Andhra Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరి.. తిరిగిరాని లోకాలకు..

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి కడపకు వస్తున్న ఆర్టీసీ ఏసీ బస్సు, కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

Andhra Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరి.. తిరిగిరాని లోకాలకు..
Road Accident
Follow us
Sudhir Chappidi

| Edited By: Balaraju Goud

Updated on: Oct 23, 2024 | 9:28 PM

శుభకార్యానికి బయలు దేరిన ఆ కుటుంబాలకు తీవ్ర విషాదం ఎదురైంది. పెళ్లి రిసెప్షన్ కు వెళ్తూ దారిలో యాక్సిడెంట్ అయి ముగ్గురు చనిపోయారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం లోని రాజా నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి కడపకు వస్తున్న ఆర్టీసీ ఏసీ బస్సు, కడప నుంచి పెళ్లి రిసెప్షన్ కోసం తిరుపతి వెళుతున్న ఇన్నోవా వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇన్నోవా వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాద సంఘటన ప్రాంతంలో ఒకరు చనిపోగా, ఆపస్మారక స్థితిలో ఉన్న వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ ఆసుపత్రిలో మరో ఇద్దరు కన్నుమూశారు. మరో నలుగురికి తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి.

ఆర్టీసీ ఏసీ బస్సు +- ఇన్నోవా వాహనం ఎదురెదురుగా అతివేగంగా ఢీకొట్టుకున్నాయని అందుకే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని స్థానికులు అంటున్నారు. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఇద్దరికీ మాత్రమే గాయాలు అయ్యాయి. అయితే ఇన్నోవాలో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు చనిపోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇన్నోవా వాహనం ముందు భాగమంతా పూర్తిగా ధ్వంసమైంది. వివాహ రిసెప్షన్ కు వెళుతున్న వారు ఆనందంగా గడపాల్సింది పోయి ముగ్గురు మృత్యువాత పడటంతో బంధువులంతా శోకసంద్రంలో మునిగిపోయారు.

రోడ్డు ప్రమాదంతో చనిపోయిన వారిని కర్నూలు జిల్లాకు చెందిన కుటుంబంగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న రైల్వేకోడూరు పోలీసులు మృతుల వివరాలు సేకరించి వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. వాహనాలలో ప్రయాణించేవారు ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారు వాహనాలను అతివేగంగా నడపడం మానివేయాలని పోలీసులు సూచిస్తున్నారు. అతివేగం కారణంగానే మూడు నిండు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని అంటున్నారు