Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sir Arthur Cotton: తరాలు మారినా గోదారి గుండె చప్పుడు ఆ దొరే..! భగీరధుని మించిన మహనీయుడు కాటన్..!!

మనిషి ఎక్కడ పుడితేనేమి.. మానవత్వం ఉండాలి.. సాటి మనిషికష్టపడుతుంటే చేతనైనంత సాయం చేసే గుణం ఉండాలి.. అటువంటి వ్యక్తులను ఎవరైనా సరే ఆదరిస్తారు..

Sir Arthur Cotton: తరాలు మారినా గోదారి గుండె చప్పుడు ఆ దొరే..! భగీరధుని మించిన మహనీయుడు కాటన్..!!
Sir Arthur Thomas Cotton
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 15, 2023 | 7:38 PM

నిత్య గోదావరీ స్నాన పుణ్యదోయోమహమతిః

స్మరామ్యాంగ్లేయ దేశీయం కాటనుం తం భగీరథం

దీనిని ఎప్పుడైనా విన్నారా? గోదావరి గుండె చప్పుడు తెలిసిన వారికి ఈ రెండు లైన్లు దాదాపుగా కంఠతా వచ్చేసి ఉంటాయి. గోదావరి పుష్కరాలకు వెళ్ళినపుడు అక్కడ పంతులుగారు గోదావరి నీటిలో మనతో సంకల్పం చెప్పించినపుడు వినే ఉండవచ్చు. మనమంతా అదేదో మామూలుగా తీసుకుని వదిలేస్తాం. కానీ.. దానిని జాగ్రత్తగా చదవండి. అందులో రెండో లైనులో భగీరధుని ముందు వచ్చిన పేరు చూడండి. అవును.. అది కాటన్ మహాశయుడి పేరే. గోదావరి గల గలలు ఎక్కడ ఎలా ఉన్నా.. గోదావరి జిల్లా వాసుల గుండెల్లో మాత్రం కాటన్ గుండె చప్పుడులా వినిపిస్తాయి. ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. గోదారమ్మ చెంత తన పేరును చిరస్మరణీయంగా నిలుపుకున్న సర్ ఆర్ధర్ కాటన్ మహాశయుడికి గుండెల్లో గుడికట్టుకోవాడమే కాదు.. గోదావరిలో స్నానం చేసిన ప్రతిసారీ ఆయనను తలచుకుంటూ మొక్కుతారు గోదావరి వాసులు. ఒక్క మాటలో చెప్పాలంటే.. మనిషి ఎక్కడి వాడు అన్నది కాదు అందరి వాడు గా తరతరాలు మంది గుండెల్లో కొలువు తీరాలంటే ఏమి చేయాలో చేసి చూపించిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్..

మనిషి ఎక్కడ పుడితేనేమి.. మానవత్వం ఉండాలి.. సాటి మనిషి కష్టపడుతుంటే చేతనైనంత సాయం చేసే గుణం ఉండాలి.. అటువంటి వ్యక్తులను ఎవరైనా సరే ఆదరిస్తారు.. తమ జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు.. ఇంకా చెప్పాలంటే తమపాలిట దైవంగా కొలుస్తూనే ఉంటారు. బాషా, దేశం వంటివి ఏమి సాయం చేయడానికి అడ్డుకాదని కాటన్ దొర నిరూపిస్తే.. సాయం చేసిన వారిని.. తమకు మేలు చేసిన వ్యక్తులను జన్మలో మరచిపోమని గోదావరి జిల్లా వాసులు నేటికీ నిరూపిస్తూనే ఉన్నారు. ఇంగ్లాండ్ లో పుట్టినా.. ఆంధ్రాలో అత్యంత ఆదరణ పొందిన వ్యక్తి.. గోదావరి జిల్లాలకు అపర భగీరధుడు సర్ ఆర్ధర్ కాటన్..

అవును కాటన్ పుట్టింది 15 వ తేదీ మే 1803 ఇంగ్లాండ్ దేశంలో.. అయితే ఆయనను సొంతదేశం.. రక్తసంబంధీకులు కూడా ఇవ్వని గుర్తింపు.. మర్యాద ఆంధ్ర ప్రదేశ్ లో దక్కింది. ముఖ్యంగా గోదావరి జిల్లా  వాసులు ముద్దుగా అపర భగీరధుడు అని పిలుచుకొని మురిసిపోతారు. ఈ రోజు కాటన్ దొర జయంతి.

ఇవి కూడా చదవండి

సర్ ఆర్ధర్ కాటన్ 1820 లో మనదేశంలోకి మద్రాస్ లో మొదటి సారి అడుగు పెట్టారు.. ఆయన మొదలు పెట్టిన మొదటి సాగు నీటి ప్రాజెక్ట్ తంజావూరులోని కావేరి నదిపై.. ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయగానే తంజావూరు అప్పట్లో ఎక్కువ రెవెన్యూ వున్న జిల్లాగా మారింది. అనంతరం కాటన్ దొర మహారాష్ట్రలోని గోదావరి నది జన్మస్థానం నుండి స్వయంగా గుర్రం మీద ప్రయాణిస్తూ.. ఉభయగోదావరి జిల్లాలో అడుగు పెట్టారు.. ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్టకి అనుకూలంగా ఉంటుంది చెప్పడమే కాదు.. బ్రిటిష్ వారు వద్దు అని అంటే.. అటు ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందని.. ఇటు ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి ఒప్పించారు.

కాటన్ మాటలపై విశ్వాసం ఉంచిన అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ధవళేశ్వరం మీద ప్రాజెక్ట్ పై రిపోర్ట్ ను అడిగింది. దీంతో ఆయన 1845 లో సబ్మిట్ చేశారు. రెండేళ్ల తర్వాత ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ప్రారంభమైంది.  1847 లో ధవళేశ్వరం వద్ద సాగు నీటి ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభించారు. 1852 లో నీటి విడుదలను చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా  గోదావరి జిలాల్లోని అనేక ప్రాంతాల్లో 1852 ముందు 80 వేల ఎకరాలకి..1889 నాటికి ఆరు లక్షల పద్దెనిమిదివేల ఎకరాలకి.. 1936 నాటికి దాదాపు ఎనిమిది లక్షల ఎకరాలని నీరు అందేది. నేడు..దాదాపు అనేక లక్షల ఎకరాలకి కి సాగునీరు అందుతుంది అంటే కేవలం కాటన్ చలవే.. అని చెప్పవచ్చు..

అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్న సమయంలో కాటన్ కొడుకు మరణించారు.. అయినా ప్రాజెక్ట్ పూర్తి అయితే రైతుల కళ్ళలో కనిపించే ఆనందం కోసం ఎంతో అంకితంగా పనిచేసిన మహానుభావుడు.. నేటికీ ఈ ఆనకట్ట    చెక్కు చెదరకుండా ఉన్నదంటే.. ఆయన అంకిత భావమే.. ఇప్పటికీ ధవళేశ్వరం ఆనకట్టలో ఒక్క చిన్న పగులుకాని.. చిన్న ఇసుకసున్నం ఉడిపోలేదు.. అంటే ఆ కట్టడం ఎలాందో ఉహించవచ్చు.

అందులకనే గోదావరి జిల్లా వసూలు మేము కాటన్ వేసిన భిక్షతో బ్రతుకుతున్నాం అని చెబుతారు. ఈ మాటలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. 1982 నాటికి గోదావరి జిలాల్లో కాటన్ గారి విగ్రహాలు 3000 ఉన్నాయి.. ఈ విగ్రహాలన్నీ గోదావరి జిల్లా వసూలు ఆయాన మీద ప్రేమతో భక్తితో నిర్మించుకున్నవి.. గోదావరి జిల్లా ప్రజలు తాగే ప్రతి నీటి చుక్క.. తినే ప్రతి బియ్యం గింజ మీద ఆయన పేరు రాసి ఉంటుంది అని పెద్దలు చెప్పడంతో అతిశయోక్తి లేదు.. దేశం కానీ దేశం వచ్చి ఇక్కడ ప్రజల కోసం ఎంతో అంకిత భావంతో పనిచేసిన మహానుభావుడు జయంతి నేడు..

మరిన్ని ఏపీ వార్తల కోసం..