ఉన్నాయో చెప్పడంతో తాళాలు తీసుకొని బీరువాలో ఉన్న వంద తులాల బంగారం, యాభై వేల నగదు కాజేశారు. తరువాత ఖాళీ పేపర్స్ మీద సంతకం పెట్టాలని ఒత్తిడి చేశారు. రైస్ మిల్లు స్వాధీనం చేసుకుంటామంటూ వారితో చెప్పారు.

అయితే అప్పటికే ఆలస్యమై తెల్లవారుతుండటంతో నెమ్మదిగా అక్కడ నుండి జారుకున్నారు దుండగులు. వారు వెళ్తూ వెళ్తూ సీసీ కెమెరా రికార్డింగ్ బాక్స్ కూడా పట్టుకెళ్లారు. ఇదంతా కళ్ల ముందు జరగడంతో పాటు దుండగుల దాడిలో రామ్మూర్తి దంపతులు తీవ్ర గాయాలపాలయ్యారు. తరువాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగప్రవేశం చేసి కేసు నమోదు చేసి వివరాలు సేకరించారు.

నిందితులు తెలుగు, హిందీలో మాట్లాడటంతో వారంతా అంతరాష్ట్ర దొంగల ముఠానా? లేక వ్యాపారి రామ్మూర్తి కోసం తెలిసిన వ్యక్తుల పనా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల కోసం ఏడు బృందాలను ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్తున్నారు పోలీసులు.. అయితే, ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..