Weather Report: ఏపీకి వాతావరణశాఖ బిగ్ అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. జాగ్రత్తగా ఉండండి..
ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. రాష్ట్రంలో మంగళవారం భారీగా వర్షాలు పడతాయని సూచించింది. ఈ మేరకు వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నైరుతి రుతువపనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలుకానున్నాయని చెప్పవచ్చు.

ఏపీలో జూన్ 9న అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంగళవారం పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే అల్లూరి సీతారామరాజు, మార్కాపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆకస్మికంగా ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, విద్యుత్ స్తంబాలు, హోర్డింగ్స్ క్రింద నిలబడొద్దని సూచించారు.
ప్రజలకు హెచ్చరిక
పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ, వాటికి వీలైనంత దూరంగా ఉండాలన్నారు. మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందన్నారు. సోమవారం నెల్లూరు జిల్లా గూడూరులో 41.7, తూర్పుగోదావరి జిల్లా చిట్యాల 41.4, అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరంలో 41.2, కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 41 చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు పేర్కొన్నారు.
నైరుతి రుతుపవనాలపై అప్డేట్..
నైరుతి రుతుపవనాలపై వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణను నైరుతి రుతుపవనాలు తాకాయి. దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడ్రోజుల పాటు వానలు పడనున్నాయి. దీంతో తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాలకు వర్షసూచన జారీ చేసింది.
